కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. కేటీఆర్ ఫైర్

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. కేటీఆర్ ఫైర్

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదని స్పష్టం చేసింది కేంద్రం.. సమాచార హక్కు చట్టం ప్రశ్నకి ఈ మేరకు సమాధానం ఇచ్చింది రైల్వేశాఖ.. దీంతో కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్.. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడం కేంద్రంలోని బీజేపీకి అలవాటుగా మారిందన్న ఆయన.. ఐటీఐఆర్ ప్రాజెక్టు మాదిరే, కాజీపేట రైల్వే కోచ్ ప్రాజెక్టుకి బీజేపీకి మంగళం పాడుతుందని మండిపడ్డారు.. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పలుమార్లు కేంద్రాన్ని సీఎం కేసీఆర్ కోరారని గుర్తుచేసిన ఆయన.. 150 ఎకరాల విలువైన భూమిని సేకరించి కోచ్ ఫ్యాక్టరీ కోసం కేంద్రానికి రాష్ట్రం ఇచ్చిందన్న ఆయన.. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుంటే వరంగల్‌తో పాటు తెలంగాణ రాష్ట్రానికి సైతం తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుందన్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు తెలంగాణకు దక్కాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కు అన్నారు కేటీఆర్.. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని రద్దు చేసే అధికారం బీజేపీకి లేదన్నారు. 

తెలంగాణకు దక్కాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామని ప్రకటించారు మంత్రి కేటీఆర్.. ఈ మేరకు రానున్న పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సాక్షిగా ఆందోళన చేస్తారన్నారు. రైల్వేల విషయంలో కేంద్రం రాష్ట్రానికి ప్రతిసారి అన్యాయం చేస్తూనే ఉందన్న ఆయన.. తాజాగా కేంద్రం ప్రకటించిన బడ్జెట్లలో రాష్ట్రంలోని పెండింగ్ రైల్వేలైన్ లకు కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. కేంద్రం గొప్పలు చెప్పుకుంటున్న హైస్పీడ్ ట్రైన్, బుల్లెట్ రైలు విషయంలోనూ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం మొండిచేయే చూపిందన్న ఆయన.. రైల్వేలను మొత్తం ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. భారత రవాణా వ్యవస్థకు గుండెకాయ అయిన రైల్వేలను ప్రైవేట్ పరం చేయడం జాతి వ్యతిరేక చర్యనే అవుతుందన్నారు మంత్రి కేటీఆర్.