రాజీనామాకు సిద్ధం.. 16 నెలలు నిద్రలేని రాత్రులు గడిపా..!

రాజీనామాకు సిద్ధం.. 16 నెలలు నిద్రలేని రాత్రులు గడిపా..!

టీడీపీ అనర్హత వేటు వేస్తే రాజీనామాకు సిద్ధమన్నారు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. సీఎం జగన్ టికెట్ ఇస్తే మళ్లీ పోటీకి రెడీ అన్నారు. టీడీపీలో ఉన్న ఈ 16 నెలలు నిద్రలేని రాత్రులు గడిపానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వాసుపల్లి... మనుసు చంపుకొని టీడీపీలో ఉన్నాను.. తాను పార్టీ ద్రోహిని అయితే చంద్రబాబు పేదల ద్రోహి.. మనుసు చంపుకొని పార్టీ ఆదేశాల మేరకు సీఎంపై విమర్శలు చేశాను.. కానీ, మనసు చంపుకొని టీడీపీలో ఉండలేకపోయాను అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తనపై అనర్హత ఫిర్యాదు చేసుకోండి అంటూ సవాల్ చేశారు. ఇక, తన వెంట నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.. సీఎం జగన్ టికెట్ ఇస్తే కలిసి పోటీ చేస్తామన్నారు వాసుపల్లి గణేష్.

మరోవైపు వలస వచ్చిన నేతలే కార్యనిర్వాహక రాజధానిని అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు గణేష్.. ఏదేమైనా సంక్షేమ పథకాలను అడ్డుకోవడం అన్యాయం అన్నారు. కాగా, ఈ మధ్యే సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌.. మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.. దీంతో.. వైఎస్సార్‌సీపీలో చేరకుండా ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల సంఖ్య నాలుగు చేరింది. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి ఈ తరహాలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి వాసుపల్లి తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. మరి టీడీపీ నేతలు ఈ రెబల్ ఎమ్మెల్యే కామెంట్లపై ఎలా స్పందిస్తారో చూడాలి.