ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త టెన్షన్

ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త టెన్షన్

కరోనా సమయంలో జీతాలు ఇవ్వడానికే ప్రభుత్వ రంగ సంస్థలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ జాబితాలో టీఎస్‌ ఆర్టీసీ కూడా ఉంది. ఇప్పుడిప్పుడే బస్సులు తిరుగుతున్నా ఆదాయం అంతంతే ఉంది. మరి.. ఈ ఏడాది దసరా అడ్వాన్స్‌ కష్టమేనా? కార్మికులు, ఆర్టీసీ వర్గాల్లో జరుగుతున్న చర్చలేంటి 

గతంతో పోల్చుకుంటే రోజులో పావు వంతు ఆదాయం రావడం లేదు!

కరోనా సంక్షోభం టీఎస్‌ ఆర్టీసీని అతలాకుతలం చేస్తోంది. సుదీర్ఘ సమ్మె తర్వాత సంస్థ పరిస్థితి, తమ జీవితాలు గాడిన పడుతున్నాయని అనుకుంటున్న తరుణంలో  కరోనా కొత్త కష్టాలు తెచ్చి పెట్టింది. సంస్థ చాలా భారంగా నడుస్తోంది. ఉద్యోగులకు నెలవారీ జీతాల చెల్లింపు తలకుమించిన సమస్యగా మారింది. లాక్‌డౌన్‌లో బస్సులు తిరగలేదు. అన్‌లాక్‌లో సర్వీసులు మొదలైనా పరిమితంగానే నడుస్తున్నాయి. గతంలోలా  ప్రయాణికులు బస్‌లు ఎక్కడం లేదు. కరోనాకు ముందు రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు రోజువారీ పావు వంతు ఆదాయం రావడమే గొప్పగా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే తిరిగే బస్సుల డీజిల్‌ ఖర్చులు కూడా రావడం లేదు. 

రూ. వెయ్యికోట్ల బ్యాంక్‌ గ్యారెంటీలో రూ.600 కోట్లు వాడుకున్న సంస్థ

తెలంగాణలో 97 బస్‌ డిపోలు ఉన్నాయి. 10వేల 500 బస్‌లకు వెయ్యి బస్సులు పక్కన పెట్టారు. 49 వేల మంది ఉద్యోగులున్నారు.  కరోనా ముందు ఆర్టీసీకి రోజువారీగా 14 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఐదారు కోట్లు రావడమే గగనమవుతోంది. ఉద్యోగుల జీతాలకు నెలకు 230 కోట్లు కావాలి. సమ్మెకు ముందు ప్రతినెలా మొదటి వారంలో జీతాలు ఇచ్చేవారు. సమ్మె తర్వాత ఆర్టీసీని గాడిన పెట్టేందుకు వెయ్యి కోట్ల బ్యాంక్‌ గ్యారెంటీ ఇప్పించింది ప్రభుత్వం. అందులో ఇప్పటికే 600 కోట్లను సంస్థ వాడుకుంది.  కరోనా తర్వాత 12వ తేదీ వచ్చినా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగులకు 3 నెలలపాటు సగం జీతాలే చెల్లించారు. కారణాలేమైనా ఉద్యోగులు 4 డీఏలకు దూరమయ్యారు. వీటితోపాటు ఉద్యోగులు దాచుకున్న సొమ్ముకు 8 శాతం వడ్డీతో కలిపి తిరిగి ఇస్తామని సంస్థ చెప్పినా.. అవీ ఇవ్వలేదు. 

ఐదేళ్ల తర్వాత చెల్లిస్తామన్న బకాయిల గడువు ముగిసినా ఉలుకు లేదు!

పండగల సమయంలో ఉద్యోగులకు జీతంలో కొంత అడ్వాన్సుగా ఇచ్చే సంప్రదాయం టీఎస్‌ఆర్టీసీలో ఉంది. సమ్మె తర్వాత సంస్థ లాభాలు గడిస్తే పండగలకు అడ్వాన్స్‌లు కాదు బోనస్‌లు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే కరోనా వల్ల సిబ్బందికి జీతాలు ఇవ్వడానికే ప్రభుత్వం వంద కోట్లు ఇస్తోంది. గతంలో జీతాల సవరణ తర్వాత సీఎం కేసీఆర్‌ సలహా మేరకు 50 శాతం బకాయిలు ఐదేళ్ల తర్వాత చెల్లిస్తామని అంటే కార్మికులు అంగీకరించారు. ఈ  నెల ఒకటో తేదీకి ఐదేళ్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ ఆ అరియర్స్‌ మాటే లేదు. 

అడ్వాన్స్‌, బోనస్‌ల మాట లేదు.. జీతం వస్తే చాలు!

ఏతా వాతా చూస్తే గతంలో మాదిరి ఆర్టీసీలో డబ్బులు సర్దుబాటు చేసే పరిస్థితి కష్టమే.  అందుకే అడ్వాన్స్‌లు, బోనస్‌లు మర్చిపోయి అసలు జీతాలు వస్తాయో రావో.. ఎప్పుడొస్తాయో అని ఆరా తీసే దుస్థితి ఉందని కార్మికులు వాపోతున్నారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించి చొరవ తీసుకుంటే కార్మికుల జీవితాల్లో పండగ కళ వచ్చినట్టే. లేదంటే ఈ పండగ సందడి కరోనాలో కొట్టుకుపోయినట్టే.