లోకేష్ కౌంటర్ ఎటాక్! నా భాషతో పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయా..?

లోకేష్ కౌంటర్ ఎటాక్! నా భాషతో పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయా..?

అసెంబ్లీలో... బయట.. వరుసగా నారా లోకేష్‌పై విమర్శలు చేస్తూ వస్తున్నారు వైసీపీ నేతలు.. ముఖ్యంగా పప్పు అంటూ.. జయంతి, వర్ధంతికి తేడా తెలియదంటూ ఆయను టార్గెట్ చేస్తున్నారు.. ఇవాళ ఉదయం విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన... వైసీపీ నేతలపై కౌంటర్ ఇస్తూ ఎదురుదాడికి దిగారు. నేను చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే బ్యాచ్ కాదన్న ఆయన.. చంద్రబాబు తన కొడుకును కూడా గెలిపించుకోలేకపోయారనే వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. మంగళగిరి పులివెందుల కాదు.. మంగళగిరి టీడీపీ కంచుకోట కాదని.. మంగళగిరిలో టీడీపీ జెండా పాతేందుకు నేను పోటీచేశా.. ఓడిపోయినా ప్రజల్లో తిరుగుతున్నానని తెలిపారు. 

నన్ను మా అమ్మ క్రమశిక్షణతో పెంచింది.. తప్పు చేస్తే బెత్తంతో కొట్టిందన్నారు నారా లోకేష్.. మీలా (జగన్) వీధి రౌడీలా మా ఇంట్లో నన్ను పెంచలేదని కౌంటర్ ఇచ్చారు. ఆరు నెలలు గడిచినా ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ను ఎందుకు నిరూపించలేదని సీఎం  జగన్‌ను ప్రశ్నించారు నారా లోకేష్.. మరోవైపు హెరిటేజ్ ఫ్రెష్‌ను ఎప్పుడో అమ్మేశాం.. అయితే, షేర్లు ఉన్నాయి కదా అని మంత్రి బుగ్గన ప్రశ్నిస్తున్నారు.. మరి ఆయనకు ఎన్నో కంపెనీల్లో షేర్లు ఉన్నాయి.. ఆ కంపెనీలు రేట్లు పెంచితే బుగ్గన బాధ్యత వహిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఇక, ఆరు నెలల కాలంలోనే సీఎం జగన్.. ఇసుక, ఉల్లి, ఆర్టీసీ ఛార్జీలు, లిక్కర్ ధరలు పెంచేశారని విమర్శించారు లోకేష్.. 2012 నుంచి నాపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.. మరి, నెల్లూరులో మాఫియా రెచ్చిపోతోందన్న వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి వ్యాఖ్యలపై ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు. 

నన్ను పప్పు.. పప్పు అని ఒకటికి పదిసార్లు అన్నారు.. నిన్న సభలో చంద్రబాబు తర్వాత నన్నే ఎక్కువగా విమర్శించారు.. సభలోలేని వ్యక్తి గురించి మాట్లాడొద్దనే సంస్కారం లేదా? అంటూ ఫైర్ అయ్యారు నారా లోకేష్.. ఉన్నత చదువుల కోసం నేను అమెరికాలో చదివా.. దాదాపు ఎనిమిదేళ్లు అక్కడ ఉన్న.. నేను తెలుగులో మాట్లాడేటప్పుడు ఒకపదం అటుఇటూ పడొచ్చు.. దానిని పట్టుకుని పదేపదే విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన లోకేష్.. నాకు తెలుగు రాకపోతే ఏపీకి ఏం నట్టమొచ్చింది?.. నాకు వర్ధంతి, జయంతికి తేడా తెలియకపోతే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దోచుకున్న జగనే నీతులు చెబుతుంటే వినాలా? అని ఎద్దేవా చేసిన లోకేష్.. మా పాలనలో జరిగిన అభివృద్ధి వైసీపీకి కనబడడం లేదా? అని ప్రశ్నించారు. తన ఆలోచనతోనే పార్టీలోని కార్యకర్తలకు రూ.2 లక్షల ప్రమాదబీమా అందిస్తున్నామన్న ఆయన.. ఇలాంటి కార్యక్రమాలు ఏ పార్టీ చేయలేదన్నారు లోకేష్.