హైదరాబాద్‌ లో ఈరోజు కూడా మిస్సింగ్ కేసుల వెల్లువ !

హైదరాబాద్‌ లో ఈరోజు కూడా మిస్సింగ్ కేసుల వెల్లువ !

తెలంగాణలో వరుస మహిళల మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌లో ఇవాళ మరో ముగ్గురు యువతులు అదృశ్యమయ్యారు. గడిచిన 4 రోజుల్లో  తెలంగాణలో అదృశ్యమైన మహిళల సంఖ్య రెండు వందలు దాటేసింది. మొన్న ఒక్క రోజే పోలీస్ అధికారిక వెబ్‌సైట్‌లో 65 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వివిధ కారణాలతో యువతులు.. ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతూండటంతో మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టారు పోలీసులు. ఒక్కొక్కరు.. ఒక్కో కారణంతో మిస్సవుతున్నారు.

వరుసగా బయటపడుతున్న కేసుల్ని ఓ సారి చూద్దాం. కూకట్‌పల్లిలో ఇద్దరు పిల్లలతో కలిసి కనిపించకుండా పోయింది ఓ తల్లి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆమె భర్త. ఇక నిమ్స్ ఆసుపత్రిలోని క్వార్టర్స్లో నివాసం ఉంటున్న ఓ 19 ఏళ్ల  యువతి అదృశ్యమైంది.  వనిత అనే యువతి.. నిన్న  ఇంటర్వ్యూ కి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. ఆమె తిరిగి ఇంటికి చేరుకోక పోవడంతో కుటుంబ సభ్యులు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు.

 ఇక మరో ఘటనలో మైనర్ బాలికతో పాటు యువతి అదృశ్యమవ్వడం కలకలం రేపుతోంది. ట్యాంక్ బండ్ కు వెళ్లి వస్తామని చెప్పి ఖైరతాబాద్ ప్రేమ్ నగర్ లో నివాసం ఉండే శాంతకుమారి కూతురు 20 ఏళ్ల పావని, శాంతకుమారి సోదరి కుమార్తె నిన్న రాత్రి 11:00 గంటల సమయంలో ఇంటిని నుంచి వెళ్లారు. తెల్లవారినా ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన శాంతకుమారి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. మొత్తానికి ఈ వరుస మిస్సింగ్ కేసులు పోలీసులని టెన్షన్ పెడుతున్నాయని చెప్పక తప్పదు.