తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్‌ ఎంపికపై మళ్లీ అలజడి!

తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్‌ ఎంపికపై మళ్లీ అలజడి!

తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ కొత్త పీసీసీ చీఫ్‌ ఎంపిక అలజడి రేపుతోందా? చాలా రోజుల తర్వాత AICC ఇంచార్జ్ రాష్ట్రానికి రావడంతో పార్టీలో ముఖ్య నేతలు ఆరా తీస్తున్నారా? అధిష్ఠానం పెట్టిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల గడువు దగ్గర పడటంతో కొత్త సారథిపై మంతనాలు జోరందుకున్నాయా?

పీసీసీ చీఫ్‌ ఎంపికపై ఇన్నాళ్లూ అలికిడి లేదు!

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక తర్వాతే కొత్త పీసీసీ నియామకం ఉంటుందని కాంగ్రెస్‌ హైకమాండ్‌ తేల్చడంతో దాదాపు 3 నెలలుగా పార్టీ నేతలు సైలెంట్‌గా ఉండిపోయారు. కొత్త పీసీసీ అంశంపై ఆశలు పెట్టుకోకుండా పూర్తిగా సాగర్ ఎన్నికలపై దృష్టి సారించారు చాలా మంది నాయకులు . AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్ సొంత రాష్ట్రం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజీ ఉండడంతో ఆయన ఎవరికీ అందుబాటులో లేకపోయారు. దీంతో ఆ దిశగా ఇన్నాళ్లూ అలికిడి లేదు.

ఠాగూర్‌ రాగానే వాకబు చేసిన నేతలు!

17తో నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక పోలింగ్‌ ముగుస్తుంది. మే 2న ఫలితాలు వెల్లడి కానున్నా..  వాటితో సంబంధం లేకుండా పీసీసీ చీఫ్‌ ఎంపికలో కదలిక తీసుకొచ్చే పనిలో ఉన్నారు నాయకులు.  హైకమాండ్‌ పెట్టిన గడువు దగ్గర పడటంతో ఆశావహులపై ఇతరులు కూడా చర్చించే పరిస్థితి కనిపిస్తోంది. సాగర్‌ ఉపఎన్నిక కోసం ఇంఛార్జ్‌ ఠాగూర్‌ హైదరాబాద్‌ చేరుకోగానే కొందరు సీనియర్‌ నాయకులు ఆయన్ని కలిసి కొత్త పీసీసీ చీఫ్‌ ఎంపిక ప్రక్రియపై ఆరా తీశారట. నివేదికను ఎప్పుడు పార్టీ చీఫ్‌ సోనియా గాంధీకి ఇస్తున్నారు అని వాకబు చేశారట. సాగర్‌ ఉపఎన్నిక అయిన మూడు నాలుగు రోజులు తర్వాత మేడమ్‌కు  నివేదిక ఇవ్వబోతున్నట్టు ఠాగూర్‌ తనను కలిసి ఆరా తీసిన వారికి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఇది తెలిసినప్పటి నుంచి ఈ అంశంపై పార్టీలో చర్చ పీక్‌కు వెళ్లుతున్నట్టు సమాచారం.

కొత్తగా సంప్రదింపులకు ఆదేశించే ఛాన్స్‌ ఉందా?

ఇంఛార్జ్‌ ఠాగర్‌ నివేదిక ఇచ్చిన వెంటనే పీసీసీ కొత్త చీఫ్‌ను మేడమ్‌ సోనియాగాంధీ ప్రకటిస్తారా? లేక నాగార్జునసాగర్‌ ఉపఎన్నికతోపాటు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగుతారా అన్నది ఉత్కంఠగా మారింది. సోనియా కొంత సమయం తీసుకోవచ్చనే వారు ఉన్నారు. మొన్నటి వరకు రేస్‌లో వినిపించిన పేర్లలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని పరిగణనలోకి తీసుకుంటారా లేదా అని కొందరు ఢిల్లీ వరకు ఆరా తీస్తున్నారట. ఇప్పటి వరకు జరిగిన అభిప్రాయ సేకరణ పక్కన పెట్టి.. మళ్లీ కొత్తగా సంప్రదింపులకు ఆదేశిస్తారేమో అన్న అనుమానాలు ఉన్నాయట. కొత్తగా సంప్రదింపులకు నిర్ణయిస్తే మాత్రం.. పీసీసీ చీఫ్‌ ఎంపిక ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

గెలిస్తే జానారెడ్డి నివేదిక ఇచ్చే వీలుందా?

ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు సీరియస్‌గానే పీసీసీ చీఫ్‌ కుర్చీకోసం చూస్తున్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేను కూడా లైన్‌లో ఉన్నానని చెబుతున్నారు. ఉపఎన్నికలో జానారెడ్డి గెలిస్తే.. ఆయన కూడా రేస్‌లోకి రావొచ్చన్న టాక్‌ ఉంది.  అయితే పీసీసీ చీఫ్‌ పోస్ట్‌పై తనకు ఆశ లేదని జానారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిస్తే మాత్రం.. ఎవరిని పీసీసీ సారథిని చెయ్యాలన్నదానిపై పార్టీ హైకమాండ్‌కు జానారెడ్డి నివేదిక ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

 జానారెడ్డి అభిప్రాయానికి వెయిట్‌ పెరుగుతుందా?

కొత్త సారథి ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చిన సమయంలో జానారెడ్డి చెప్పినందువల్లే  ప్రకటన ఆపినట్టు కాంగ్రెస్‌ హైకమాండ్‌ ప్రకటించింది. ఇప్పుడు ఉపఎన్నికలో ఆయన గెలిస్తే.. జానారెడ్డి అభిప్రాయానికి వెయిట్‌ పెరుగుతుంది. మరి.. ఈ ఉత్కంఠకు ఎప్పుడు తెరపడుతుందో.. మేడమ్‌ దృష్టిలో ఎవరు ఉన్నారో..  రేస్‌లో ఉన్నవారు కాకుండా కొత్త వారిని ఎంపిక చేస్తారో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.