అభివృద్ధికంటే వివాదాలే ముఖ్యమంటున్న అధికార పార్టీ నేతలు...

అభివృద్ధికంటే వివాదాలే ముఖ్యమంటున్న అధికార పార్టీ నేతలు...

అధికారంలో ఉన్న పార్టీ కదా.. నేతల మధ్య విభేదాలు సహజం అనుకుంటారు. కానీ.. ఎన్నాళ్లయినా కొన్నిచోట్ల నాయకులు తూర్పు పడమరగానే ఉంటారు. వారితోపాటు వారి కేడర్‌ కూడా అలాగే చేస్తుంది. అయితే కొల్లాపూర్‌ టీఆర్‌ఎస్‌లో వర్గపోరు రూటు మార్చేసింది. పదవులకు సైతం గుడ్‌బై చెప్పేస్తున్నారు స్థానిక ప్రజా ప్రతినిధులు. 

పార్టీ పెద్దలు చెప్పినా ఎవరి దారి వారిదే!

కొల్లాపూర్‌ గులాబీ పార్టీలో గల్లీ నుంచి నియోజకవర్గ స్థాయి వరకూ పంచాయితీలు నడుస్తున్నాయి. 
ఎమ్మెల్యే హర్షవర్దన్‌, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య ఆధిపత్య పోరు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ విభేదాలు కిందిస్థాయి ప్రజాప్రతినిధులకు కూడా ఇబ్బందిగా మారినట్లు లేటెస్ట్‌గా వినిపిస్తున్న టాక్‌. లోకల్‌ బాడీ ఎన్నికల్లో ఎక్కడా సహకరించుకోని పరిస్థితి. పార్టీ పెద్దలు చెప్పినా ఎవరిదారి వారిదే. ఈ క్రమంలో ఎవరెటో తేల్చుకోవాలని కేడర్‌పై ఒత్తిడి చేస్తున్నారట నేతలు. దీంతో ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక పదవులకు గుడ్‌బై చెప్పేస్తున్నారు నాయకులు. 

కన్నీటి పర్యంతమైన కోడేరు ఎంపీపీ!

చెప్పినట్లు వినకపోతే  అభివృద్ధి పనులు జరగబోవని.. నిధులు విడుదల కావని భయపెడుతున్నారట నాయకులు. ఇదే సమయం అనుకున్నారో ఏమో కానీ.. కొల్లాపూర్‌లోని అధికారులు సైతం స్థానిక ప్రజాప్రతినిధులను లెక్కచేయడం లేదట. కోడేరు ఎంపీపీ రాధ తనకెదురైన  అనుభవాలను బయటపెట్టి కన్నీటి పర్యంతమయ్యారు. మాజీ మంత్రి జూపల్లి వర్గంలో రాధ ఉండటంతో.. ఎమ్మెల్యే హర్షవర్దన్‌ వర్గం అడుగడుగునా ఆమెకు అడ్డుపడుతున్నారట. దీంతో అభివృద్ధి పక్కకు పోయి రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారట. 

కొల్లాపూర్‌ ఎంపీపీ  పదవికి రాజీనామా చేసిన  సుధారాణి
ఒత్తిళ్ల వల్లే సుధారాణి రాజీనామా చేశారా? 

ఈ వివాదం ఇలా ఉండగానే కొల్లాపూర్‌ MPP గాదెల సుధారాణి  తన పదవులకు రాజీనామా చేశారు. ఇది పార్టీలో చర్చకు దారితీసింది. ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలతో రాజీనామా  చేస్తున్నట్లు ఆమె చెప్పినప్పటికీ తెర వెనక ఏదో జరిగిందని అనుమానిస్తున్నారు. సుధారాణి ఎమ్మెల్యే హర్షవర్దన్‌ వర్గంలో ఉన్నారు. ఎమ్మెల్యే వచ్చిన అభిప్రాయ భేదాలే MPP రాజీనామాకు దారితీశాయనే ప్రచారం జోరందుకుంది. సుధారాణి భర్త  రత్న ప్రభాకర్‌రెడ్డి పార్టీలో చురుకుగా ఉండేవారు. గతంలో జూపల్లి వర్గంలో ఉన్నా.. తర్వాత హర్షవర్దన్‌ శిబిరంలో చేరిపోయారు.  మారిన రాజకీయ సమీకరణాలతో ఒత్తిళ్లు తట్టుకోలేక సుధారాణి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. 

అధికారుల తీరుతో వర్గపోరుకు మరింత ఆజ్యం!

ప్రస్తుతం నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్గాలు బహిరంగ ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఒకరినొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. ఎమ్మెల్యే సిఫారసు చేసిన పనులకే అధికారులు ఓకే చెబుతుండటంతో జూపల్లి వర్గం రుసరుసలాడుతోందట. ఈ వర్గపోరుకు అధికారుల తీరు ఇంకా ఆజ్యం పోస్తోందని టాక్‌. మాటలకే పరిమితమైన వర్గపోరు ఇప్పుడు క్షేత్రస్థాయిలో రాజీనామాలకు కారణం కావడంతో కలకలం మొదలైంది. ఇది ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.