సొంత నియోజకవర్గంలో విభేదాలతో సతమతమవుతున్న మంత్రి

సొంత నియోజకవర్గంలో విభేదాలతో సతమతమవుతున్న మంత్రి

ప్రత్యర్థి పార్టీ చేస్తున్న ఆరోపణలతో ఆ మంత్రి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇలాంటి సమయంలో గోరుచుట్టుపై రోకటిపోటులా మారింది ఆయన పరిస్థితి. సొంత నియోజకవర్గంలో కొత్త సమస్య వచ్చిందట. నేతల మధ్య విభేదాలు.. పంచాయితీలు తీర్చలేక తలపట్టుకుంటున్నారట. ఇంతకీ ఎవరా మంత్రి? ఏమా కథ? 

ఆలూరు వైసీపీ పరిణామాలతో మంత్రికి తలనొప్పులు!

గుమ్మనూరు జయరామ్‌. ఏపీ మంత్రి. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ESI స్కామ్‌ కేసులో మంత్రి జయరామ్‌పై కూడా టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. వీటి నుంచి బయటపడేందుకు ఆపసోపాలు పడుతున్నారాయన. ఈ ఘటనకు కొద్దిరోజుల ముందే ఆయన నియజకవర్గంలో పేకాట క్లబ్ వ్యవహారం రాజకీయంగా సంచలనం రేపింది. ఇలా వరుస వివాదాలు మంత్రిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ సంకట సమయంలో మంత్రికి మద్దతుగా మాట్లాడేవారే కరువయ్యారు. కాలం కలిసి రావడం లేదో ఏమో కానీ.. ఇప్పుడు ఆలూరు వైసీపీలో జరుగుతున్న పరిణామాలు కూడా మంత్రిగారికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయట. 

వర్గాలుగా విడిపోయిన వారికి సర్ది చెప్పలేకపోతున్నారా? 

ఆలూరు నియోజకవర్గంలో ఆరు మండలాలు  ఉన్నాయి. ఇక్కడ వైసీపీకి బలమైన కేడర్‌ ఉంది. పార్టీలో మొదటి నుంచి ఉంటోన్న వారు పనులు కావడం లేదని జయరామ్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. అలాగే వర్గపోరు అధికమైందని సమాచారం. దేవనకొండ మండలంలో కొద్దిరోజుల క్రితం వైసీపీలోని రెండు వర్గాలు కర్రలతో కొట్టుకున్నాయి. జడ్పీటీసీ అభ్యర్థికి, పార్టీలోని మరో వర్గానికి అస్సలు పడటం లేదట. వీరికి ఎలా సర్ది చెప్పాలో మంత్రికి అర్థం కావడం లేదట. 

ఏదో ఒకటి తేల్చాలని మంత్రి దగ్గరకే పంచాయితీ!

మంత్రి సొంత మండలం చిప్పగిరిలోనూ  అదే స్థాయిలో వర్గపోరు ఉందట. ఇక్కడ పేకాట క్లబ్‌ నిర్వహిస్తూ పోలీసులకు చిక్కిన గుమ్మనూరు నారాయణ మంత్రికి వరుసకు సోదరుడు. ఈ మండలంలో నారాయణకు, జడ్పీటీసీ అభ్యర్థి విరూపాక్షి మధ్య పోరు కొనసాగుతోంది. పేకాట క్లబ్‌ వ్యవహారంలో నారాయణ పార్టీకి చెడ్డపేరు తెచ్చారనే అభిప్రాయంలో ఉన్నారట వైసీపీ వర్గాలు. దీంతో విరూపాక్షి ఏం చెప్పినా చేయవద్దని అధికారులకు చెప్పారట నారాయణ. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఏదో ఒకటి తేల్చుకోవాలని మంత్రి దగ్గర పంచాయితీ పెట్టారట విరూపాక్షి.

గొడవలు శ్రుతిమించి రాగాన పడుతున్నాయా?

హోలగొంద మండలం ఎల్లార్తిలోనూ  వైసీపీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. చివరకు రెండువర్గాలు మంత్రి దగ్గరకు వెళ్లగా.. ఇద్దరికి సర్దిచెప్పలేకపోయారట జయరామ్‌. ఆలూరు, హాలహర్వి మండలాల్లోనూ పార్టీ కేడర్‌ వర్గాల మధ్య నలిగిపోతోందట. ఈ విభేదాలు, గొడవలు శ్రుతిమించి రాగాన పడుతున్నాయే కానీ.. సమసి పోయే పరిస్థితి లేదట.  పార్టీకి నష్టం కలిగించే పరిస్థితులు ఉన్నా.. వాటిని మంత్రి చక్కదిద్దడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఆదాయం కోసం పనిచేసేవారికే ప్రాధాన్యం!

పైగా.. పార్టీ కోసం పనిచేసేవారికంటే.. ఆదాయం కోసం పనిచేసే వారికే ప్రాధాన్యం ఉందన్న విమర్శలు ఎక్కువగా ఉన్నాయట. వీటిని ఉపేక్షిస్తూ పోతే.. బలహీనంగా ఉన్న ప్రత్యర్థి పార్టీలు బలపడే అవకాశం ఉందని..  పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండబోవన్న  అంశాన్ని మర్చిపోకూడదని పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారట. మరి.. మంత్రి జయరామ్‌ ఇప్పటికైనా ఆలూరు వైసీపీలోని సమస్యలు పరిష్కారానికి ఫోకస్‌ పెడతారో లేదో చూడాలి.