ఉద్యోగులకు కొత్త టెన్షన్..! ఏప్రిల్‌లోనూ తప్పదా..?

ఉద్యోగులకు కొత్త టెన్షన్..! ఏప్రిల్‌లోనూ తప్పదా..?

కరోనా ఎఫెక్ట్‌తో లాక్‌డౌన్ విధించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. సర్వం బంద్ కావటంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా సున్నా అయింది. అన్ని వ్యవస్ధలు స్తంభించి పోవటంతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యింది. దీంతో, తెలంగాణ సీఎం కేసీఆర్... మంత్రులు. ఎమ్మెల్యేలు,. ఎమ్మెల్సీల వేతనాల్లో 75 శాతం కోత విధించారు. ఇక ఐఏఎస్, ఐపీఎస్ ల వేతనాల్లో 60 శాతం కట్ చేశారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం కోత విధించింది. ఇక ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్‌కి 10శాతం, ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్‌లో  పని చేస్తున్న ఉద్యోగులకు 10 శాతం వేతనాల్లో కోత పెట్టేసింది. ప్రస్తుతం విధించిన కోత వేతనాన్ని ఆర్ధికంగా వెసులుబాటులోకి రాష్ట్రం రాగానే పూర్తి జీతంతో పాటు బకాయి వేతనాలు కూడా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీన్ని కొందరు ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. మార్చి 21 నుంచి లాక్ డౌన్ అమలవుతోంది. కేవలం ఆ నెలలో 9 రోజులే ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది.. అప్పుడే 50 శాతం కోత విధించింది ప్రభుత్వం. లాక్ డౌన్ కొనసాగింపులో భాగంగా... ఏప్రిల్ 1 నుంచి మే 3 వరకు కొనసాగుతుందని తేల్చి చెప్పటంతో మళ్లీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఏప్రిల్‌లో 50 శాతం వేతనం అయినా పడుతుందా..? అనేదే ఇప్పుడు అసలు డౌట్.

మార్చి నెలలో మాదిరిగానే ఉద్యోగుల వేతనాల్లో కోత విధించినా... కొన్ని శాఖల ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. ప్రభుత్వం విధించే కోతలో డిడక్షన్స్ లేకపోవటంతో కొంత ఊరట లభించిందని చెప్తున్నాయి. గ్రాస్ సాలరీలో 50 శాతం ఇస్తున్నారు కాబట్టి ఆర్ధికంగా ఇబ్బంది పెద్దగా ఉండదనేది వారి వాదన. అయితే కరోనా విధులు నిర్వహిస్తున్న పంచాయితీ కార్యదర్శలు, వీఆర్వోలు, రెవిన్యూ ఉద్యోగులకు పూర్తిస్ధాయి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఫించన్ దారులు తమ వేతనాల్లో 50 శాతం కోతను విధించటాన్నిసవాల్ చేస్తూ కోర్టుకెక్కారు. ఫించన్ దారులకు కూడా పూర్తి వేతనాలు వేయాలని డిమాండ్ చేస్తన్నారు ఉద్యోగ సంఘాలు. ఉద్యోగులు తమ వేతనాల్లో ఈఎంఐలు, లోన్లు, చిట్టీలు వంటివి కడుతూ ఉంటారు. ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా కొన్ని శాఖలకు మాత్రమే 50 శాతం వేతనం కోతను పరిమితం చేస్తే బాగుంటుందంటున్నాయి ఉద్యోగసంఘాలు. ఔట్ సోర్సింగ్, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ లకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.  మార్చిలో మాదిరిగానే ఏప్రిల్‌లో కూడా ప్రభుత్వం ఆదాయం ఖాళీ. 22 రోజులు వర్కింగ్ పిరియేడ్ లోనే కోత పడిందంటే ఏప్రిల్ లో కోత ఖాయమని ఉద్యోగులు ఇప్పటికే  డిసైడ్ అయ్యారు. అయితే ఉపాధ్యాయ సంఘాలు మాత్రం పూర్తి వేతనాల్ని వేయాల్సిందేనని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. మొత్తానికి ఉద్యోగులకు మాత్రం కొత్త టెన్షన్ పట్టుకుంది..! మార్చి నెల జీతం పడినట్టుగానే.. ఏప్రిల్‌లోనూ కోత తప్పదా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.