వ్యవసాయ రంగాన్ని చూసే దృక్పథం మారాలి-కేసీఆర్‌

వ్యవసాయ రంగాన్ని చూసే దృక్పథం మారాలి-కేసీఆర్‌

దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయ రంగాన్ని లాభదాయకమైనది కాదనే వ్యతిరేక ధోరణితో చూసే దృక్పథంలో మార్పు రావాలి అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు... నాబార్డ్ చైర్మన్ జీఆర్ చింతల ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా నాబార్డు బృందంతో సీఎం సమావేశమయ్యారు. వ్యవసాయ రంగం అభివృద్దికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించడంతో పాటు, విదేశాలకు అవసరమయ్యే ఆహార పదార్థాలను అందించే స్థాయికి చేరాలని ఆకాంక్షించారు కేసీఆర్... ఎక్కువ మంది ఆధారపడుతున్న రంగం పరిశ్రమలకు అత్యంత కీలకమైన ముడి సరుకును అందిస్తున్న రంగం వ్యవసాయ రంగమేనన్న ఆయన.. భారత దేశానిది వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ కాబట్టే ఆటుపోట్లను తట్టుకుని నిలబడగలుగుతుందన్నారు కేసీఆర్. వ్యవసాయ రంగాభివృద్ధికి కృషి చేయడంతో పాటు, వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం, నాబార్డు లాంటి సంస్థలు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలని కోరారు సీఎం కేసీఆర్.. డీసీసీబీ బ్యాంకులు మరింత సమర్థవంతంగా నడిచేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.