సావిత్రి జయంతి నేడు..

సావిత్రి జయంతి నేడు..

తెలుగుధాత్రిని పులకింప చేసిన అభినేత్రి సావిత్రి... తెలుగువారి అభిమానాన్ని అమితంగా చూరగొన్న నటీమణి సావిత్రి… తెలుగు సినిమాకు తన అభినయంతో వెలుగులద్దిన నటీశిరోమణి సావిత్రి... 

ఇలా ఎంతగా మన అభిమానాన్ని కురిపిస్తూ పోయినా, సావిత్రి నటనముందు అది కొంతే అవుతుంది.. డిసెంబర్ 6న మహానటి సావిత్రి 85వ జయంతి.. ఈ సందర్భంగా సావిత్రి అభినయ వైభవాన్ని మననం చేసుకుందాం...

సావిత్రి అభినయాన్ని చూడగానే ఓ భక్తిభావం మన మదిలో చోటు చేసుకుంటుంది.. సావిత్రి నటనను ఒక్కసారి చూశామంటే చాలు ఆమెకు అభిమానులుగా మారకుండా ఉండలేం.. అంతటి సమ్మోహనశక్తిని తన అభినయంలో మేళవించి మేటి చిత్రాలలో సాటిలేని నటనతో అలరించారు సావిత్రి..

సావిత్రి అన్న మూడక్షరాల పేరు వినగానే తెలుగువారి మది ఆనందంతో పులకించిపోతుంది. ఆమె అభినయంతో పరవశింప చేసిన చిత్రాలు ఒక్కసారిగా గుర్తుకు వస్తాయి. అనితరసాధ్యంగా సాగిన సావిత్రి అభినయాన్ని మననం చేసుకొనే కొద్దీ ఆమెపై అబిమానం కొండవీటి చేంతాడులా పెరిగిపోతూనే ఉంటుంది. అదీ సావిత్రి అభినయంలోని మహాత్యం. 

నాటి మేటి నటీనటులతో కలసి సావిత్రి సాగించిన చిత్రప్రయాణం గుర్తు చేసుకుంటే ఆ మహానటిపై మరింతగా అభిమానం పెంపొందుతుంది. ఇక నయనాలతోనే సావిత్రి పలికించిన అగణిత భావాలనూ గుర్తు చేసుకుంటే ఆమెకు అభిమానులమయినందుకు గర్వంగానూ ఉంటుంది. 

ఆ రోజుల్లో టాప్ హీరోస్ కు సమానంగా పారితోషికం పుచ్చుకొని చరిత్ర సృష్టించారు సావిత్రి. అంతటి ఘనచరిత సొంతం చేసుకున్న సావిత్రి తొలుత యన్టీఆర్, ఏయన్నార్ హీరోలుగా రూపొందిన 'సంసారం' చిత్రంలో తన తగని సిగ్గుతో హీరోయిన్ పాత్ర చేజార్చుకుందని వింటే ఆశ్చర్యం కలుగక మానదు. దాంతో 'సంసారం'లో ఏయన్నార్ జోడీగా నటించవలసిన సావిత్రి కాస్తా, అందులో ఓ పాటలో అలా వచ్చి ఇలా పోయే పాత్రకే పరిమితమయింది. ఆ సినిమాలో సావిత్రి నటనకు పనికిరాదు అని సర్టిఫికెట్ ఇచ్చిన దర్శకుడు ఎల్వీ ప్రసాద్ తరువాత తాను తెరకెక్కించిన 'పెళ్ళిచేసి చూడు'లో కీలక పాత్రను ఇచ్చి ప్రోత్సహించారు. ఆ సినిమాతోనే సావిత్రి నటజీవితం ఓ కొత్త మలుపు తిరిగింది అని చెప్పవచ్చు. 

అరుదైన ప్రతిభ గలవారికి అవకాశం రావాలే కానీ, తమ ప్రావీణ్యం ప్రదర్శించుకోకుండా ఉండరు కదా! 'పెళ్ళిచేసి చూడు'లో యస్వీ రంగారావు కూతురుగా నటించిన సావిత్రి అభినయాన్ని చూసిన వేదాంతం రాఘవయ్య తన 'దేవదాసు'లో కథానాయిక పార్వతి పాత్రకు సావిత్రిని ఎంపిక చేసుకున్నారు. అంతగా అనుభవం లేని నటితో పార్వతి వంటి బరువైన పాత్రను ధరింప చేయడం సబబు కాదని వేదాంతంను కొందరు హెచ్చరించారు కూడా. ఆయన మాత్రం తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. ఫలితంగా 'దేవదాసు'లో పార్వతి పాత్ర సావిత్రి పరమయింది. అందులో ఆమె నటించలేదు. జీవించింది అంటే అతిశయోక్తి కాదు. 

'దేవదాసు' చిత్రంతో నటిగా మంచి మార్కులు సంపాదించుకున్న సావిత్రి ఆపై మరి వెనుతిరిగి చూసుకోలేదు. మహానటులు యన్టీఆర్, ఏయన్నార్ కు విజయనాయికగానూ ఆమె అలరించారు. ఆ ఇద్దరు మహానటులకు జోడీగా నటించి మెప్పించారు. ఆ సినిమాలు తెలుగువారిని ఎంతగానో పులకింప చేశాయి.