ఏపీ ఎక్సైజ్‌ శాఖలో కొత్త తరహా అక్రమాలు?

ఏపీ ఎక్సైజ్‌ శాఖలో కొత్త తరహా అక్రమాలు?

నేతలంతా ఎన్నికల హడావిడిలో ఉన్నారు. ప్రభుత్వ పెద్దలు కరోనా నియంత్రణపై ఫోకస్‌ పెట్టారు. ఇదే టైమ్‌ అనుకున్నారో ఏమో ఏపీ ఎక్సైజ్‌శాఖలోని కొందరు సిబ్బంది కొత్తరకం దందాకు తెరతీశారు. సరికొత్త స్టిక్కర్‌ లిక్కర్‌ స్కామ్‌ బయటపడింది. ఇందులో సిబ్బంది, అధికారుల పాత్రే ఉందా లేక రాజకీయ నేతల జోక్యం కూడా ఉందా అన్నది ఆరా తీస్తున్నారట. 

తక్కువ రేటు ఉన్న బాటిళ్లకు ఎక్కువ రేటు ఉన్న స్టిక్కర్లు!

అవినీతి చేయడానికి సందు దొరకాలే కానీ.. కొందరు అక్రమార్కులు చెలరేగిపోతారు. ఏపీ ఎక్సైజ్‌ శాఖలో కొందరు ఇదే విధంగా నొల్లేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివిధ మద్యం దుకాణాల్లో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన పనిచేస్తున్న సిబ్బందిని గుప్పెట్లో పెట్టుకుని అక్రమ దందా సాగిస్తున్నారట. క్వార్టర్‌ బాటిళ్లపై ఉండే స్టిక్కర్లను తీసి.. తక్కువ రేటు ఉన్న బాటిళ్లకు అతికించి ఎక్కువకు అమ్మేస్తున్నారు. దాదాపు ప్రతి దుకాణంలోనూ 400 నుంచి 500 క్వార్టర్‌ బాటిళ్లు ఈ విధంగా విక్రయిస్తున్నట్టు సమాచారం. ఒక్కో దుకాణంలో యావరేజ్‌న 20 వేల రూపాయలు వెనకేసుకుంటున్నట్టు చెబుతున్నారు.   

ఉన్నతాధికారులకు తెలిసినా లైట్‌ తీసుకుంటున్నారా?

కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడలో ఈ తరహా వ్యవహారం బయటపడింది. దీనిపై ఆరా తీస్తే.. ఈ తరహా తతంగం ఒక్క ఆ షాపులోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నట్టు చెబుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం తిరుపతి ఉపఎన్నికపై ఫోకస్‌ పెట్టింది. ఇంకోవైపు కరోనా నియంత్రణ చర్యల్లో మిగతావాళ్లు బిజీగా ఉన్నారు. ఇదే సరైన సమయం అని భావించి అక్రమార్కులు భారీ స్థాయిలో అక్రమార్జనకు తెరలేపారు. సంబంధిత శాఖా మంత్రి నారాయణ స్వామి ఇప్పటి వరకు ఈ వ్యవహరంపై ఫోకస్‌ పెట్టిన పరిస్థితి లేదు. ఆయన కూడా తిరుపతి ఉప ఎన్నిక బిజీలో ఉన్నారు. కొందరు ఉన్నతాధికారుల దృష్టికి ఈ స్కామ్‌ వెళ్లినా.. వాళ్లు కూడా మనకెందుకులే అన్నట్టు ఉంటున్నారట.

ఈ స్కామ్‌లో అధికారుల పాత్ర కూడా ఉందా?

అధికారులు ఈ స్టిక్కర్‌ దందాను ఎందుకు పట్టించుకోవడం లేదనే అంశంపై ఎక్సైజ్‌ శాఖలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ స్కామ్‌లో పలువురు జిల్లా స్థాయి అధికారులు మొదలుకుని.. రాష్ట్ర స్థాయిలో కీలకంగా ఉండే అధికారుల పాత్ర.. ప్రమేయం కూడా ఉండి ఉండొచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి రాజకీయ నేతల అండ కూడా ఉందా లేదా అన్న చర్చ జరుగుతోంది. గతంలో మంత్రి ఆదేశాల మేరకు ఒకట్రెండు అంశాల్లో విచారణ చేపట్టినా.. ఆ తర్వాత సైలెంట్‌ అయిపోయిన పరిస్థితి ఉందని ఎక్సైజ్‌ శాఖ వర్గాలే చెబుతున్నాయి. మరి.. ఈ స్టిక్కర్‌ స్కామ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.