బస్సు యాత్ర కాదు.. కాశీయాత్ర చేసినా ప్రయోజనం లేదు..!

బస్సు యాత్ర కాదు.. కాశీయాత్ర చేసినా ప్రయోజనం లేదు..!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తలపెట్టిన బస్సు యాత్రపై సెటైర్లు వేశారు ఏపీ మంత్రి కన్నబాబు... చంద్రబాబు అసలు బస్సు యాత్ర దేనికోసం చేస్తున్నారు? అని ప్రశ్నించిన ఆయన.. టీడీపీ అధినేత కాశీయాత్ర చేసినా ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు. రూ.2 వేల కోట్ల వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే చంద్రబాబు బస్సుయాత్రకు పూనుకున్నారని ఆరోపించిన కన్నబాబు.. ఐటీ సోదాల్లో చంద్రబాబు పీఏ, అనుచరుల లెక్కలు బయటపడ్డాయన్నారు. ఇక, ప్రభుత్వం చేసిన తప్పులేంటో ముందే చెప్పాలని నిలదీసిన మంత్రి.... చంద్రబాబు గ్రాఫిక్స్ వెనుక నిజాలను బయటపెట్టడం తప్పా? అని ప్రశ్నించారు. మరోవైపు గత ప్రభుత్వం వడ్డీ రాయితీ చెల్లించలేదని మండిపడ్డ కన్నబాబు.. సహకార బ్యాంకులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. డీసీసీబీలు, సహకార బ్యాంకులను బలోపేతం చేయాలని నిర్ణయించామని వెల్లడించారు.