ఇక మద్దతు ధరకి మంగళమేనా..?

ఇక మద్దతు ధరకి మంగళమేనా..?

ప్రతిపక్షాలు వ్యతిరేకించినా.. భవిష్యత్‌లో రైతులకు మంచి జరుగుతుందంటూ.. కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది.. అయితే, ఈ చట్టాలతో ఇక మద్దతు ధరకి మంగళమేనా? అనే చర్చ జరుగుతోంది. గురువారం నుంచి కొత్త పంటల మార్కెటింగ్‌ ఏడాది ఆరంభమైంది. చాలా ఏళ్ల తరవాత దేశ వ్యవసాయరంగంలో సంస్కరణలు తెచ్చామని మోడీ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ఇలాంటి సమయంలో మార్కెట్లకు కొత్త పంటలు రావడం మొదలైంది. పంటల కొనుగోలుపై కొత్త వ్యవసాయ చట్టాల ప్రభావం ఏ మేర ఉంటుందన్నది ఇప్పటి నుంచి తెలుస్తుంది. ఈ ఏడాది సాగుచేసిన పంటలకు.. కేంద్రం ప్రకటించిన కొత్త కనీస మద్దతు ధరలను.. ఈ నెల ఒకటి నుంచే చెల్లించాలనేది ప్రధాన నిబంధన. కొత్త చట్టాల్లో రైతులకు మద్దతు ధర దక్కుతుందనే భరోసా లేకపోవడం, వ్యవసాయ మార్కెట్ల ప్రాధాన్యాన్ని తొలగించడంవల్ల దేశవ్యాప్తంగా రైతుసంఘాలు, ప్రతిపక్షాలు ఉద్యమిస్తున్నాయి. అయితే, మార్కెట్లకు రానున్న కోట్లాది టన్నుల పంటలను స్వేచ్ఛాయుత మార్కెట్లలో.. వ్యాపారులు రైతులకెంత ధర ఇచ్చి కొంటారనేదాన్ని బట్టి కొత్త చట్టాల సామర్థ్యమెంతనేది తెలిసిపోతుంది.

మనదేశంలో పంటల సాగువిస్తీర్ణం, దిగుబడులు పెంచుతామని తరచూ చెప్పే ప్రభుత్వాలు.. రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చి పంటలు కొనడంలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దేశప్రజల ఆకలి తీర్చే ప్రధాన పంటలైన గోధుమలు, బియ్యం దిగుబడుల్లో కనీసం సగం పరిమాణాన్నయినా ప్రభుత్వాలు మద్దతు ధర ఇచ్చి ఎప్పుడూ కొనలేదు. ఇక, ఇతర పంటలైతే కనీసం మూడో వంతు సైతం కొనడం లేదు. అత్యధికశాతం కొనేది ఎప్పుడూ ప్రైవేటు వ్యాపారులే. పంటలను మద్దతు ధరకు కొనే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎప్పుడూ వివాదాలు సాగుతున్నాయి. ఎంఎస్‌పీ ప్రకటించే అధికారం కేంద్రానికే ఉన్నందున ఆ ధర ఇచ్చి కొనాల్సిన బాధ్యత కూడా వారిదేనని తెలంగాణ సహా పలు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. రైతు నుంచి పంటను కొన్నరోజే లేదా మూడు పనిదినాల్లోనే సొమ్మును రైతు ఖాతాలో జమచేయాలని కొత్త చట్టాల్లో కేంద్రం నిబంధన పెట్టింది. కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేస్తున్న కొద్దిపాటి పంటల సొమ్మునే నెలల తరబడి ఆలస్యంగా రైతులకు చెల్లిస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలకు పంటలు అమ్మితే నెల దాటినా సొమ్ము రాదని.. తామైతే తక్షణం నగదు చెల్లిస్తామని వ్యాపారులు రైతులకు చెప్పి ధర తగ్గించేసి కొనడం ప్రతి సీజన్‌లోనూ మామూలైంది. ప్రభుత్వాల తీరే ఇలా ఉన్నప్పుడు- పంట కొన్నరోజే డబ్బు చెల్లించాలని చట్టాల్లో చెబితే వ్యాపారులు ఎలా అమలుచేస్తారనేది కీలక ప్రశ్న.

పంటలను మద్దతు ధరకు రాష్ట్రాలు కొనకుండా కేంద్రంపైనే ఆధారపడుతున్నాయి. మధ్యప్రదేశ్‌, హరియాణా, తెలంగాణ తదితర రాష్ట్రాలు గడచిన ఐదేళ్లుగా మద్దతు ధర వద్ద కొనే విషయంలో కొన్ని ప్రయోగాలు చేసి బాగా నష్టపోయాయి. తెలంగాణలో గడచిన ఐదేళ్లలో కందులు, మొక్కజొన్నలను రాష్ట్ర ప్రభుత్వ సంస్థ మార్క్‌ఫెడ్‌ మద్దతు ధరకు కొని రూ.2 వేల కోట్ల నష్టం చూపింది. ఈ సీజన్‌లో 93.30 లక్షల టన్నుల పప్పుధాన్యాల దిగుబడులు రానున్నాయి. కానీ, కేంద్రం కేవలం 13.77 లక్షల టన్నులకే అనుమతించింది. మిగతా 85 శాతం పప్పుధాన్యాల పంటలకు మద్దతు ధర ఇచ్చి వ్యాపారులు కొనకపోతే రైతులకెవరు దిక్కనేది ఆలోచించాలి. పంటలకు మద్దతు ధర ఇచ్చి కొనేందుకు నిధులు లేవని చెప్పి.. పథకాలు, చట్టాలు, నిబంధనలు మారిస్తే ఏం లాభం ?  ప్రభుత్వాలే ఇలా ఆలోచిస్తే.. ఇక లాభం కోసమే వ్యాపారం చేసే ప్రైవేటు సంస్థలు, వ్యాపార వర్గాలు రైతులను ఆదుకుంటాయా? మార్కెట్‌ స్థిరీకరణ నిధికి ప్రభుత్వాలే బడ్జెట్లలో నిధులు కేటాయించి పంటలను కొంటామనే భరోసా ఇవ్వనంతకాలం ఎన్ని చట్టాలు, విధానాలు తెచ్చినా రైతులకు ఉపయోగం ఉండదనే విమర్శలు వినిపిస్తున్నాయి.