వైరస్ ప్రభావం: కొత్త ప్రపంచానికి బీజం... 

వైరస్ ప్రభావం: కొత్త ప్రపంచానికి బీజం... 

ప్రపంచానికి అతి త్వరగా బాగా దగ్గరైన పేరు కరోనా.  ఇది మహమ్మారిగా మారుతుందని ఎవరూ ఊహించలేదు.  మనిషి నిర్లక్ష్యం కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి ఒక దుస్థితి ప్రపంచానికి వస్తుందని ఎవరూ కూడా ఊహించలేదు.   కొన్ని మార్పులు జరగడానికి కొన్ని రకాల సంఘటనలు కారణం అవుతుంటాయి అని అంటుంటారు.  ప్రపంచంలో వినూత్నమైన మార్పులు జరగడానికి కరోనా ఒక కారణం కావొచ్చు.  

కరోనా సమయంలో ప్రతి దేశంలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి.  ఆర్ధికంగా ప్రపంచం సవాళ్ళను ఎదుర్కొంటున్నా, సామాజికంగా ఒక్కటిగా నిలబడేందుకు కరోనా సహకరించింది.  బలహీనంగా ఉండే చాలా దేశాల ప్రభుత్వాలు బలంగా మారడానికి, కరోనా దోహదం చేసింది.  ఇక తాలిబన్, బ్రెజిల్ లో మాఫియాలు అక్కడి ప్రభుత్వాలకు సహకరిస్తున్నాయి.  సైనికులు బోర్డర్ కు మాత్రమే పరిమితం కావాలి అని చెప్పిన చాలా దేశాలు ఇప్పుడు ఆ సైనికుల సహకారంతోనే కరోనా కట్టడికి ప్రయత్నం చేస్తున్నాయి.  

ముఖ్యంగా ప్రపంచంలో ఇండియా అనుసరిస్తున్న విధానం, చేస్తున్న సహాయం గురించి అనేక దేశాలు మెచ్చుకుంటున్నాయి.  కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో మానవత్వంతో సార్క్ దేశాలకు సహకారం అందించింది.  ఒక్క సార్క్ దేశాలకే కాకుండా అనేక దేశాలకు మెడిసిన్ అందిస్తూ శభాష్ అనిపించుకుంటోంది.  లాక్ డౌన్ కారణంగా డిజిటల్ రంగం అభివృద్ధి చెందుతున్నది.  పాఠశాలలు మూసెయ్యడంతో డిజిటల్ రంగం ద్వారా విద్యార్థులకు పాఠాలు చెప్తున్నారు. 

భవిష్యత్తులో ఈ దిశగానే ఎక్కువ శాతం విద్య నడవబోతున్నది. పోలీస్ వ్యవస్థ బలపడటంతో క్రైమ్ రేట్ తగ్గిపోయింది.  ఇది శుభసూచకం అని చెప్పాలి.   ఇంటి నుంచి పనిచేసే అవకాశం ఉన్న రంగాలకు కరోనా తరువాత కూడా ఇంటి నుంచే పనిచేసే సౌకర్యాలు కల్పిస్తే... ప్రపంచంలో పొల్యూషన్ చాలా వరకు తగ్గిపోతుంది.  అటు వ్యాపార వర్గాలకు మౌలిక సౌకర్యాల కల్పనను కొంతవరకు తగ్గించుకోవచ్చు.  మొత్తంగా కరోనా మహమ్మారి తరువాత ప్రపంచంలో చాలా మార్పులు జరగబోతున్నట్టు మాత్రం స్పష్టంగా అవగతం అవుతున్నది.