చీరాలకు పోతుల సునీత..

చీరాలకు పోతుల సునీత..

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇప్పుడు చీరాలలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి విజయం సాధించిన ఆమంచి... ఆ తర్వాత సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక అప్పటికే తెలుగుదేశం పార్టీలో చీరాలలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారితో కొంత ఇబ్బందులు ఉన్నాయని ఆయన పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లడంతో స్థానిక నేతలకు పదవులు ఇచ్చి స్థానికంగా లేకుండా చేశారు చంద్రబాబు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారిపోవడంతో ఓవైపు చీరాలలోకి కరణం బలరాం ఎంట్రీ ఇస్తున్నారంటూ ఓ వర్గం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే... మరోవైపు గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఆమంచి కృష్ణమోహన్ చేతిలో ఓటమిపాలైన పోతుల సునీత మళ్లీ చీరాలపై కన్నేసినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల తర్వాత ఆమంచి - పోతుల సునీత వివాదం ముదరడంతో ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు... దాంతో గత కొంతకాలంగా ఆమె చీరాల నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. అయితే, ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడంతో మళ్లీ చీరాలలో అడుగుపెట్టారు. మరి చీరాల రాజకీయం ఎలాఉంటుందో వేచిచూడాలి.