ముఖేష్ అంబానీకి తిరుగేలేదు..! మ‌రో న‌యా రికార్డు

ముఖేష్ అంబానీకి తిరుగేలేదు..! మ‌రో న‌యా రికార్డు

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తిరుగేలేకుండా దూసుకుపోతున్నారు... ఏ వ్యాపారం చేసినా త‌న‌కు సాటిలేర‌ని నిరూపించికున్న‌ ఈ ఆసియా కుబేరుడు.. న‌యా రికార్డు సృష్టించారు. ఇప్పుడు ప్రపంచంలోనే అ‍త్యంత సంపన్నుల జాబితాలో నాల్గో స్థానానికి ఎగ‌బాకారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం ముఖేష్‌ అంబానీ.. అమెజాన్ అధినేత జేఫ్ బెజోస్, బిల్ గేట్స్, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ తర్వాత నాల్గో స్థానానికి చేరుకున్నారు. 80.2 బిలియన్‌ డాలర్ల (సుమారు 6 లక్షల కోట్ల రూపాయలు) సంపదతో ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ను దాటేసి నాలుగో స్థానానికి ఎగ‌బాకారు ముఖేష్‌ అంబానీ. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఇండెక్స్‌లో అమెరికన్స్ మాత్రమే టాప్ 5లో ఉంటూ రాగా.. తాజాగా వారి జాబితాలో ముకేష్‌ అంబానీ చేరారు.

ఇక‌, బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించిన నివేదికలో 10 మంది ప్రపంచ  కుబేరుల్లో 8 మంది అమెరికాకు చెందిన వారే కావడం గమనార్హం. వీరి సరసన మ‌న ముఖేష్‌ అంబానీ కూడా చేరారు.. భారత్‌ నుంచే కాక ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు అంబానీ.. ఈ ఇండెక్స్‌లో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఆస్తి 187 బిలియన్ డాలర్ల సంపదతో ఫ‌స్ట్ స్పాట్‌లో ఉండ‌గా.. 121 బిలియన్ల సంపదతో మైక్రోసాఫ్ట్‌ కో ఫౌండర్‌ బిల్‌ గేట్స్ సెకండ్ పొజిష‌న్‌లో ఉన్నారు. ఇక ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ ఆస్తి 102 బిలియన్ డాలర్లుతో మూడో స్థానంలో ఉండ‌గా.. 80.2బిలియన్ డాలర్ల సంపదతో నాలుగో స్థానంలో నిలిచారు అంబానీ.