సినిమాటోగ్రాఫర్ గా అలరించిన నందమూరి మోహనకృష్ణ

సినిమాటోగ్రాఫర్ గా అలరించిన నందమూరి మోహనకృష్ణ

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు యన్.టి.రామారావు తనయులు ఏడుమందిలో కొందరి పేర్లు వారి సొంత చిత్రాలలో నిర్మాతలుగా ప్రచురితమయ్యాయి. అయితే ఆయన కుమారుల్లో మూడవవారు హరికృష్ణ నటునిగా, నిర్మాతగా రాణించారు. నాల్గవ అబ్బాయి నందమూరి మోహన కృష్ణ సినిమాటోగ్రాఫర్ గా కనువిందు చేశారు. ఐదవ కుమారుడైన బాలకృష్ణ స్టార్ హీరోగా జేజేలు అందుకుంటున్నారు. యన్టీఆర్ తనయుల్లో ఈ ముగ్గురే చిత్రసీమకు సుపరిచితులు. హరికృష్ణ, బాలకృష్ణ మాత్రమే తండ్రి బాటలో నటనలో రాణించారు. అయితే వారికంటే భిన్నంగా  ఛాయాగ్రహణంలో కాలుమోపారు నందమూరి మోహనకృష్ణ. 

బాల్యంలోనే...
మోహనకృష్ణ అమెరికాలో సినిమాటోగ్రఫీ నేర్చుకున్నారు. తండ్రి నటించి, నిర్మించిన చిత్రాలకు మోహనకృష్ణ తొలుత అసోసియేట్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. యన్టీఆర్ తొలి చిత్రం 'మనదేశం'కు ఎమ్.ఏ.రహమాన్ ఛాయాగ్రాహకుడు. అందువల్ల రామారావు తన సొంత చిత్రాలకు కూడా ఆయననే సినిమాటోగ్రాఫర్ గా నియమించుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 'సీతారామకళ్యాణం' (1961) మొదలు పలు రామారావు సొంత చిత్రాలకు రవికాంత్ నగాయిచ్ ఛాయాగ్రాహకునిగా పనిచేశారు. ఆయనకు కెమెరా మాంత్రికుడు అనే పేరుంది. తన సినిమాట్రిక్స్ తో పలు అద్భుతాలు తెరపై ఆవిష్కరించారు రవికాంత్ నగాయిచ్.  బాల్యంలో రవి పనితనం చూసిన దగ్గర నుంచీ తానూ ఏదో ఒకరోజు అలాంటి అద్భుతాలు సృష్టించాలని మోహనకృష్ణ మనసు ఆరాటపడింది. చిన్నప్పుడు యన్టీఆర్ నటించిన జానపద చిత్రాలను చూసి, వాటిలోని ట్రిక్స్  కు కూడా మోహన కృష్ణ పులకించి పోయేవారు. ఇక తండ్రి నటించిన జానపద చిత్రాలను చూసి, అందులో తనను యన్టీఆర్ లాగా ఊహించుకొనేవారు. తమ్ముడు బాలకృస్ణను రాజనాలగా భావించమని, ఇద్దరూ కర్రపుల్లలు చేతపట్టి కత్తియుద్ధం చేసినట్టుగా నటించి ఆనందించేవారు. అయితే మోహనకృష్ణకు నటనకంటే ఛాయాగ్రహణంపైనే మక్కువ ఎక్కువగా ఉండడంతో ఆయనను ఆ దిశగానే పయనింప చేశారు యన్టీఆర్. 

తండ్రి నిర్దేశకత్వంలోనే...
తండ్రి యన్టీఆర్ నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రాలకు మోహనకృష్ణ తొలుత సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. తమ సంస్థలో పనిచేసిన ప్రముఖ ఛాయాగ్రాహకులు ఎమ్.ఏ.రహమాన్, కన్నప్ప వంటి వారి వద్ద కొన్ని మెలకువలు నేర్చుకున్నారు. రహమాన్ డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫిలో 'శ్రీమద్విరాటపర్వము, శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం" చిత్రాలకు మోహనకృష్ణ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. తరువాత 'అగ్గిరవ్వ' చిత్రంతో తొలిసారి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా మోహనకృష్ణ పేరు టైటిల్స్ లో వేశారు. ఆ తరువాత తండ్రి హీరోగా తెరకెక్కిన "అనురాగదేవత, కలియుగ రాముడు, సింహం నవ్వింది, చండశాసనుడు,  శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్ర, సమ్రాట్ అశోక, శ్రీనాథ కవిసార్వభౌమ" చిత్రాలకు మోహనకృష్ణ సినిమాటోగ్రఫి నిర్వహించారు. 

తమ్మునితో విజయాలు...
చిన్నప్పుడు కర్రలనే కత్తులుగా చేసుకొని ఆడుకున్న అన్నదమ్ములు మోహనకృష్ణ, బాలకృష్ణ తరువాతి రోజుల్లో ఒకరు సినిమాటోగ్రాఫర్ గా, మరొకరు నటునిగా కలసి పనిచేయడం విశేషం. తమ్ముడు బాలకృష్ణ హీరోగా నటించిన "సీతారామకళ్యాణం, అనసూయమ్మగారి అల్లుడు, దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడు, భార్గవరాముడు, అల్లరి క్రిష్ణయ్య, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, భానుమతిగారి మొగుడు, ఇన్ స్పెక్టర్ ప్రతాప్, తిరగబడ్డ తెలుగుబిడ్డ, రాముడు-భీముడు, అశోక చక్రవర్తి, పెద్దన్నయ్య, గొప్పింటి అల్లుడు" వంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు మోహనకృష్ణ. తమ్ముడు బాలకృష్ణ  హీరోగా మోహనకృష్ణ సినిమాటోగ్రఫి నిర్వహించిన  ఐదు చిత్రాలు వరుసగా ఘనవిజయం సాధించడం విశేషం. అప్పట్లో ఈ అన్నదమ్ముల విజయాన్ని చిత్రసీమ విశేషంగా ముచ్చటించుకుంది. 

'చిత్ర'బంధం
యన్టీఆర్ తో "కంచుకోట, నిలువుదోపిడి, పెత్తందార్లు, దేశోద్ధారకులు, తీర్పు" వంటి చిత్రాలను నిర్మించిన యు.విశ్వేశ్వరరావు కూతురు శాంతిని మోహనకృష్ణ వివాహమాడారు. వీరికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి తారకరత్న నటునిగా రాణిస్తున్నారు. తారకరత్నను హీరోగా పరిచయం చేసే సమయంలో ఓ రికార్డు సృష్టించారు. ఒకే రోజున తారకరత్న హీరోగా తొమ్మిది చిత్రాలు ఆరంభమయ్యాయి. వాటిలో కొన్నే వెలుగు చూశాయి. అయితే ఈ నాటికీ తెలుగునాట అలా ఒక హీరో నటించే చిత్రాలు ఒకే రోజున అన్ని షూటింగ్ జరుపుకోవడం అన్నది ఓ రికార్డుగా నిలచింది. మోహనకృష్ణ 1990ల ఆరంభం దాకా తమ్ముడు హీరోగా నటించిన చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. తరువాత తమ సొంత చిత్రాలకే సినిమాటోగ్రఫి నిర్వహించారు. ఏది ఏమైనా  పౌరాణిక, చారిత్రక, సాంఘిక చిత్రాలకు సందర్భోచితంగా తన కెమెరా పనితనంతో మోహనకృష్ణ ఆకట్టుకున్నారని చెప్పవచ్చు .