జగ్గారెడ్డిపై ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గుర్రుగా ఉన్నారా...?
ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే దేనికైనా సిద్ధపడ్డారా? అధిష్ఠానం నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్నా.. పంథాను మార్చుకోవడానికి సిద్ధంగా లేరా? తన దారేదో తాను చూసుకోవాలి అని డిసైడ్ అయ్యారా? అయితే ఆ అడుగులు ఎటు పడతాయి? గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోన్న చర్చ ఏంటి?
జగ్గారెడ్డి వెనక కాంగ్రెస్ ముఖ్య నాయకుడు ఉన్నారా?
తెలంగాణ పీసీసీకి కొత్త చీఫ్ నియామకంపై కసరత్తు మొదలైనప్పటి నుంచి తన స్వరం గట్టిగా వినిపిస్తున్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తన అభిప్రాయం చెప్పడంతోపాటు.. CLPలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశం తర్వాత ఆయన సీరియస్ కామెంట్స్ చేశారు. AICC ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ చేస్తోన్న అభిప్రాయ సేకరణపై అనుమానం ఉందన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలతో పార్టీలో రచ్చ రచ్చ అయింది. ఈ కామెంట్స్‌పై ఇంఛార్జ్ ఠాగూర్ గుర్రుగా ఉన్నారట. రాష్ట్రానికి ఇంఛార్జ్‌గా వచ్చిన తర్వాత సంగారెడ్డిలో తొలి పర్యటన చేశారు ఠాగూర్. ఆ సమయంలో నిర్వహించిన సభలో.. కాంగ్రెస్ ప్రభుత్వంలో జగ్గారెడ్డికి మంత్రి పదవి ఇస్తామని ప్రకటించిన తనపైనే ఇలాంటి ఆరోపణలు చేస్తారా అని ఆయన రుస రుసలాడుతున్నారట. ఈ కామెంట్స్‌పై నోటీసులు ఇవ్వడానికి కూడా సిద్ధపడింది కాంగ్రెస్ పార్టీ. అయితే జగ్గారెడ్డి వెనకాల పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు ఉన్నారనే అనుమానం AICCలో ఉందట.
ఏఐసీసీ ఇంఛార్జ్‌లను నమ్మొద్దన్న జగ్గారెడ్డి!
ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై ఈ దిశగా చర్చ జరుగుతున్న సమయంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు ఆయన రాసిన లేఖపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఆ లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు కాక పుట్టిస్తున్నాయట. మేం రాస్తున్న లేఖలు మీ దాకా వస్తున్నాయన్న నమ్మకం మాకు లేదు. అందుకే మీకు రాసిన లేఖను మీడియాకు కూడా విడుదల చేస్తున్నామని తెలిపారు జగ్గారెడ్డి. ఇలా మీడియాకు లెటర్ రిలీజ్ చేయడంపై పార్టీ నాయకులకు పెద్దగా అభ్యంతరం లేకపోయినా.. పీసీసీకి కొత్త చీఫ్ ఎంపికలో AICC ఇంఛార్జ్‌లను నమ్మొద్దని కోరారు. ప్రత్యేక సమాచారం తెప్పించుకుని విచారించాలని ఆ లేఖలో జగ్గారెడ్డి ప్రస్తావించారు. ఈ పద ప్రయోగం చూసిన తర్వాత పార్టీ నాయకులు చెబుతున్న మాట ఒక్కటే. ఏదో ఒకటి తేల్చుకోవాలనే జగ్గారెడ్డి ఇదంతా చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారట.
తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారా?
ఎంపీ రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వొద్దని మొదటి నుంచి బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు జగ్గారెడ్డి. ఇదే విషయాన్ని నేరుగా రేవంత్‌కు చెప్పారు కూడా. దీంతో పీసీసీ కొత్త చీఫ్ ఎంపిక తర్వాత జగ్గారెడ్డి తన దారి తాను చూసుకుంటారు అన్న చర్చ మొదలైంది. ఒకవైపు నాయకులెవ్వరూ హద్దుమీరొద్దని కాంగ్రెస్ కఠిన ఆదేశాలు జారీ చేస్తోంటే.. ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆయన తీరు చూస్తుంటే తాడోపేడో తేల్చుకునేలా ఉందని గుసగుసలాడుకుంటున్నారు.
రాజకీయంగా సైలెంట్ అవుతారా? పార్టీని వీడతారా?
నాగార్జునసాగర్ ఉపఎన్నిక ముగిసేవరకు పీసీసీ చీఫ్‌ను మార్చొద్దని అధిష్ఠానానికి లేఖ రాయడం కూడా జగ్గారెడ్డికే చెల్లింది. ఈ లేఖపై అప్పట్లోనే చర్చ జరిగింది. జగ్గారెడ్డి ప్రతిపాదన వెనక వ్యూహం ఏంటన్నది పార్టీ నాయకులు ఒక్కొక్కరికీ ఒక్కోలా అర్థమైంది. ఉత్తమ్ కోసమే ఈ ప్రతిపాదన చేశారని కొందరు.. ఇదంతా వ్యూహాత్మక ఎత్తుగడ అని మరికొందరు భావించారు. ఇప్పుడు జగ్గారెడ్డి లేఖలు ఇంకా పదును తేలాయి. పీసీసీ చీఫ్ నియామకం విషయంలో తాను అనుకున్నది నెరవేరకపోతే.. రాజకీయంగా సైలెంట్ అవుతారని కొందరి వాదన. మరికొందరైతే ఆయన కాంగ్రెస్‌లో ఉండబోరని అనుకుంటున్నారట. పార్టీ మారకపోవచ్చు కానీ రాజకీయాలకు.. రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలని జగ్గారెడ్డి నిర్ణయించినట్టు ఇంకొందరు చెబుతున్నారు. దీనికి అనుగుణంగా సంగారెడ్డిలో మరో భారీ కార్యాచరణకు ఆయన సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీనిపై ఒకటి రెండు రోజుల్లో యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తారని తెలుస్తోంది. మరి.. జగ్గారెడ్డి తీరుపై హైకమాండ్ ఏం చేస్తుందో.. ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)