తలనొప్పి తట్టుకోలేక రాజీపడ్డ ఎమ్మెల్యే శ్రీదేవి !

తలనొప్పి తట్టుకోలేక రాజీపడ్డ ఎమ్మెల్యే శ్రీదేవి !

ఇప్పటికి అవ్వాల్సిన రచ్చ అయిపోయింది. ఇంకా రచ్చ అయితే రాజకీయంగా ఎదగటం కష్టం అనుకున్నారో ఏమో రాజీ కొచ్చేశారట. ఇష్టా ఇష్టాలను పక్కన పెట్టి.. ఇగోలను విడిచిపెట్టి కుటుంబ సమేతంగా వెళ్లి కలసి పనిచేస్తే పోలా అని సర్దుకుపోయారట. ఇకపై ఎలాంటి విషయాలైనా కలిసి కూర్చొని సెటిల్‌ చేసుకుందామనే నిర్ణయానికి వచ్చేశారట.  
 
ఇద్దరినీ కలిసి పనిచేసుకోవాలని గతంలోనే చెప్పిన పార్టీ పెద్దలు!

గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతం తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ మధ్య కొన్నాళ్లుగా జరగుతున్న అంతర్గత కుమ్ములాటలు  వైసీపీలో హాట్ హాట్‌ చర్చ జరుగుతోంది. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారే అయినా బహిరంగంగా గొడవలు పడటం కామనైపోయింది. పార్టీ పెద్దలకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇద్దరినీ కలిసి పనిచేసుకోవాలని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు కూడా. అయినా అక్కడ ఓకే అంటూ.. బయటకు రాగానే షరా మామూలే అన్నట్లు రోడ్డెక్కేవారు. 
 
సోషల్‌ మీడియాలో రెండు వర్గాల పోస్టింగ్స్‌పై దుమారం!

ఇసుక విషయంలో ఎమ్మెల్యే శ్రీదేవి.. ఎంపీ నందిగం సురేష్‌ మధ్య  విభేదాలు తారాస్థాయికి చేరాయి. రెండు వర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం.. గొడవలు పడటం జరిగింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య పార్టీ పెద్దలు రాజీ కుదిర్చారు. ఇదిలా ఉండగానే.. ఇటీవల కాలంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు శ్రీదేవికి పెద్ద తలనొప్పిగా మారాయి.  పేకాట శిబిరంలో ఎమ్మెల్యే అనుచరులు పోలీసులకు చిక్కడంతో.. ఎంపీ సురేషే ఆ సమాచారం ఇచ్చి రైడ్‌ చేయించినట్లు ప్రచారం జరిగింది. రెండు వర్గాలు దీనిపై సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు ఊదరగొట్టాయి. 
 
వరుస వివాదాలతో పార్టీ పెద్దల నుంచి శ్రీదేవికి ఫోన్లు!

పొరపాట్లను సరిదిద్దుకునే క్రమంలో ముఖ్య అనుచరులను పార్టీ నుంచి  సస్పెండ్‌ చేసేందుకు శ్రీదేవి సిఫారసు చేయడంతో ఆ వివాదం కూడా తీవ్రమైంది.  ఎమ్మెల్యేకు గతంలో ఆర్ధికంగా సహకరించిన రవి అనే వ్యక్తి సెల్ఫీ వీడియో పార్టీలో చర్చకు కారణమైంది. ఇవి చాలవన్నట్టుగా  తుళ్లూరు సీఐని శ్రీదేవి బెదిరంచిన ఆడియో బయటకు రావడం రచ్చ రచ్చ అయింది. ఈ వరుస వివాదాలతో పార్టీ పెద్దల నుంచి శ్రీదేవికి ఫోన్లు వెళ్లాయట. కొన్నిసార్లు ఆమె డోంట్‌ కేర్‌ అన్నా.. పరిస్థితి చేయి దాటిపోతుండంతో ఎమ్మెల్యే శిబిరం పునరాలోచనలో పడిందట. 
 
బంధువులతో రెండుసార్లు ఎంపీ దగ్గరకు శ్రీదేవి రాయబారం!

ఈ వివాదాలన్నీ  ఎంపీ  వర్గం నుంచే బయటకు వస్తున్నాయన్న భావనలో శ్రీదేవి ఉన్నారట. అందుకే ఈ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు భర్త ఇతర కుటుంబ సభ్యులను వెంట పెట్టుకుని ఎంపీ సురేష్‌ను కలిసి మాట్లాడేందుకు MLA ప్రయత్నించారట. అయితే శ్రీదేవి వ్యవహారశైలితో గుర్రుగా ఉన్న సురేష్‌.. ఆమెతో మాట్లాడేందుకు అంగీకరించలేదట. దీంతో ముందుగా కుటుంబసభ్యులను ఎంపీ దగ్గరకు పంపారట శ్రీదేవి.  అలా రెండుసార్లు ఫ్యామిలీ మెంబర్స్‌ రాయబారాలు నడిపిన తర్వాత ఆదివారం రాత్రి ఎట్టకేలకు ఎమ్మెల్యే, ఎంపీ మధ్య  భేటీ జరిగిందట.  ఇంత వరకూ జరిగింది చాలు.. జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇకపై మనం మనం ఒకటంటూ ఎంపీ సురేష్‌ ముందు ప్రతిపాదన పెట్టారట శ్రీదేవి. అయితే మొదట్లో నిర్మొహమాటంగా మాట్లాడిన సురేష్‌ తర్వాత కుటుంబ పరంగా ఉన్న బంధుత్వాలు.. రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఓకే అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 
 
స్వయంగా శ్రీదేవి వెళ్లడంతో వివాదాలు ముగుస్తాయా?

ఇకపై ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు ఒక్కటవుతాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే గతంలోనూ ఇలాంటి రాజీ ఫార్మాలాలు జరిగాయి. పార్టీ పెద్దల ముందు తలూపి మరలా వివాదాల్లోకి వచ్చారు. కాకపోతే ఈసారి బంధువుల మధ్య జరిగిన రాజీ కావడం.. అదీ స్వయంగా శ్రీదేవి వెళ్లి మాట్లాడారు కాబట్టి ఇకపై వివాదాలు ముగుస్తాయా? లేక రాజకీయ పరిణామాలు ఎలా మారతాయనే అంశంపై  రాజధాని వైసీపీలో చర్చ జోరందుకుంది.