కొత్త డిమాండ్: భారత్ కు ధీటుగా పాక్ లో శ్రీకృష్ణ మందిరాన్ని నిర్మించాలి... 

కొత్త డిమాండ్: భారత్ కు ధీటుగా పాక్ లో శ్రీకృష్ణ మందిరాన్ని నిర్మించాలి... 

అయోధ్య రామ మందిరం నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.  కోట్లాది మంది ఈ వేడుకను టీవీ మాధ్యమాల ద్వారా వీక్షించారు.  అటు న్యూయార్క్ మహానగరంలోని టైమ్ స్క్వేర్ లో భారీ బిల్ బోర్డులపై అయోధ్య రామాలయం కు సంబంధించిన ఫోటోలను ప్రదర్శించారు.  ప్రపంచంలో అత్యధిక మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించినట్టు తెలుస్తోంది.  అయోధ్యలో రామ్ జన్మభూమిలో రామాలయం నిర్మాణం కోసం వందల సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు.  2020 ఆగష్టు 5న భూమి పూజ జరగడంతో కల నెరవేరింది.  

ఇదిలా ఉంటె, పాకిస్తాన్ లో ప్రతిపక్ష పార్టీ పీపుల్స్ పార్టీ అఫ్ పాకిస్తాన్ కొత్త డిమాండ్ ను తెరమీదకు తీసుకొచ్చింది.  పాకిస్తాన్ లో అన్ని మతాల వారికి తగిన గౌరవం ఉందని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన సమయం వచ్చిందని, ఇస్లామాబాద్ లో శ్రీకృష్ణ మందిరాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు.  2017లో ఇస్లామాబాద్ లో శ్రీకృష్ణ మందిరాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడమే కాకుండా 3.89 ఎకరాల భూమిని గుర్తించి ఆ భూమిని 2018లో ఇస్లామాబాద్ హిందూ పంచాయితీకి అప్పగించింది.  దానికి నిధులు కూడా ఇస్తామని ప్రకటించింది.  కానీ, కొన్ని వర్గాల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో ప్రభుత్వం నిధుల విషయంలో వెనక్కి తగ్గింది.  పాక్ లో నిర్మించాలని తలపెట్టిన మొదటి హిందూ దేవాలయం పునాదితోనే ఆగిపోయినట్టైంది.