గ్యాస్ లీక్.. బాధిత గ్రామాల్లో మంత్రులు, సాయిరెడ్డి బస..

గ్యాస్ లీక్.. బాధిత గ్రామాల్లో మంత్రులు, సాయిరెడ్డి బస..

విశాఖ జిల్లాలో ఎల్జీ పాలిమర్స్ నుంచి గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది.. ఈ విష వాయువులు లీకేజ్ కావడంతో అనేక మంది స్పృహ తప్పి పడిపోగా, 13 మంది మృతిచెందారు.. ఇక, ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు ప్రకటించిన సీఎం జగన్.. ఐదు బాధిత గ్రామాల్లోని ప్రతీ ఒక్కరికి పరిహారం ప్రకటించారు.. ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందినవారికి, అస్వస్థతకు గురైనవారికి ఒక్కోరకమైన పరిహారం ప్రకటించిన సీఎం.. బాధిత గ్రామాల్లో అన్ని కుటుంబాలకు పరిహారం ప్రకటించారు.. కుటుంబంలో ఉన్న పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా.. ఒక్కొక్కరికి రూ.10వేలు ప్రకటించారు. మరోవైపు గ్యాస్ లీకేజ్ జరిగిన రోజున ఆ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు మొత్తం ఊర్లను విడిచి పెట్టారు. అయితే ఇప్పుడిప్పుడే కాస్త పరిస్థితులు చక్కబడడంతో అక్కడి ప్రభావిత గ్రామాలలో స్టైరిన్ కెమికల్ ప్రభావం తగ్గిందని ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేందుకు రంగంలోకి దిగారు మంత్రులు.. ఆయా గ్రామాల్లో పారిశుధ్య పనులు నిర్వహించారు... ఎండిపోయిన చెట్లను తొలగించారు.. సోమవారం సాయంత్రం తర్వాత స్థానికులను ఆయా గ్రామాల్లోకి అనుమతించారు. 

అంతేకాదు.. రాత్రి వాళ్లతో కలిసి భోజనం చేశారు.. ఇక, గ్యాస్ నుంచి తమకు ఎలాంటి ముప్పులేదని వారిలో మనో ధైర్యాన్ని నింపేందుకు బాధిత గ్రామాల్లోనే బస చేశారు మంత్రులు.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో.. ఐదు గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టడంతో పాటు.. స్థానికులతో కలిసి భోజనం చేసి.. రాత్రి ఆ గ్రామాల్లోనే నిద్రించారు.. వెంకటాపురంలో ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ, పద్మనాభపురంలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి, కంపరపాలెం గ్రామంలో మంత్రి కన్నబాబు, నందమూరి నగర్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎస్సీ, బీసీ కాలనీలో ధర్మాన కృష్ణదాసు సోమవారం రాత్రి బస చేశారు. ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చేందుకు గ్రామాల్లో బస.. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు.. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.. గ్రామాల్లో హెల్త్ సెంటర్లు, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి అవసంతి శ్రీనివాస్ తెలిపారు.