చిత్తూర్ జిల్లా కలెక్టర్ పై ఎమ్మెల్యే రోజా ఫైర్...!

చిత్తూర్ జిల్లా కలెక్టర్ పై ఎమ్మెల్యే రోజా ఫైర్...!

ఆ జిల్లా కలెక్టర్  రాష్ట్ర ఎన్నికల సంఘానికే కాదు.. అధికారపార్టీ ఎమ్మెల్యేకి టార్గెట్‌గా మారారు. ఓపెన్‌గానే ఫైర్‌ అవుతున్నారు. ఇన్నాళ్లూ దాగిన కోపం.. ఆవేదన బయటపెడుతున్నారో ఏమో.. చిత్తూరు జిల్లా వైసీపీ రాజకీయాలు మాత్రం హాట్‌ హాట్‌గా మారాయి. ఇంతకీ ఆ ఎమ్మెల్యేకు వచ్చిన బాధ ఏంటి? 

చిత్తూరు కలెక్టర్‌పై ఎమ్మెల్యే రోజా గుర్రు!

నగరి ఎమ్మెల్యే రోజా. చిత్తూరు జిల్లాలో మొదట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పేచీ. తర్వాత  డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో  తగువు. వైసీపీ అధిష్ఠానం ఈ విభేదాలను సర్దుబాటు చేసిందని అనుకుంటున్న సమయంలో.. శాసనసభ ప్రివిలైజ్ కమిటీ ముందు రోజా కన్నీళ్లు పెట్టుకోవడం చర్చకు దారితీసింది. ఇదే సమయంలో సొంతపార్టీ నేతలపై కాకుండా జిల్లా కలెక్టరు  భరత్ గుప్తాపై బాణం ఎక్కుపెట్టారు రోజా. కలెక్టర్ సహా ఎవరూ తనను పట్టించుకోవడం లేదని.. కనీస మర్యాద ఇవ్వడం లేదని ఎప్పటి నుంచో ఆమె గుర్రుగా ఉన్నారు. తనకు తెలియకుండానే పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మంత్రులతో నగరిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని..  సమాచారం ఇవ్వడం లేదని రోజా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే రోజా మధ్య మాటల తూటాలు!

ఆ మధ్య నగరి అసెంబ్లీ పరిధిలోకి వచ్చే పుత్తూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా ఆకస్మికంగా పర్యటించారు. అంబేద్కర్ సంఘం తరఫున దళితులకు కల్యాణ మండపం నిర్మాణానికి స్థల సేకరణ కోసం వెళ్లారు. ఈ పర్యటనకు సంబంధించిన సమాచారం రోజాకు ఇవ్వలేదట.  ఈ అంశంపై కొన్నాళ్లపాటు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. ఎమ్మెల్యే రోజా మధ్య కొన్నాళ్లు మాటల తూటాలు పేలాయి. పార్టీ పెద్దల జోక్యంతో రెండువర్గాలు కామయ్యాయి. 

రోజాకు సమాచారం ఇవ్వకుండానే నగరిలో ఇళ్లపట్టాల పంపిణీ!

ఇంతలోనే నగరి పరిధిలోని టీటీడీకి చెందిన 6వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి  కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. అట్టహాసంగా జరిగిన ఆ కార్యక్రమానికి సంబంధించి రోజాకు సమాచారం ఇవ్వలేదట. ఈ ఘటనతో ఎమ్మెల్యే మనస్తాపం చెందారట. రోజా APIIC చైర్మన్‌ కూడా. నగరి పరిధిలో TTD వారికి ఇచ్చిన ఇళ్లపట్టాల భూములు APIICకి చెందినవే. అయినా కలెక్టర్‌ ప్రొటోకాల్‌ పట్టించుకోలేదని ఆమె మండిపడుతున్నారు. 

కలెక్టర్‌పై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే రోజా!

తెర వెనక ఎవరున్నా.. సమాచారం ఇవ్వాల్సిన కలెక్టర్‌కు ఏమైందని ఫైర్‌ అవుతున్న రోజా.. ఆయనపై ఏకంగా అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేశారు. ప్రివిలేజ్‌ కమిటీ చైర్మన్‌ కాకాణి గోవర్దన్‌రెడ్డి  స్వయంగా కలెక్టర్‌కు ఫోన్‌ చేసి.. మళ్లీ అలాంటివి జరగకుండా చూడాలని చెప్పారు. దానికి ఆయన ఓకే అన్నారు. దీంతో ఈ ఎపిసోడ్‌ ముగిసిందని అనుకున్నా.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత కలెక్టర్‌పై  ఓ రేంజ్‌లో మాటల దాడి చేశారు రోజా. ప్రజాప్రతినిధులంటే కలెక్టర్‌కు గౌరవం లేదని  ఓపెన్‌గానే ఆమె విమర్శించారు. దీంతో మళ్లీ చర్చ మొదలైంది. మరి.. సొంత పార్టీ నేతలతోపాటు అధికారులపై రోజా ఎంత కాలం ఒంటరి పోరాటం చేస్తారో చూడాలి.