ఏపీ సీఎంకు నారా లోకేష్ లేఖ..

ఏపీ సీఎంకు నారా లోకేష్ లేఖ..

సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని,చేనేత కుటుంబాలను ఆదుకోవాలంటూ ఏపీ సీఎం జగన్ కి నారా లోకేష్ లేఖ రాశారు. చేనేత వేలాది కుటుంబాలకు జీవనోపాధికి మూలంగా ఉందని, రాష్ట్రంలో 25 లక్షల మందికి పైగా చేనేత రంగం జీవనోపాధిని అందిస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఆర్డర్లు లేక రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది నేత కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, మంగళగిరి, పొందూరు, చీరాల, వెంకటగిరి, ధర్మవరం, నెల్లూరులోని పాతూరు ఇలా అన్ని ప్రాంతాల్లో ఈ సమస్య ఉందని అన్నారు.

లాక్డౌన్, భారీ ప్రకృతి వైపరీత్యాల కారణంగా 5నెలలుగా వస్త్ర రంగం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని లాక్డౌన్ వారి వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీస్తే...  ఇటీవల కురిసిన భారీ వర్షాల వారు పనిచేసే ప్రదేశం నీటితో నిండిపోయి పనిచేయడం అసాధ్యంగా మారిందని లేఖలో పేర్కొన్నారు. ఒక్క మంగళగిరిలోనే  వేలాది నేత కుటుంబాలు ఉన్నాయని లాక్డౌన్ కు ముందు చేనేత కార్మికులు నెలకు 15 నుండి 25 చీరలు తయారు చేసేవారని అన్నారు.

ఒక్కో చీరకి రూ .450 నుండి రూ.550 సంపాదించే వీరు  ఇప్పుడు నిత్యావసరాలు కూడా కొనలేకపోతున్నారు. అప్పులపాలై దుర్భర జీవితం గడుపుతున్నారని అన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నేతన్న నేస్తం పథక ప్రయోజనం ఎంతమాత్రం  నెరవేరలేదని మంగళగిరిలో 2490 చేనేత కుటుంబాలకు గాను  కేవలం 300 మంది మాత్రమే ప్రయోజనం పొందారని అన్నారు. మంగళగిరిలో చేనేత కార్మికుల పరిస్థితే ఇలా ఉంటే రాష్ట్రమంతటా ఎలా ఉందో ఊహించవచ్చని ఆయన అన్నారు. సమస్య పరిష్కారానికి నేతన్నల తరఫున 4డిమాండ్లు  ప్రభుత్వం ముందు ఉంచుతున్నానన్న ఆయన వాటిని పరిష్కరించాలని కోరారు. 

1)ఈ కరోనా సంక్షోభ సమయంలో ప్రతి నేత కుటుంబానికి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలి.

2)సొంత మగ్గం ఉన్న వారికే పథకం అంటూ నిబంధనల పేరుతో కోత విధించకుండా ప్రతీ నేత కార్మికునికి ‘నేతన్న నెస్తం’ కింద రూ.24,000 ఇవ్వాలి.

3)సొంతంగా మగ్గం ఏర్పాటు చేసుకోవాలనుకునే ప్రతి నేతన్నకి రూ.1.5 లక్షల సబ్సిడీ రుణాన్ని ప్రభుత్వం అందించాలి.

4)నేతన్న దగ్గర ఉన్న స్టాక్ ని ఆప్కో ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసి వెంటనే చెల్లింపులు చేయాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు.