నూతన ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ పాలసీ విడుదల

నూతన ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ పాలసీ విడుదల

రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్‌ హబ్‌గా మార్చే ప్రణాళికలో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) నూతన పాలసీని తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. తాజా విధానాలకు అనుగుణంగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది. ఈ మేరకు  మర్రి చెన్నా‌రెడ్డి మానవ వన‌రుల కేంద్రంలో తెలం‌గాణ ఈవీ సమ్మి‌ట్‌లో తెలంగాణ ప్రభుత్వం రూపొం‌దిం‌చిన నూతన ఎలక్ట్రిక్ వెహి‌కిల్‌ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాల‌సీ 2020-2030 ని ఐటీ, పరి‌శ్ర‌మల శాఖ మంత్రి కేటీఆర్, రవా‌ణా‌శాఖ మంత్రి  పువ్వాడ అజయ్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్‌ వాహనాల హాబ్ గా మార్చాలనే లక్ష్యంతో ఈ నూతన విధానాన్ని ప్రకటించారు. పట్టణాల్లో వాహనాలకు ప్రత్యేక ఛార్జింగ్  కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు. జాతీయ రహదారుల పక్కన ప్రతీ 50 కిలోమీటర్ చొప్పున ఛార్జింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇంధన నిల్వలకు కొత్త విధానం అమలు చేయనున్నారు. 2020-2030 వరకు ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, వినియోగంపై విధానమైన ప్రకటన చేశారు. పాలసీ విడుదల కార్యక్రమంలో నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ కుమార్ గోయెంకా, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీఎ‌స్‌‌ఐ‌ఐసీ ఎండీ నర్సింహా రెడ్డి, ఎస్ బ్యాంకు చైర్మన్ సునీల్ మెహతా తదితరులు పాల్గొన్నారు.