మంత్రి అప్పలరాజును టెన్షన్ పెడుతున్న కొత్త బాధ్యత...

మంత్రి అప్పలరాజును టెన్షన్ పెడుతున్న కొత్త బాధ్యత...

ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అనూహ్యంగా కేబినెట్‌లో చోటు సంపాదించారు. మంత్రి అయితే పూలపై నడకగా ఉంటుందని అనుకున్నారట. కానీ.. ఆయనకు అప్పగించిన ఓ బాధ్యత మాత్రం తలబొప్పి కట్టిస్తోందట. ఇంతకీ ఎవరా మంత్రి? ఏంటా సమస్య? 

మొదటి దశలో 8.7 మిలియన్‌ టన్నుల ఎగుమతి, దిగుమతి లక్ష్యం!

శ్రీకాకుళం జిల్లాలోని వలసలను తగ్గించాలనే ఉద్దేశంతో గడిచిన ఐదేళ్లుగా ఊగిసలాడుతున్న భావనపాడు పోర్టుపై కదలిక తెచ్చింది వైసీపీ సర్కార్‌. ఈ గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టు కోసం 2వేల 486 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. తొలిదశ నిర్మాణానికి 3 వేల 619 కోట్ల  ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.  2020-21 నాటికి మొదటి దశ పూర్తి చేసి 8.7 మిలియన్‌ టన్నుల దిగుమతులు, ఎగుమతల లక్ష్యంగా  పెట్టుకున్నారు పాలకులు. 

నిర్వాసితులతో మాట్లాడే బాధ్యత మంత్రికి అప్పగింత!

ఇదంతా బాగానే ఉన్నా.. భావనపాడు, మర్రిపాడు, శెలగపేట, దేవునల్తాడ గ్రామాల నిర్వాసితులు  తమ డిమాండ్లపై వెనక్కి తగ్గలేదు. జిల్లాలో వైసీపీకి అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నా.. నిర్వాసితులను ఒప్పించలేకపోతున్నారు. ఇప్పుడీ సమస్యను కొలిక్కి తెచ్చే బాధ్యతలను  మంత్రి సీదిరి అప్పలరాజుకు అప్పగించిందట ప్రభుత్వం. 

వెనక్కి తగ్గని నిర్వాసితులు.. తలపట్టుకున్న మంత్రి!

మంత్రి అప్పలరాజు స్థానికుడు.. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఆయనైతే నిర్వాసితులను చిటికెలో ఒప్పిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా అనుకున్న వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయట. DPRకు సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి 2 నెలలవుతున్నా నిర్వాసితులను ఒప్పించలేకపోతున్నారట. గ్రామస్తులు తమ డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గకపోవడంతో.. ఏం చెప్పాలో నాయకులకు పాలుపోవడం లేదట. 

నిర్వాసితుల సమస్య మంత్రికి ఇబ్బందిగా మారిందా?

పలు దశల్లో జరిగిన చర్చల ఆధారంగా కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశారట. వాటికి గ్రామస్తులు ససేమిరా అంటున్నారు. పైగా ఈ సమస్యలను కొలిక్కి తెస్తారనే  అప్పలరాజుకు మంత్రి పదవి ఇచ్చారనే ప్రచారం అధికార పార్టీలో జరుగుతోంది. గ్రామ గ్రామానికీ తిరుగుతూ.. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా.. ఎవరూ మాట వినకపోవడంతో అమాత్యుల వారికి తలబొప్పి కడుతోందట. ఒకవైపు ప్రభుత్వం టార్గెట్లు.. మరోవైపు నిర్వాసితుల సమస్య ఎక్కడిది అక్కడే ఉండటంతో అప్పలరాజుకు చాలా ఇబ్బందిగా మారిందని టాక్‌. 

భావనపాడు అంటేనే  మంత్రి సంతోషం ఆవిరి అవుతోందా? 

వైసీపీ వర్గాల్లోనూ ఈ పరిణామాలు చర్చకు దారితీస్తున్నాయి. భావనపాడు పోర్టు నిర్వాసితుల సమస్య మంత్రికి విషమపరీక్షగా మారిందనే వారు కూడా ఉన్నారు. అప్పలరాజుకు తొలిసారి ఎమ్మెల్యే అయిన సంతోషం.. మంత్రి కావడంతో ఇంకా రెట్టింపయ్యింది. కానీ.. భావనపాడు గురించి తలుచుకుంటే మాత్రం ఆ సంతోషం మొత్తం ఆవిరైపోతుందట. ప్రభుత్వ పెద్దలు ఆశించినట్టు సమస్యను కొలిక్కి తీసుకురాకపోతే అది తన పొలిటికల్ కెరీర్‌కు ఎక్కడ ప్రతికూలంగా మారుతుందోనని ఆందోళన చెందుతున్నారట మంత్రిగారు. మరి.. అప్పలరాజు ఈ టాస్క్‌ను ఎలా అధిగమిస్తారో చూడాలి.