'లక్ష్య' సాధనలో నాగశౌర్య!

'లక్ష్య' సాధనలో నాగశౌర్య!

చూడగానే బాగా పరిచయం ఉన్న అబ్బాయిలా కనిపిస్తాడు నాగశౌర్య. ఇప్పటికే డజనుకు పైగా చిత్రాల్లో నటించేసి, జనానికి చేరువయ్యాడు. ప్రస్తుతం 'వరుడు కావలెను' అన్న ప్రకటనతో వస్తున్నాడు. మరోవైపు 'ఫలానా అబ్బాయి- ఫలానా అమ్మాయి' అనీ చాటింపేస్తున్నాడు. మొత్తానికి నాగశౌర్య కు ఓ లక్ష్యం ఉంది - అందుకే 'లక్ష్య' అంటున్నాడు. ఈ యేడాది ఈ మూడు సినిమాలతో సందడి చేయడానికి సిద్ధమవుతున్న నాగశౌర్య  జనవర 22న పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు. 

ఐరా పై ... ఔరా అనిపిస్తూ... 
నాగశౌర్యకు  సినిమా హీరోకు కావలసిన లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయన కన్నవారికి కూడా అది తెలుసు కాబట్టే, నాగశౌర్యను ప్రోత్సహించారు. 'క్రికెట్, గర్ల్స్  అండ్ బీర్' తో తెరపై తొలిసారి కనిపించిన నాగశౌర్య  ఆపై ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగాడు. 'చందమామ కథలు'లో రాజుగా పలకరించాడు. 'ఊహలు గుసగుసలాడే'లో వెంకీగా అలరించాడు. 'దిక్కులు చూడకు రామయ్యా' అని హెచ్చరిస్తే, 'లక్ష్మీ రావే మా ఇంటికి' అంటూ  అవికా గోర్ ను ఆహ్వానించాడు. ఇలా సాగుతున్న నాగశౌర్య 'జాదూగాడు'గానూ మురిపించాడు. ఆ తరువాత 'కళ్యాణ వైభోగమే' అంటూ పాట పాడాడు. దాంతో నాగశౌర్య  కన్నవారే తమ ఐరా క్రియేషన్స్  బ్యానర్ పై  'ఛలో' సినిమా తీసి జనానికి అతణ్ణి మరింత చేరువ చేశారు. "నర్తనశాల, అశ్వథ్థామ" చిత్రాలు కూడా ఐరా బ్యానర్ పైనే తెరకెక్కి, నాగశౌర్య అభినయం చూసి ఔరా అనేలా చేశాయి. అయితే నాగశౌర్య  ఆశిస్తున్న భారీ విజయం ఇప్పటి దాకా అతని దరి చేరలేదు. అయినా పట్టువదలని విక్రమార్కునిలా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాడు. ఈ పుట్టినరోజు తరువాతయినా నాగశౌర్య  కోరుకున్న విజయాన్ని దక్కించుకుంటాడని సన్నిహితులు ఆశిస్తున్నారు. రాబోయే నాగశౌర్య  మూడు చిత్రాలలో ఏదో ఒకటి బంపర్ హిట్ కొట్టడం ఖాయమని అతణ్ని అభిమానించేవారు ఆశిస్తున్నారు. నాగశౌర్య  తప్పకుండా ఈ యేడాది సక్సెస్ రూటులో సాగుతాడని ఆశిద్దాం.