నేతలను పరుగులు పెట్టిస్తున్న కాంగ్రెస్ కొత్త బాస్..

నేతలను పరుగులు పెట్టిస్తున్న కాంగ్రెస్ కొత్త బాస్..

కాంగ్రెస్‌కి కొత్త ఇంఛార్జ్‌ వచ్చేశారు. వస్తూ వస్తూనే కొత్త బాస్ అందరి నోటికి తాళం వేసే పనిలో పడ్డారు. కఠినంగానే ఉండాలని నిశ్చయించుకున్నారో... లేదంటే ఇక్కడి పరిస్థితి ముందే తెలుసుకున్నారో కానీ... ఆయన మాత్రం దూకుడుగానే ఉన్నట్టు కనిపిస్తుంది. 

ఇకపై మరో లెక్క అంటోన్న మాణికం ఠాకూర్‌!

తెలంగాణ కాంగ్రెస్‌లో ఒకరు ఎడ్డెమంటే.. ఇంకొకరు తెడ్డెం అంటారు. అంతెందుకు.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మీద కూడా ఆరోపణలు చేస్తుంటారు. సమీక్ష సమావేశాల్లో దూషణ పర్వం... శ్రుతి మించితే తన్నులాట మామూలే. గాంధీభవన్‌లో ఇటీవలే ఈ సీన్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది. రాష్ట్రంలో పార్టీని నిలబెట్టాలనే ఆలోచనను పక్కన పెట్టి నాయకులు తన్నుకుంటారనే కామెంట్స్‌ కేడర్‌ నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అంటున్నారు AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణికం ఠాకూర్. 

కొన్ని విషయాలలో మాణికం క్లారిటీ ఇచ్చేశారా? 

కుంతియా ప్లేస్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన మాణికం స్వయంగా హైదరాబాద్‌  రాకపోయినా.. కోవిడ్‌ కారణంగా ఆన్‌లైన్‌లో వరస మీటింగ్‌లు పెట్టి అందరినీ పరుగులు పెట్టిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రతీ వీడియో కాన్ఫరెన్స్‌లోనూ.. మాణికం నిక్కచ్చిగా కొన్ని విషయాలు క్లారిటీ ఇచ్చేశారట. ఏది పడితే అది మాట్లాడే నాయకుల నోటికి తాళం వేశారని టాక్‌. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారట. 

వ్యక్తిగత అజెండాలు మానుకోవాలని చురకలు!

నాయకులు క్రమశిక్షణ తప్పితే.. ఎంత పెద్ద వారైనా చర్యలు ఉంటాయని చెప్పడంతో కొందరు నాయకుల గుండెల్లో దడ పుట్టిందట. ఇష్టారాజ్యంగా మాట్లాడటమే కాదు.. ఎవరికి తోచిన పని వాళ్లు చేయడం కూడా మానేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారట. ఎవరు ఏం చేసినా అది పార్టీ కార్యక్రమంగా ఉండాలి తప్పితే.. వ్యక్తిగత అజెండాలు అమలు చేయడం మానుకోవాలని చురకలు వేశారట. పార్టీకి చెప్పకుండా ఏం చేయకూడదని కూడా లక్ష్మణ రేఖ గీశారట మాణికం ఠాకూర్‌.

సోషల్‌ మీడియా పోస్ట్‌లపైనా సీరియస్‌!

తెలంగాణ కాంగ్రెస్‌లో ఇన్నాళ్లూ సోషల్‌ మీడియా పంచాయితీ మితిమీరిపోయిందనే టాక్‌ ఉంది.  నాయకుల పేర్లతో అకౌంట్లు సృష్టించడం.. దాంట్లో సొంత పార్టీ నేతలపైనే పోస్టింగ్‌లు పెట్టడం ఎక్కువైంది. దీంతో ఇబ్బందిపడ్డవారు మీడియాకు ఎక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అవన్నీ అకౌంట్‌ ఉన్న నాయకులకు తెలిసి  జరుగుతుందో.. తెలియక జరుగుతుందో కానీ.. కొత్త ఇంఛార్జ్‌ మాత్రం సోషల్ మీడియా వ్యవహారాలపై సీరియస్‌గా ఉన్నారట. సోషల్‌ మీడియాలో కూడా పార్టీ లైన్‌ దాటి ప్రవర్తించొద్దని చెప్పేశారట. పార్టీ, ప్రజా సమమస్యలపైనే పోస్టింగ్‌లు ఉండాలని నిర్దేశించారట మాణికం ఠాకూర్‌. కొత్త ఇంఛార్జ్‌ వచ్చిన తర్వాత కోర్‌ కమిటీ సమావేశం ప్రతి 15 రోజులకు ఓసారి జరగాలని.. సమస్యలేవైనా ఆ భేటీలో చర్చించి కార్యాచరణ అమలు చేయాలని ఠాకూర్‌ స్పష్టం చేశారట. అయితే మాణికం ఠాకూర్‌ ఎన్నాళ్లు ఇలా కఠినంగా ఉంటారో.. దారి తప్పిన వారిని గాడిలో పడతారో లేదో చూడాలి.