మంత్రికి గుడ్ మార్నింగ్ ఎంపీకి బ్యాడ్ మార్నింగ్...

మంత్రికి గుడ్ మార్నింగ్ ఎంపీకి బ్యాడ్ మార్నింగ్...

తెల్లవారగానే ప్రజలకు గుడ్‌ మార్నింగ్‌ చెబుతున్నారట మంత్రి. ఆయన వెంట నియోజకవర్గ కోఆర్డినేటర్‌ కూడా వెళ్తున్నారు. దీంతో ఎంపీకి బ్యాడ్‌ మార్నింగ్‌ మొదలైందనే  టాక్‌ వినిపిస్తోంది. ఇంకేముంది.. రచ్చ గెలవాలని వచ్చిన మంత్రికి ముందుగా ఇంట గెలవాల్సిన పరిస్థితి నెలకొందట. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. 

గుడ్‌ మార్నింగ్‌ రాజమండ్రి అంటోన్న మంత్రి వేణు!

సాధారణంగా ఎక్కడైనా ఓ మంత్రి పర్యటన అంటే.. శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవం కోసం అలా వచ్చి.. ఇలా వెళ్లిపోతారు. అయితే దీనికి  భిన్నంగా మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ  తెల్లవారకుండానే వచ్చి  రాజమండ్రిలో వాలిపోతున్నారు. ప్రతి ఇంటి తలుపులు తడుతూ.. గుడ్ మార్నింగ్ అని పలకరించి మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ ఆరా తీస్తున్నారు. మంత్రి చేపట్టిన ఈ గుడ్‌ మార్నింగ్‌ కాన్సెప్ట్‌ అధికార పార్టీలో ఆసక్తికర చర్చగా మారింది. రాజమండ్రికి  40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు వేణుగోపాలకృష్ణ. ఈ మధ్యే కేబినెట్‌లో చేరారు. రామచంద్రపురంతోపాటు రాజమండ్రిలోనూ మంత్రి ఫోకస్‌ పెట్టడానికి కారణమేంటని పార్టీ వర్గాలకు అంతుచిక్కడం లేదట. 

మున్సిపల్‌ కార్పొరేషన్‌లో వైసీపీ జెండా రెపరెపలే లక్ష్యమా?

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్‌, రూరల్‌ రెండూ టీడీపీలో ఖాతాలో పడ్డాయి. ఎంపీ సీటు మాత్రం వైసీపీ గెలుచుకుంది. టీడీపీని బలహీనపరిచి.. వైసీపీని శక్తిమంతంగా చేయడానికి పూనుకున్నారో లేక అధిష్ఠానం ఆశీసులతో రంగంలోకి దిగారో కానీ.. మంత్రి వేణు మాత్రం తెల్లవారుజామున ఐదు గంటలకే నగరంలో వాలిపోతున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో వైసీపీ జెండా రెపరెపలాడించాలనే లక్ష్యంగా వెళ్తున్నట్లు గుసగుసలాడుకుంటున్నారు. రాజమండ్రి అర్బన్‌ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవానీ, రూరల్‌ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. క్షేత్రస్థాయిలోనూ టీడీపీ పట్టుడల లేదన్నది ఆ పార్టీ నేతలు చెప్పే మాట. అందుకే మున్సిపల్‌ కార్పొరేషన్‌ను మళ్లీ నిలబెట్టుకుంటామని తెలుగు తమ్ముళ్లు అంటున్నారట. 

ఎంపీ భరత్‌ వర్సెస్‌ ఎమ్మెల్యే జక్కంపూడి!

వైసీపీ పవర్‌లోకి వచ్చిన ఈ పదిహేను నెలల్లో రాజమండ్రిలో వైసీపీ ఏ మేరకు బలపడిందో గానీ.. ఎంపీ మార్గాని భరత్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య మాత్రం ఆధిపత్య పోరు తీవ్రంగా ఉందట. ఈ విషయం తెలుసుకున్న పార్టీ పెద్దలు వార్నింగ్‌ ఇచ్చినా సమస్య కొలిక్కి రాలేదని అంటారు. ఈ పరిస్థితుల్లో రాజమండ్రి పార్టీ ఇంఛార్జ్‌గా ఉన్న శివరామ సుబ్రమణ్యం ఎంత వరకూ పార్టీని తీసుకెళ్తారనే చర్చ జరుగుతోంది.  అందుకే వైసీపీ అధిష్ఠానం కొత్త వ్యూహంతో రాజమండ్రిలో ముందుకెళ్తోందని అనుకుంటున్నారు. రాజమండ్రి బాధ్యతను మంత్రికి వేణుకు అప్పగించడం వల్లే ఆయన రామచంద్రపురంలో ఎప్పటి నుంచో అమలు చేస్తోన్న..  గుడ్‌ మార్నింగ్‌ కాన్సెప్ట్‌ను రాజమండ్రిలో అమలు చేస్తోన్నట్లు కామెంట్స్‌ చేస్తున్నారు.  వారంలో రెండు రోజులు ఇక్కడే ఉంటున్నారు. రెండు డివిజన్లను పూర్తిగా చుట్టేశారు. 

రాజమండ్రిలో పార్టీ గ్రూపులను ఎలా ఎదుర్కొంటారు?

ఇంత వరకు బాగానే ఉన్నా.. మంత్రి వేణు ప్లాన్‌ ఎంత వరకూ వర్కవుట్‌ అవుతుందన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారట. అలాగే గ్రూపులుగా ఉన్న రాజమండ్రి వైసీపీ నేతలను ఒకేతాటిపైకి ఎలా తీసుకొస్తారన్నది కూడా ప్రశ్నంగానే ఉందట. నగరంలోని 50 డివిజన్లలో వార్డుల వారీగాఉన్న పార్టీ  ఇంఛార్జులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారట మంత్రిగారు.  కోఆర్డినేటర్‌ కూడా మంత్రి వెంట నడుస్తున్నారు. దీంతో మంత్రి గుడ్‌ మార్నింగ్.. ఎంపీకి బ్యాడ్‌ మర్నింగ్‌ అయిందా అని కామెంట్స్‌ చేస్తున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.