ముంబై గ్రాండ్‌ విక్టరీ.. టాప్‌స్పాట్‌కు దూసుకెళ్లింది...

ముంబై గ్రాండ్‌ విక్టరీ.. టాప్‌స్పాట్‌కు దూసుకెళ్లింది...

ముంబై ఆల్‌రౌండ్ షోతో మరోసారి అదరగొట్టింది. ఐపీఎల్ వేదికగా ముంబై ఇండియన్స్‌ జోరు కొనసాగుతోంది. ఈ టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదుచేసుకుంది. ఢిల్లీ కేపిటల్స్ విధించిన 163 పరుగుల టార్గెట్‌ ను... 19.4 ఓవర్లలో ఛేదించింది ముంబై ఇండియన్స్.. డికాక్‌ , సూర్యకుమార్‌ అర్థశతకాలతో రాణించారు. రోహిత్ శర్మ స్వల్ప పరుగులకే వెనుదిరగ్గా, వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌తో కలిసి డికాక్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి బౌండరీల మోత మోగించారు. డికాక్‌ 32 బంతుల్లో అర్ధశతకం సాధించిన డికాక్... అశ్విన్ బౌలింగ్‌లో షా చేతికి చిక్కాడు. ఇషాన్ కిషన్‌ తో కలిసి సూర్యకుమార్ మరింత చెలరేగాడు. సిక్సర్లు, ఫోర్లు సాధిస్తూ 30 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తిచేశాడు. అయితే సూర్యను రబాడ బోల్తా కొట్టించాడు. స్వల్పవ్యవధిలోనే ముంబై వికెట్లు కోల్పోయింది. చివరి ఆరు బంతుల్లో 7 పరుగులు అవసరం కాగా... కృనాల్ పాండ్య రెండు బౌండరీలు సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. 

టాస్ గెల్చి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్‌లోనే పృథ్వీషాను బౌల్ట్ పెవిలియన్‌కు పంపగా.. సీజన్‌లో తొలిమ్యాచ్ ఆడిన రహానే ఎక్కువసేపు నిలదొక్కుకోలేకపోయాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్‌తో కలిసి ధావన్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. ముచ్చటైన షాట్లతో వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. అయితే, దూకుడుగా ఆడే క్రమంలో కృనాల్ బౌలింగ్‌లో 42 పరుగుల వద్ద శ్రేయస్ ఔటయ్యాడు. మరోవైపు ధావన్‌ నిలకడగా ఆడుతూ 39 బంతుల్లో అర్ధశతకాన్ని సాధించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 162 పరుగులు చేసింది.