యుద్దానికి సిద్ధమంటున్న బాలయ్య..పూర్తిగా మారిపోయినట్టేనా..?

యుద్దానికి సిద్ధమంటున్న బాలయ్య..పూర్తిగా మారిపోయినట్టేనా..?

ఫుల్‌ టైమ్‌ పాలిటిక్స్‌లోకి వచ్చినా పార్ట్‌ టైమ్‌గా పనిచేస్తున్న బాలయ్య.. రూటు మార్చారా? హిందూపురం తప్ప మరేమీ పట్టని ఆయన రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టారా? దూకుడు పెంచారా? వైసీపీని టార్గెట్‌ చేయడం.. మంత్రి కొడాలి నానికి కౌంటర్లు వేయడం దేనికి సంకేతం? బాలకృష్ణ పూర్తిగా మారిపోయినట్టేనా? 

బాలకృష్ణలో వచ్చిన మార్పుపై రాజకీయవర్గాల్లో చర్చ!

సినిమా హీరోగా బిజీగా ఉంటూనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి వరసగా రెండోసారి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. సినిమాలను తప్ప బాలకృష్ణ రాజకీయాలను సీరియస్‌గా తీసుకోరనే ప్రచారం ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా.. ఇప్పుడు విపక్ష శాసనసభ్యుడిగా ఉన్నా రాజకీయాలు ఆయనకు పార్ట్‌ టైమ్‌ అని భావించేవారు బాలయ్యను చూసేవారు. వచ్చామా? చూశామా? వెళ్లామా? అన్నట్టే ఉంటుంది ఆయన రాజకీయ జీవితం. అలాంటి బాలకృష్ణ ఒక్కసారిగా పూర్తిగా మారిపోయారనే టాక్‌ వినిపిస్తోంది. ఫక్తు రాజకీయ నేతగా విమర్శలు, కామెంట్స్‌ చేస్తున్నారు. బాలయ్యలో వచ్చిన ఈ మార్పే ఇటు స్వపక్షంలోనూ.. అటు రాజకీయవర్గాల్లోనూ చర్చకు దారితీస్తోంది. 

వైసీపీపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు!

ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి బాలకృష్ణ మూడు నెలలకోసారి మూడురోజులపాటు హిందూపురానికి వస్తుంటారు. అభివృద్ధి పనులను సమీక్షించి.. కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వెళ్లిపోతారు. హిందూపురానికి సంబంధించిన అంశాలు తప్ప ఇంకేమీ పట్టించుకోరు బాలయ్య. కానీ.. ఈ దఫా పర్యటనలో హిందూపురం కేంద్రంగా స్టేట్‌ పాలిటిక్స్‌పై దృష్టి పెట్టడం ఆసక్తికర చర్చ జరుగుతోంది. రైతు సమస్యల దగ్గర నుంచి  దేవుళ్ల విగ్రహాల ధ్వంసం వరకు అన్నింటిపైనా స్పందిస్తున్నారు బాలకృష్ణ. తొలిసారిగా అధికార పార్టీ వైసీపీపైనా ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు.

మంత్రి కొడాలి నానికి పరోక్ష వార్నింగ్‌!

ఈ దఫా హిందూపురం టూర్‌లో బాలయ్యలో వచ్చిన ఈ మార్పు చాలా డిఫరెంట్‌గా ఉందని చెబుతున్నారు. పూర్తి రాజకీయ నేతగా మారిన బాలయ్యను చూస్తున్న అభిమానులు రాజకీయాల్లోను ఎన్టీఆర్‌కు వారసుడు అవుతాడా అంటున్నారు. హిందూపురం వస్తూ వస్తూనే రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని.. రైతులను పట్టించుకోవడం లేదని వైసీపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. గిట్టుబాటు ధర, ఇన్సూరెన్స్‌, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పేకాట క్లబ్‌లు ఒకటేమిటి ప్రతీ అంశాన్నీ తనదైన శైలిలో టచ్‌ చేస్తూ జనాలకు కొత్త బాలకృష్ణను పరిచయం చేశారు. ఈ క్రమంలో టీడీపీపై తీవ్ర విమర్శలు చేసే మంత్రి కొడాలి నానికి వార్నింగ్‌ ఇచ్చారు ఈ నందమూరి వారసుడు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. తాము అలా మాట్లాడం కానీ చేతల ద్వారా చూపిస్తామని నానికి పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. పేకాట క్లబ్‌లను ఉదహరిస్తూ చట్టాలపై గౌరవం లేకుండా పోయిందని అక్షింతలు వేశారు. 

టీడీపీ కమిటీల కూర్పు సమయంలోనూ జోక్యం!
టీడీపీలో కీలక పదవేదో ఆశిస్తున్నారా?

టీడీపీ అంతర్గత విషయాల్లో బాలకృష్ణ పెద్దగా జోక్యం చేసుకోరు. కానీ.. ఈసారి కమిటీలను ఎప్పుడు ప్రకటించాలనే ముహూర్తాలతోపాటు పార్టీ అధినేతకు కొన్ని సూచనలు కూడా చేశారు. ఆయన సూచనలను చంద్రబాబు పాటించారు కూడా. ఆ తర్వాత పార్టీలో యాక్టివ్‌ రోల్‌ పోషిస్తారని తెలుగు తమ్ముళ్లు భావించారు. అక్కడితో ఆగితే బాగోదని భావించారో ఏమో విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలకు పదును పెడుతున్నారు. సీఎం జగన్‌పై  కౌంటర్లు వేస్తూనే.. హిందూపురాన్ని జిల్లాగా చేయడం కోసం అవసరమైతే ముఖ్యమంత్రిని కలుస్తాననడం ఆయనకే చెల్లింది. ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో.. ఏ సమయంలో గేర్‌ మార్చాలో తెలిసిన నాయకుడు బాలయ్య అనే కామెంట్స్‌ జోరందుకున్నాయి. ఇంకోవైపు పార్టీలో బాలయ్య కీలక పదవేదో ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకోసమే పార్టీ  సమావేశాలకు సైతం దూరంగా ఉన్నారని అంటున్నారు. సినిమాను శ్వాసగా.. సినిమానే జీవితంగా.. నటనే దైవంగా జీవించే బాలయ్య ఇకపై రాజకీయాల్లోనూ తడాఖా చూపాలనుకుంటున్నారా? అన్నది తేలకపోయినా బాలయ్య మనసులో ఏదో ఉందని అర్థం అవుతోంది. మరి... రానున్న రోజుల్లో బాలకృష్ణ ఇదే దూకుడు కొనసాగించి టీడీపీ బూస్టప్‌ ఇస్తారో లేదో చూడాలి.