మంత్రి కావాలనుకున్న ఆయనకు కొత్త చిక్కులు ఎదురు పడుతున్నాయా?

మంత్రి కావాలనుకున్న ఆయనకు కొత్త చిక్కులు ఎదురు పడుతున్నాయా?

ఆయనో సీనియర్ ఎమ్మెల్యే. రెండుసార్లు విప్‌గా పనిచేశారు. మంత్రి పదవి చేపట్టాలనేది ఆయన చిరకాల కోరిక. రెండున్నరేళ్ల పాలన తర్వాత జరిగే మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని ఆశిస్తున్న ఆయనకు..సంబంధం లేని విషయాలు ఇరకాటంలో పెడుతున్నాయట. 

1999లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపు

సామినేని ఉదయభాను. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో విప్‌గా ఉన్నారు. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కూడా విప్‌గా బాధ్యతలు నిర్వహించారు. రాజకీయ కుటుంబానికి చెందిన ఉదయభాను 1999 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటి వరకు ఐదుసార్లు పోటీచేసిన ఆయన మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2009లో గెలిచి మంత్రి అవుదామనుకున్న ఆయన ఓటమి దెబ్బకు ఇంటికి పరిమితం కావాల్సి వచ్చింది. 2014 వైసీపీ నుంచి పోటీ చేసినా గెలుపు దక్కలేదు. 

మంత్రి పదవిపై అధిష్ఠానం ఆశీసులు ఉన్నాయా? 

2019లో విజయం వరించడంతో మంత్రి పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు ఉదయభాను. అయితే సామాజిక సమీకరణాలతోపాటు పలు అంశాలు శరాఘాతంగా మారి మళ్లీ విప్‌ పదవికే పరిమితమయ్యారు. వైఎస్‌కు సన్నిహితుడిగా, ఆ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఉదయభానుకి రెండున్నరేళ్ల తర్వాత మంత్రి పదవిపై కొంత వరకు అధిష్ఠానం ఆశీసులు ఉన్నాయట. ఆ సమయం కోసం ఎదురుచూస్తున్న ఆయనకు పలు ఘటనలు పదవి సంకటాలుగా కనిపించటంతో ఆందోళన చెందుతున్నారట.

చెక్‌పోస్టు దగ్గర డీఎస్పీ తీరుపై మండిపాటు!

కరోనా సమయంలో పెద్దఎత్తున తెలంగాణ నుంచి ఏపీ వాసులు సొంత వాహనాలపై ఏపీకి బయల్దేరగా వారిని జగ్గయ్యపేట చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారంతా రోడ్డుపైనే వాహనాలతో సహా నిలిచిపోయి ఆందోళనకు దిగారు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే ఉదయభాను అక్కడ డీఎస్పీ తీరుపై మండిపడ్డారు. డీఎస్పీనే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని మీడియాతో మాట్లాడారు. అయితే.. అనుమతి లేకుండా వచ్చే వారినే ఆపాలన్నది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా తెలుసుకుని నాలుక కర్చుకున్నారు ఎమ్మెల్యే. 

రేషన్‌ బియ్యం తరలిస్తున్నవారిని పిలిచి వార్నింగ్‌!

చెక్‌పోస్టులు దాటిస్తున్న రేషన్ బియ్యానికి సంబంధించి కొందరు అక్రమార్కులు ఎమ్మెల్యే పేరు చెప్పుకునే ప్రయత్నం చేయటంతో అది తెలుసుకున్న ఉదయభాను వారందరిని పిలిచి వార్నింగ్‌లు ఇచ్చారట. చిన్న విషయంలో కూడా తనకు నెగిటివ్ లేకుండా చూసుకుంటున్నప్పటికీ ఇటీవల దుర్గగుడి ట్రస్టు బోర్డు సభ్యురాలి కారులో అక్రమం మద్యం వ్యవహారం ఎమ్మెల్యేకు ముచ్చెమటలు పట్టించాయట.

నష్ట నివారణ చర్యల్లో భాగంగా వరలక్ష్మితో రాజీనామా!

జగ్గయ్యపేటలో వైసీపీ బలోపేతానికి స్థానిక నేతగా ఉన్న కృష్ణప్రసాద్ పనిచేశారనే గుడ్‌విల్‌ ఎమ్మెల్యేకు ఏర్పడింది. దీంతో కృష్ణప్రసాద్‌  భార్య వరలక్ష్మిని ఎమ్మెల్యే ఉదయభాను సిఫారసుతోనే దుర్గగుడి పాలకమండలిలో సభ్యురాలిగా నియమించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. వరలక్ష్మి కుమారుడు ప్రకాష్‌గుప్త తెలంగాణ నుంచి భారీగా మద్యం తెచ్చి పోలీసులకు దొరికిపోవడంతో అది రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దుర్గగుడి ట్రస్టు బోర్డు సభ్యురాలు నేమ్‌బోర్డు తగిలించుకుని మరీ అక్రమ మద్యం తేవటంతో వివాదాస్పదమైంది. ఈ ఘటనతో మరోమారు ఎమ్మెల్యే ఉదయభాను ఇరుకునపడ్డారు. నష్టనివారణ చర్యల్లో భాగంగా వరలక్ష్మితో పదవికి రాజీనామా చేయించారు.

వరలక్ష్మి కుమారుడు భానుప్రకాష్ గుప్తా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అమెరికాలో చదువుకుని వచ్చి ఈ పనిచేయటంతో వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట ఎమ్మెల్యే. స్థానిక ఎన్నికల్లో విజయం కోసం లోకల్‌ లీడర్స్‌పై సీరియస్‌ కావడం లేదట సామినేని. ఈసారి క్లీన్ ఇమేజ్‌తో మంత్రి పదవి పొందాలనే ఆశపడుతున్న సామినేనిని కార్యకర్తలే ఇబ్బంది పెట్టడం కొసమెరుపు.