ఏదీ మర్చిపోము.. వడ్డీతో సహా చెల్లించి తీరుతాం : నారా లోకేష్

ఏదీ మర్చిపోము.. వడ్డీతో సహా చెల్లించి తీరుతాం : నారా లోకేష్

మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పరామర్శించిన నారా లోకేష్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ కరెన్సీ నగర్ లో  కొల్లు రవీంద్ర నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడిన లోకేష్, తెదేపా నేతలపై పెట్టిన తప్పుడు కేసులేవీ మచ్చిపోయేది లేదని, వడ్డీ తో సహా చెల్లించి తీరుతామని అన్నారు. రెట్టింపు వేగంతో ముందుకెళ్తామన్న ఆయన ప్రజల తరఫున ప్రభుత్వం పై యుద్ధం చేసేవారిని జగన్ జైళ్లో పెట్టిస్తున్నారని దాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. 16 నెలల నుంచి అధికారంలో ఉన్నారని, మా హయాంలో అవినీతి జరిగినట్లు ఒక్క ఆధారమైనా చూపించారా? అని ప్రశ్నించారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్ష కోట్లు దోచుకోవడం వల్లే చాలా మంది అధికారులు జైలు కెళ్లారని అన్నారు. రానున్న రోజుల్లోనూ చాలామంది అధికారులు జైలుకెళ్లే పరిస్థితి ఉందని అన్నారు. మంత్రులందరికీ అసహనం పెరిగిపోయిందని ఆయన అన్నారు. జగన్ పేరు కూడా అన్నిసార్లు తలవని మంత్రులు చంద్రబాబు పేరు జపిస్తున్నారని, నిద్ర లేచింది మొదలు  పడుకునే వరకు చంద్రబాబే వైకాపా నేతల కలలోకి వస్తున్నారని అన్నారు.

అంతర్వేది రధం దగ్ధం ఘటన ఒక మతంపై దాడే..ఇలాంటివి  జరుగుతున్నప్పుడు సీబీఐ విచారణ జరగాల్సిందేనని అన్నారు. ఒకసారి జరిగితే పొరపాటు అనుకోవచ్చు, వరుస సంఘటనలు చూస్తుంటే కుట్రకోణం స్పష్టమవుతోందని ఆయన అన్నారు. బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానిదని, కానీ ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని అన్నారు. ప్రభుత్వ తప్పిదాలను వ్యతిరేకిస్తే అక్రమకేసులు లేదా దాడులకు దిగుతున్నారని అన్నారు. కొల్లు రవీంద్ర, అచ్చెన్న, జేసీ ప్రభాకర్ రెడ్డి లపై పెట్టింది ముమ్మాటికీ దొంగ కేసులే, వింత వింత కేసులన్నీ ప్రతిపక్షాలపై ప్రయోగిస్తున్నారని అన్నారు. ఇళ్ల స్థలాల సేకరణ లో జరిగిన అవినీతిలో 40మంది వైకాపా ఎమ్మెల్యేలు జైలుకెళ్లటం ఖాయమని, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని ఆయన అన్నారు. కనీసం 40మంది జైలుకెళ్తారు రాసిపెట్టుకోండని లోకేష్ అన్నారు.