మంత్రి మాటనే లెక్కచేయని అధికారి..చివరికి క్షమాపణ..?

మంత్రి మాటనే లెక్కచేయని అధికారి..చివరికి క్షమాపణ..?

ప్రభుత్వాలు మారినా ఆ అధికారి సీటు మారదు. పోస్టు మారదు.  ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయన్ను ఎవరే ఏం కదపలేరు. అదే ధీమాతోనే ఏమో.. ఏకంగా మంత్రినే  లైట్‌ తీసుకున్నారు. ఇంతకీ ఆ మోనార్క్‌ అధికారి ఎవరో? ఎక్కడో? ఏంటో? చూద్దాం.

అధికార పార్టీ ఎమ్మెల్యే అంటేనే అధికారులు  ఉరుకులు పరుగులు పెడతారు. అలాంటిది మంత్రి అంటే ఇంకేస్థాయిలో హడావిడి ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ.. మంత్రి అంటే నెల్లూరు జిల్లాలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులకు చీమ కుట్టినట్టు అయినా లేదట. మంత్రి మేకపాటి గౌతంరెడ్డి విషయంలో చోటుచేసుకున్న ఘటన జిల్లా హాట్‌ టాపిక్‌ అయింది. 

మున్సిపల్‌ హెల్త్‌ అధికారిపై చర్యలకు కలెక్టర్‌కు మంత్రి గౌతంరెడ్డి లేఖ!

మంత్రి క్యాంప్‌ ఆఫీస్‌ నెల్లూరు సిటీలోని వేదాయపాళెంలో ఉంటుంది.  ఈ క్యాంప్‌ ఆఫీసు దగ్గర అపరిశుభ్రంగా ఉందని, పారిశుద్ధ్యం సరిగ్గా లేదని, బాగు చేయించాలని  కార్యాలయ సిబ్బంది మున్సిపల్‌ హెల్త్‌ అధికారి వెంకట రమణకు ఫోన్‌ చేసి చెప్పారట. ఆయనేమో అస్సలు స్పందించలేదట. లైట్‌ తీసుకున్నారట.  విషయం తెలుసుకున్న మంత్రి.. సదరు అధికారిని వచ్చి కలవాలని కబురు పెట్టారట. అయినా సరే వెంకటరమణ స్పందించలేదు. మంత్రి పిలిచినా సదరు అధికారి వెంకటర రమణ రాకపోవడంతో... చిర్రెత్తుకొచ్చిందట మంత్రికి.  ఆయన పై చర్యలు తీసుకోవాలని  గత నెల 25న కలెక్టర్‌కు లేఖ రాశారు గౌతంరెడ్డి. కార్పొరేషన్‌కు కలెక్టరే స్పెషల్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. మంత్రి లేఖతో వెంకట రమణపై చర్యలు తీసుకున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి ఉందట. 

మంత్రి గౌతంరెడ్డి వ్యతిరేకవర్గం ఆశీసులు ఉన్నాయా? 

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న వెంకట రమణ నెల్లూరు దాటరు. అదే పోస్ట్‌.. అదే సీట్‌లో ఉంటారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రి నారాయణ కొద్దికాలం ఈ అధికారిని పక్కన పెట్టారు. తర్వాత ఏమైందో ఏమో చాలా వేగంగా తిరిగి వచ్చి ఇక్కడే డ్యూటీలో చేరిపోయారు. వెంకటరమణకు మంత్రి గౌతంరెడ్డి వ్యతిరేక వర్గం ఆశీసులు దండిగా ఉన్నాయని టాక్‌. అందుకే మంత్రి రమ్మన్నా వెళ్లకుండా  లైట్‌ తీసుకున్నారట.  మున్సిపల్‌ కార్పొరేషన్‌కు కమిషనర్లు ఇలా వచ్చి అలా బదిలీ అయి వెళ్లిపోతున్నారు. గత 15 నెలల కాలంలో నలుగురు మున్సిపల్‌ కమిషనర్లు  మారిపోయారు. దీంతో వెంకటరమణ లాంటి వారికి ఆడింది ఆట పాడింది పాటగా ఉందట.

మంత్రి ఇంటికి వెళ్లి  క్షమాపణ  చెప్పారు!

 ఈ వివాదం శ్రుతి మించి రాగాన పడటంతో సదరు అధికారి మంత్రి ఇంటికివెళ్లి క్షమాపణ చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.  ఏ ఎండకు ఆ గొడుకు అన్నట్టుగా వెంకట రమణ వ్యవహారం ఉందట. గతంలో టీడీపీ నేతల ప్రోద్భలంతో వైసీపీ నేతల హోటళ్లపై దాడులు చేసిన ఆ ఆధికారి.. ఇప్పుడు వైసీపీ నేతల ప్రోత్సాహంతో టీడీపీ వారి హోటళ్లపై  దాడులు చేస్తున్నారట. మొత్తం మీద రాజకీయ డ్రామాలో నాయకులను మించిపోయి వ్యవహరిస్తున్నారటనే ప్రచారం జోరందుకుంది.