టీడీపీలో ఏం జరుగుతోంది? మరికొందరు గోడ దూకుతారా?

టీడీపీలో ఏం జరుగుతోంది? మరికొందరు గోడ దూకుతారా?

ఇటు టిడిపిలో మిగిలేది ఎందరు అనే ప్రచారం నేటిది కాదు. అయితే వేరే పార్టీ గుర్తుపై గెలిచినవారెవరినీ  చేర్చుకోబోమని జగన్‌ గతంలో ప్రకటించారు. చంద్రబాబులా ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యడం, ప్రలోభాలు పెట్టడం లాంటివి తమ హయాంలో ఉండవని చెప్పేశారు. ఈ కామెంట్‌పై అన్ని వర్గాల నుంచి ఆయనపై ప్రశంసలు కురిశాయి. ఉన్న పదవి వదులుకుని వస్తేనే పార్టీలోకి ఆహ్వానం అంటూ తేల్చి చెప్పేశారు. ఇది టీడీపీకి వరంగా మారింది. అలాగే గోడ దూకుదామనుకున్నవారికి నిరాశ మిగిలింది. కానీ తర్వాత కాలంలో పరిస్థితి మారిపోయింది. సైకిల్‌ పార్టీలో 23 మంది ఎమ్మెల్యేలు ఉండగా....అందులో ముగ్గురు దూరమయ్యారు. వంశీని సభలో ప్రత్యేక సభ్యునిగా చూస్తానని కూడా స్పీకర్ ప్రకటించారు. ఇటు చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు దూరం కావాలంటే ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ వీడాల్సి ఉంది. ఇప్పుడు 20 మంది ఉండగా... మరో ముగ్గురు చేజారితే బాబు ప్రతిపక్ష హోదా పోతుందన్నది ప్రత్యర్ధి పార్టీ లెక్క.  అయితే అందుకోసమే తమ ఎమ్మెల్యేలను లాగేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తోంది సైకిల్ పార్టీ. అయితే ఎమ్మెల్యేలను చేర్చుకునే విషయంలో కొనుగోళ్ల లాంటి ప్రస్తావన ఎక్కడా కనిపించడం లేదు. నియోజవకర్గ అవసరాలో... ఇతర విషయాల్లో ప్రభుత్వం సహకారం ఉంటుందనే కోణంలో మాత్రమే చేరికలు ఉంటున్నాయని ప్రచారం జరుగుతోంది.

ఇక్కడ మరో విషయం ఏంటంటే నిజంగానే ఆర్థిక ప్రలోభాలతో అధికార పార్టీ మరో ముగ్గురు ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవాలంటే పెద్ద విషయం కాదని ఆ పార్టీనేతలు చెపుతున్నారు. అయితే ఇలా గోడ దూకేవారికి స్పష్టమైన హామీలు లేకపోవడం, ఆర్థికంగా, పదవుల పరంగా ఎటువంటి భరోసా సిఎం నుంచి రాకపోవడంతో వెళ్లాలనుకున్నవారు కూడా ఎందుకులే అని వెనక్కి తగ్గినట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే వెళ్లిన వారి పరిస్థితి గమనించిన కొందరు నేతలు కూడా పార్టీ మారే విషయంలో ఆలోచనలో పడ్డారన్నది తమ్ముళ్ల లెక్క. ఇటు అధికారపార్టీ విషయానికి వస్తే..  ఇలా తమ గూటికి వస్తున్న ఎమ్మెల్యేలకు పార్టీ జెండా కప్పే విషయంలోనూ భిన్నంగా వ్యవహరిస్తోంది. అలాంటిది  ప్రభుత్వంలో పదవులు, ఇతర పనుల విషయంలో ఎమ్మెల్యేలు ఎక్కువ ఆశించినా ఉపయోగం ఉండదనే వాదన కూడా ఉంది. ఈ కారణాలతోనే గత కొద్దిరోజులుగా జరిగిన సంప్రదిపుల తరువాత కూడా ఎమ్మెల్యేలు అటు వెళ్లేందుకు ఇష్టపడడం లేదని చర్చించుకుంటున్నారు. కానీ అధికార పార్టీలోని కొందరు మంత్రులు, ముఖ్యనేతల నుంచి పార్టీ మార్పు అంశంపై ప్రతిపాదనలు, చర్చలు వాస్తవమన్నది టీడీపీ లెక్క.