రూటు మార్చేసిన మంత్రి పేర్ని నాని!

రూటు మార్చేసిన మంత్రి పేర్ని నాని!

ఆ మంత్రిగారు రూటు మార్చేశారు. ఆర్భాటాలకు దూరంగా ఉండటం.. జనాలతో కలిసి మెలిసి తిరగడంపై ప్రజల్లోనూ.. పార్టీలోనూ చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ అమాత్యుల వారు ఎందుకిలా చేస్తున్నారు? ఎవరా మంత్రి? ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?

మంత్రి అయినా నానిలో మార్పు లేదా? 

పేర్ని నాని. మచిలీపట్నం ఎమ్మెల్యే. సమాచారశాఖ మంత్రి కూడా. మచిలీపట్నం నుంచి ఐదుసార్లు పోటీ చేసిన ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్లీ ఓడకూడదని అనుకున్నట్టున్నారు. అధికార దర్పం ప్రదర్శించకుండా సామాన్యుడిలా ఉంటున్నారు. మొదటి నుంచి నాని తీరు డిఫరెంటే. రిక్షాలో అసెంబ్లీకి వెళ్లడం.. మచిలీపట్నం నుంచి రైలు వేస్తే ఆ రైల్లోనే మచిలీపట్నం నుంచి ప్రయాణించటం ఆయనకే చెల్లింది. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన ఇలాంటి పనులు పెద్ద చర్చనీయాంశం అవలేదు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేనే కాదు మంత్రి.  అయినా ఆయన వ్యవహార శైలిలో మార్పు రాలేదు. ఇది ఆయన నిర్వహిస్తోన్న శాఖ అధికారులకు ఇబ్బందిగా మారిందట. 

మంత్రి తీరుతో అధికారులకు టెన్షన్‌!

సాధారణంగా ప్రభుత్వానికి సంబంధించి అన్ని వివరాలను మీడియాకు అందించే కీలకమైన శాఖ ఐ అండ్ పీఆర్. అలాంటి శాఖకు మంత్రిగా ఉన్న పేర్ని నాని ఇప్పటికీ తనదైన శైలిలో నియోజకవర్గ పర్యటనలు చేయటం ఆ శాఖ అధికారులకు టెన్షన్ పుట్టిస్తోందట. మచిలీపట్నంలోనే మంత్రి నివాసం, క్యాంప్‌ ఆఫీసు ఉన్నాయి. ఇక్కడ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎదురుగా తెలిసిన వారు ఎవరు కనిపిస్తే వారి బైక్‌ ఎక్కి వెళ్లిపోతారు. నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లాలన్నా అనుచరుల వాహనంలో ప్రయాణిస్తారు. కొన్నిసార్లు ఆటోలో వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. 

మంత్రి ఏం చేస్తే అది సోషల్‌ మీడియాలో ట్రోల్‌!

పర్యటనల సమయంలో ఏ వాహనం కనిపిస్తే దానిని నడుపుతారు పేర్ని నాని. ప్రొక్లయిన్‌, ట్రాక్టర్‌ సైతం తిప్పేశారు. పార తీసుకుని రోడ్డు పనిచేయడం.. హోంగార్డులతో కలిసి భోజనం చేయడం..ఇలా అప్పటికప్పుడు నిర్ణయం తీసేసుకుంటారు నాని.  మంత్రి ఇలా చేసిన కాసేపటికి ఆ దృశ్యాలు ఏదో ఒక వాట్సాప్‌ గ్రూపులోనో, సోషల్‌ మీడియాలోనో కనిపిస్తాయి. వాటిని చూసి ఐ అండ్‌ పీఆర్‌ అధికారులు అవాక్కవుతున్నారు. మంత్రి వెంటే ఉంటోన్న గమనించలేకపోతున్నారట. 
అమాత్యుల వారు ఏ సమయంలో ఏం చేస్తారో.. వాటిని క్యాచ్ చేయగలమో లేమో అంటూ నిత్యం టెన్షన్ పడుతున్నారట అధికారులు, మంత్రిగారి సిబ్బంది. 

మంత్రి నాని రూటు మార్చేశారని టాక్‌!

రెండుసార్లు ఓడిపోవడం నానికి నచ్చలేదట. జనంలో కలిసి  ఉన్నా అప్పట్లో దూరం పెట్టడం ఎందుకో అర్థంకాని నాని రూటు మార్చేశారు.  సామాన్యుడిగా కంటే అతి సామాన్యుడిగా మారిపోయారట.  వచ్చిన వాళ్లందరినీ పలకరిస్తూ వారి సమస్యలు వింటున్నారట. మరి మంత్రి స్ట్రాటజీ జనానికి అర్థం అవుతుందో లేదో చూడాలి.