భర్త రాజకీయ భవిష్యత్ కోసం ఆ ఎమ్మెల్యే పార్టీ మారుతారా?  

భర్త రాజకీయ భవిష్యత్ కోసం ఆ ఎమ్మెల్యే పార్టీ మారుతారా?  

టీడీపీకి ఆ ఎమ్మెల్యే గుడ్ బై చెప్పేస్తున్నారా? వైసీపీలో చేరేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారా? అందుకే భర్తకు పెత్తనం అప్పగించి ఇంటికే పరిమితమయ్యారా? బయటకెళ్లేందుకు ఇప్పటి నుంచే కారణాలు పోగు చేసుకుంటున్నారా? ఎవరా ఎమ్మెల్యే? 
 
రాజకీయ భవిష్యత్‌ కోసం పార్టీ మారిపోతారా? 

మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలుగా.. ఎర్రన్నాయుడి కుమార్తెగా రాజకీయాల్లోకి ప్రవేశించి తొలి ఎన్నికల్లోనే రాజమండ్రి శాసనసభ్యురాలిగా గెలుపొందారు ఆదిరెడ్డి భవానీ. వైసీపీ గాలిలోనూ ఆమె విజయం సాధించారు. భవానీ గెలిచినా.. టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో.. ఆదిరెడ్డి ఫ్యామిలీ ఉనికి ఏంటన్న చర్చ ఫలితాలు వచ్చిన వెంటనే మొదలైంది. రాజమండ్రి రాజకీయాల్లో సీనియర్‌ నాయకుడిగా ఉన్న అప్పారావు గతంలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తర్వాత టీడీపీలో చేరిపోయారు. ప్రస్తుతం కోడలు ఎమ్మెల్యే అయినా.. తన కుమారుడు ఆదిరెడ్డి వాసు రాజకీయ భవిష్యత్‌ కోసం అప్పారావు పార్టీ మారే ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 
 
చంద్రబాబు ఆగ్రహంతో ఎమ్మెల్యే భవానీ సైలెంట్‌!

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆదిరెడ్డికి వాసుకు ఎమ్మెల్యే టికెట్‌ అడిగారు అప్పారావు. కానీ.. భవానీని అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. ఫస్ట్‌ టైం గెలిచిన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆరు నెలలు టీడీపీలో యాక్టివ్‌గా ఉన్నారు భవానీ. అసెంబ్లీలో ప్రసంగాలు కూడా చేశారు. ఈ మధ్యే జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆమె ఓటు చెల్లకుండా పోవడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారట. అప్పటి నుంచి భవానీ సైలెంట్‌ అయినట్లు సమాచారం. కరోనా సాకుతో ఇంటి నుంచి బయటకు రావడం లేదు. భర్తకు పూర్తిగా పెత్తనం అప్పగించేసి సైలెంట్‌ అయ్యారట. దీంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్‌ అంటూ ఆమె భర్త షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారట. 
 
భర్త రాజకీయ భవిష్యత్‌ కోసమే ఎమ్మెల్యే సైలెంట్‌ అయ్యారా? 

ప్రస్తుతం భవానీ మామ ఆదిరెడ్డి అప్పారావు, భర్త  ఆదిరెడ్డి వాసులదే రాజమండ్రిలో పెత్తనం. భవానీతో మాట్లాడేందుకు ఎవరైనా ఎమ్మెల్యే ఇంటికెళ్లితే.. వీళ్లే సమాధానం చెబుతున్నారట.  టీడీపీ అధిష్ఠానం నిరసనలకు పిలుపులు వచ్చినా ఈ ఫ్యామిలీ పట్టించుకోవడం లేదట. పైగా ఎమ్మెల్యే వ్యవహార శైలి నచ్చడం లేదంటూ టీడీపీ నేతలు, మాజీ కార్పొరేటర్లు  వైసీపీలో చేరిపోయారు. భర్త రాజకీయ భవిష్యత్‌ కోసమే ఎమ్మెల్యే సైలెంట్‌ అయ్యారని గుసగుసలాడుకుంటున్నారు. త్వరలోనే ఆదిరెడ్డి కుటుంబం మొత్తం వైసీపీలో చేరుతుందని అనుకుంటున్నారు. 
 
టీడీపీని నిర్వీర్యం చేయడానికి ఆదిరెడ్డి ఫ్యామిలీని చేర్చుకుంటారా? 

ఉమ్మడి ఏపీలో తెలంగాణకు చెందిన కొండా సురేఖ దంపతులను కాదని అప్పారావును ఎమ్మెల్సీని చేశారు వైసీపీ అధినేత జగన్‌. అయితే కొద్దిరోజులకే అప్పారావు పార్టీ ఫిరాయించడంతో జగన్‌ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో ఆదిరెడ్డి కుటుంబాన్ని వైసీపీలోకి తిరిగి ఆహ్వానిస్తారా అన్న సందేహాలు ఉన్నాయట. అయితే ఆర్థికంగా.. రాజకీయంగా బలమైన ఆదిరెడ్డి కుటుంబాన్ని వైసీపీలో చేర్చుకుంటే రాజమండ్రిలో టీడీపీని నిర్వీర్యం చేయొచ్చనే  ఆలోచన కూడా ఉందట. 
 
గోరంట్ల జోక్యం పెరుగుతోందని టీడీపీ అధిష్ఠానానికి ఫిర్యాదు!

ఉన్నట్టుండి పార్టీ మారితే ఏం చెప్పాలన్నదానిపై కారణాలు వెతుక్కుంటోందట ఆదిరెడ్డి కుటుంబం. రాజమండ్రి అర్బన్‌లో రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జోక్యం చేసుకుంటున్నారని ఇటీవల కాలంలో ఆరోపిస్తున్నారు. అమరావతి రైతులకు మద్దతుగా రాజమండ్రిలో ధర్నా చేయడాన్ని తప్పుపడుతున్నారు. తమ నియోజకవర్గంలో గోరంట్ల జోక్యం పెరిగిపోతోందని ఆదిరెడ్డి కుటుంబం టీడీపీ అధిష్ఠానానికి  ఫిర్యాదు చేసిందట. వంకలేనమ్మ డొంకపట్టుకుని తిరిగినట్లు ఆరు నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యే  ఇలా గోరంట్లపై ఫిర్యాదు చేయడాన్ని టీడీపీలో చర్చకు దారితీసింది. ఇదంతా టీడీపీని విడిచిపోవడానికి ఆదిరెడ్డి ఫ్యామిలీ వేసిన ఎత్తుగడగా భావిస్తున్నారట. మరి.. ఏం జరుగుతుందో వేచి చూడాలి.