తెలకపల్లి రవి : ప్రధాని మోడీ ప్రణబ్‌ సహా పాటిస్తారా?

  తెలకపల్లి రవి : ప్రధాని మోడీ ప్రణబ్‌ సహా పాటిస్తారా?

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అంటే తనకు చాలా గౌరవమని ప్రధాని నరేంద్ర మోడీ చాలా సార్లు ప్రకటించారు.మరి ఆయన తనకు ఇచ్చిన సలహా పాటిస్తారా? మోడీ వినడం నేర్చుకోవాలని ప్రణబ్‌ రాష్ట్రపతి పదవీ కాలంలో తన జ్ఞాపకాలు ఆఖరి సంపుటంలో రాశారు, ఆయన మరణానంతరం ఇప్పుడా పుస్తకం వెలువడింది. ,ప్రణబ్‌ సలహాలు ఏమాత్రం పాటించినా దేశాన్ని అట్టుడికిస్తున్న రైతు ఆందోళన విషయంలో ప్రభుత్వ వైఖరి మరోలా వుండేది. ఎనిమిది దఫాలు చర్చలు విఫమైవుండేవి కావు. ఈ సమయంలోనూ ప్రభుత్వం మొండిపట్టుతో వుండేది కాదు. చట్టాలను వెనక్కు తీసుకోవడానికి భేషజం అవసరమయ్యేది కాదు. సవరణలు చేయడానికి సవరించిన కొత్త చట్టం తేవడానికి  సాంకేతికంగా పెద్ద తేడా వుండదు. కాని కార్పొరేట్ల ఒత్తిడి ఒక పక్క, వెనక్కు తగ్గరాదనే మోడీ పట్టుదల మరోపక్క కలిసి ఈ పరిస్థితి సృష్టించాయి. ఆర్థిక నిపుణలు, అన్ని ప్రతిపక్షాలు మీడియా ఎంతగా చెబుతున్నా కాస్తయినా పట్టువిడుపు ప్రదర్శించడానికి మోడీ సర్కారు సిద్దపడటం లేదు. ప్రణబ్‌ తన పుస్తకంలో ఇదే లోపం సూటిగా ఎత్తిచూపారు. సోనియాగాంధీని ప్రధానిగా ఎన్నుకుంటే ఆమె ఎంపికగా మన్మోహన్‌ వచ్చారని, కాని గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వున్న మోడీ ముందే అభ్యర్థిగా ఎంపికై విజయం సాధించారు గనక ఏకపక్షంగా వ్యవహరిస్తూ పార్లమెంటును కూడా నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు.ఆయన భిన్నాభిప్రాయాలు వినడం, అసమ్మతిని సహించడం అలవర్చుకోవాలన్నారు.

2012లో   రాష్ట్రపతి అయిన ప్రణబ్‌ 2014 ఎన్నికలో కాంగ్రెస్‌ ఓటమికి నాయకత్వం పొరబాట్లే కారణమైనాయని స్పష్టీకరించారు. సోనియా విధానాల వలన మహారాష్ట్ర వంటిచోట్ల బమైన నాయకులు దూరమైనారని  వెల్లడించారు. ప్రజలు ఆశలు నెరవేర్చడంలోనూ సమస్యలు పరిష్కరించడంలోనూ కాంగ్రెస్‌ విఫలమైందన్నారు. ఆ ఏడాది రిపబ్లిక్‌ దినోత్సవ ప్రసంగంలో తాను పూర్తి మెజార్టితో ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పిుపునిచ్చానని బిజెపికి పూర్తి మెజార్టి వచ్చిందని తెలిపారు. రాష్ట్రపతిగా  ఆయన పదవీ కాలం మధ్యలో నరేంద్ర మోడీ ప్రధాని పదవి చేపట్టినా సత్సంబంధాలు పాటించడమే గాక ఇద్దరూ సన్నిహితుగా వున్నారన్న భావం కలిగించారు. కాని అది మోడీపై విమర్శనాత్మక వ్యాఖ్యులు చేయడానికి అడ్డురాలేదు. పార్లమెంటును మోడీ ఉపేక్షించడంపై ప్రణబ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

గతంలో నెహ్రూ ఇందిరాగాంధి, వాజ్‌పేయి వంటి వారు పార్లమెంటుకు రావడం, వినడం జరిగేదని పార్లమెంటు పట్ల  శ్రద్ధ లేని మోడీ వారి నుంచి నేర్చుకోవాలని రాశారు. మోడీ విదేశాంగ విధాన సమస్యలు ఆయన త్వరగా ఆకళింపు చేసుకున్నప్పటికీ విదేశీ నాయకులతో సంబంధాలను వ్యక్తిగతంగా చూపించుకోవడానికి చాలా తాపత్రయ పడేవారని వ్యాఖ్యానించారు. ఉదాహరణగా జపాన్‌తో మనకు మొదటి నుంచి మంచి సంబంధాలున్నా అదేదో తన హయాంలోనే జరిగినట్టు మోడీ చిత్రించుకున్నారని రాశారు. చైనాతో శిఖరాగ్రసమావేశాలు సంప్రదాయం మోడీ హయాంలో మొదలవడం గుర్తు చేశారు. అయితే లాహోర్‌లో ఆగి నవాజ్‌షరీప్‌ను కలుసుకోవడం  అప్పటి హడావుడి  అవసరంలేని పనులని స్పష్టం చేశారు. వివిధ దేశాల నాయకుల మధ్య వుండే సంబంధాలలో వ్యక్తిగతం ఏమీ వుండదని మోడీ తెలుసుకోవాలన్నారు. విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ కూడా నిర్వహించిన ప్రణబ్‌ ముఖర్జీ నోట్ల రద్దు నిర్ణయంతో విభేదించారు. దాన్ని ప్రకటించేముందు మోడీ తనతో సంప్రదించలేదని,పార్లమెంటులో ప్రసంగించిన తర్వాత వచ్చి వివరించారని చెప్పారు. నల్లడబ్బు నిరోధం తదితర లక్ష్యాను ప్రకటించిన ప్రధాని మోడీ వాటిని సాధించలేకపోయారని కూడా మాజీ రాష్ట్రపతి  విశ్లేషించారు. మతం వంటి అంశాలను బట్టి జాతీయ గుర్తింపును గణించడం పొరబాటని, భారతీయులుగా ప్రజాస్వామ్యయుతంగా సహనంతో జీవించడం ప్రధానమని ఆరెస్సెస్‌ కవాతులో 2018లో ఆయన ఇచ్చిన సందేశమే ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలతోనూ కనిపిస్తుందని చెప్పొచ్చు. మరి మోడీ ప్రణబ్ సలహాను పాటిస్తారా ?