వెనక్కి తగ్గని రఘురామకృష్ణంరాజు.. మళ్లీ టార్గెట్ చేసి..!

 వెనక్కి తగ్గని రఘురామకృష్ణంరాజు.. మళ్లీ టార్గెట్ చేసి..!

ఓవైపీ సీబీఐ కేసులు, సోదాలు జరిగినా.. మరోవైపు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ రెబల్ నేత, ఎంపీ రఘురామకృష్ణంరాజు... ఇటీవల సీఎం వైఎస్ జగన్.. ఢిల్లీ పర్యటనలో పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు కలసినప్పుడు, నా మీద ఫిర్యాదు చేయమని ఒత్తిడి తెచ్చారు.. అందులో భాగంగానే సీబీఐ నిన్న సోదాలు చేసిందన్నారు. సీబీఐ కేసు, సోదాలపై ఢిల్లీలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. మరోసారి వైసీపీ సర్కార్‌ను టార్గెట్ చేశారు.. మా ప్రభుత్వ సహకారంతో ఇసుక దోపిడి దొంగలు తయారయ్యారు.. మానసిక రుగ్మతితో ఈ మధ్యన ప్రభుత్వాలను నడిపిస్తున్న వారు ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు.. దీనికి సంబంధించిన మందులు కొంతమంది వాడుతున్నట్లు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని.. సీఎం అనుమతిస్తే వారి సమాచారం ఇస్తా.. అలాంటి వారు ప్రజాప్రతినిధులుగా కొనసాగడానికి అర్హతలేదని.. రాజ్యాంగం ప్రకారం వారు పదవులలో కొనసాగడానికి వీలులేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇక, జగనన్న విద్యాకానుక లో భాగంగా విద్యార్థులకు ఇచ్చిన వాటిపై సీఎం బొమ్మలు వేసుకోవడం సరికాదన్నారు రఘురామకృష్ణంరాజు.. ఇటీవల గ్రామ సచివాలయ భవనాలకు రంగుల విషయంలో హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా ఇచ్చినా ప్రభుత్వానికి బుద్ధి రాలేదని మండిపడ్డ ఆయన.. కేంద్ర ప్రభుత్వ నిధులకు రాష్ట్ర ప్రభుత్వ పేరు పెట్టుకోవడం సరికాదన్నారు. మరోవైపు నన్ను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకున్నారు... ప్రశాంత్ కిషోర్ ఒత్తిడిమేరకు నాకు ఎంపీ సీటు ఇచ్చారని వ్యాఖ్యానించారు రఘురామకృష్ణంరాజు.. వాల్మీకే మహర్షిగా మారినప్పుడు మా రెడ్డిగారు మారకపోతారా అనే ఆశతో పార్టీలో చేరానని.. దురదృష్టవశాత్తు ఆ మార్పు కనబడలేదన్నారు. తిరుపతి ఏడుకొండలు ఏడు రెడ్లపరమయ్యాయని మండిపడ్డ ఆయన.. ముఖ్యమైన పదవులు ఒకే సామాజిక వర్గం పరమయ్యాయని ఆరోపించారు.. యాదవ సామాజిక వర్గానికి ఒక్క ముఖ్యమైన పదవి ఇవ్వలేదని విమర్శించిన రఘురామకృష్ణంరాజు.. కార్పోరేషన్ల పేరుతో కులాల మధ్య చిచ్చుపెట్టి వైషమ్యాలు రెచ్చగొడుతున్నారని.. ఒకే సామాజిక వర్గంవారు న్యాయమూర్తులను కించపరుచుతూ పోస్ట్ లు పెడుతుంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.