ఐపీఎల్‌లో కొనసాగుతోన్న ముంబై జైత్రయాత్ర

ఐపీఎల్‌లో కొనసాగుతోన్న ముంబై జైత్రయాత్ర

ఐపీఎల్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ముంబై ఇండియన్స్‌ ఖాతాలో మరో విక్టరీ చేరింది. అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాను.. 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. నైట్‌రైడర్స్‌ నిర్దేశించిన సాధారణ లక్ష్యాన్ని.. ఈజీగా ఛేదించిన రోహిత్‌ సేన.. తాజా విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. 149 పరుగుల లక్ష్యంతో ఇన్సింగ్‌ ప్రారంభించిన ముంబైకి.. రోహిత్‌, డికాక్‌లు మంచి ఆరంభాన్నిచ్చారు. 35 పరుగులతో  రోహిత్‌.. అర్ధశతకంతో డికాక్‌.. జట్టు విజయానికి బాటలు వేశారు.  రోహిత్‌ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌ కూడా వెంటనే వెనుదిరగడంతో... మరో వికెట్‌ పడకుండా హర్దిక్‌ పాండ్యాతో కలిసి పని ముగించాడు డికాక్‌. మరో 19 బాల్స్‌ ఉండగానే ముంబైకి విజయాన్ని అందించారు.

అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా..  61 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 53 పరుగులు చేసిన కమిన్స్‌, 39 రన్స్‌ చేసిన కొత్త కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ కోల్‌కతాను ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ప్రత్యర్థి ముందు గౌరవప్రదమైన స్కోరును ఉంచారు. చివరి వరకు క్రీజులో ఉన్న మోర్గాన్.. ఆఖరి ఓవర్‌లో రెండు సిక్సర్లు కొట్టాడు. ముంబయి బౌలరల్లో రాహుల్ చాహర్ రెండు వికెట్లు.. బౌల్ట్, కౌటర్‌నైల్, బుమ్రా తలో వికెట్ పడగొట్టారు.