డ్రగ్స్ కేసు.. ఎన్‌సీబీ విచారణలో రకుల్‌ ఏం చెప్పిందంటే..?

డ్రగ్స్ కేసు.. ఎన్‌సీబీ విచారణలో రకుల్‌ ఏం చెప్పిందంటే..?

నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు దర్యాప్తు భాగంగా వెలుగు చూసిన డ్రగ్స్‌ వ్యవహారం... రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే సుశాంత్‌ ప్రియురాలు రియాను అరెస్ట్‌ చేసింది ఎన్‌సీబీ.. ప్రస్తుతం హిందీ చిత్రపరిశ్రమకు చెందిన పలువురికి డ్రగ్స్‌ లింకులపై ఆరా తీస్తోంది ఎన్‌సీబీ.. దీనిలో భాగంగానే హీరోయిన్లు రకుల్‌ప్రీత్‌ సింగ్‌, దీపికా పదుకొణె, సారా అలీఖాన్‌లకు సమన్లు పంపింది. ముంబైలోని ఎన్‌సీబీ కార్యాలయంలో విచారణకు హాజరైన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను సుమారు 4 గంటల పాటు ప్రశ్నించారు అధికారులు. అయితే, తానెప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదని విచారణలో రకుల్‌ ప్రీత్‌ చెప్పినట్టు తెలుస్తోంది. 

మరోవైపు... రియా చక్రవర్తితో డ్రగ్స్‌పై జరిగిన చాటింగ్‌లో తాను కూడా పాల్గొన్నట్టు అంగీకరించింది రకుల్‌. డ్రగ్స్‌ రవాణాదారులతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్పష్టం చేసినట్టు సమాచారం. డ్రగ్స్‌ వ్యవహారంలో జయా సాహాను వరుసగా మూడో రోజు ప్రశ్నించారు ఎన్‌సీబీ అధికారులు. జయా సాహాను రెండో రోజు ప్రశ్నించినప్పుడు దీపికా పదుకొణెతో సహా పలువురు పేర్లు బయటపెట్టినట్టు తెలుస్తోంది. సెలబ్రిటీలకు దీపికా మేనేజరైన కరిష్మా ప్రకాశ్‌  డ్రగ్స్‌ అందజేసేదని తెలిపినట్టు సమాచారం.  దీపికా పదుకొణె మేనేజర్‌ కరిష్మా ప్రకాష్‌ కూడా ఎన్‌సీబీ విచారణకు హాజరయ్యారు. గ్రడ్స్‌కు సంబంధించి 2017 నాటి చాటింగ్‌పై కరిష్మాను ప్రశ్నించారు అధికారులు. పద్మావత్‌ చిత్ర నిర్మాణం సమయంలో డ్రగ్స్‌ గురించి దీపికా పదుకొణె, కరిష్మా ప్రకాష్‌ల మధ్య చాటింగ్ జరిగింది. కరణ్‌ జోహార్‌ దగ్గర ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పని చేసే క్షితిజ్‌ రవిప్రసాద్‌ కూడా ఎన్‌సీబీ విచారణకు హాజరయ్యాడు. ఆయన ముంబై చేరుకోగానే... ఎన్‌సీబీ అధికారులు అతన్ని తమ వెంట తీసుకెళ్లారు. క్షితిజ్‌ రవిప్రసాద్‌ ఢిల్లీలో ఉండగా... ముంబైలోని అతని ఇంట్లో ఎన్‌సీబీ సోదాలు నిర్వహించింది.