తెలంగాణాలో ఓ మినీ ఇండియా గ్రామం.. ఎక్కడుందో తెలుసా ?

తెలంగాణాలో ఓ మినీ ఇండియా గ్రామం.. ఎక్కడుందో తెలుసా ?

విభిన్న సంస్కృతులు, వివిధ ప్రాంతాలు, కులాలు, మతాలు, ఆచార అలవాట్లు, సంస్కృతి, వేషధారణలు ఉన్న వారు  ఒకేచోట, ఒకే గ్రామంలో కనిపించడం చాలా అరుదు. ఇక గ్రామంలోని వారంతా వలస వచ్చిన వారే కావడం మరో  విశేషం. 'మినీ ఇండియా'గా పిలుచుకునే ఆ గ్రామమేంటో, అదెక్కడుందో ఓ లుక్కేద్దాం. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు తమ వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు 1907లో అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం పాలమూరు - కర్ణాటక సరిహద్దుల్లో క్రిష్ణ నదిపై వంతెన నిర్మించింది. ఉత్తర ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి ఇటు వైపు ఉన్న కర్ణాటక, తమిళనాడు వరకు రైలు సౌకర్యం ఏర్పడింది. 

అదే సమయంలో ఇటువైపు ఉన్న తెలంగాణలోనూ ఓ రైల్వే స్టేషన్‌ ఉండాలనే తలంపుతో నది పక్కనే ఏర్పాటుచేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లాలోనే ఈ రైల్వే స్టేషన్‌ మొదటిది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో సికింద్రాబాద్‌ తరువాత రెండో అతి పెద్ద రైల్వేస్టేషన్, బ్రాడ్‌ గేజ్‌ కలిగిన స్టేషన్‌గా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో అప్పట్లో ఊరు, ఇళ్లు లేదు. కేవలం రైల్వే ఉద్యోగులు మాత్రమే ఇక్కడ నివసిస్తుండేవారు. వారిలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్‌ తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉండటం, స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం, ఉద్యోగ విరమణ తరువాత కూడా ఇక్కడే ఉండటంతో కాలక్రమేణ అది ఓ గ్రామంగా, క్రిష్ణ నది ఒడ్డున ఉండటంతో అది కాస్త క్రిష్ణ గ్రామంగా మారిందని, భిన్న సంస్కృతి, సంప్రదాయాలకు నెలవుగా ఉండటంతో ఈ గ్రామాన్ని మినీఇండియాగా పిలుచుకుంటున్నామని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. 

1911లో హైదరాబాద్‌ మొదటి తాలుక్‌ దార్‌ (కలెక్టర్‌) గోవింద్‌ నాయక్‌ తన భార్య రంగు బాయి జ్ఞాపకార్థం తిరుపతి నుంచి ఓ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి క్రిష్ణనది ఒడ్డున ప్రతిష్ఠించాడు. పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు మహదేవ్‌ దీక్షిత్, నారాయణ భట్, రాఘవేంద్రచారి, గణపతిభట్, భీమాచారి అనే బ్రాహ్మణులను నియమించి వారి భృతి కోసం కొంత భూమిని కేటాయించారు.

ఆ కుటుంబాలకు చెందిన వారే ఇప్పుడు వందల సంఖ్యలో ఇక్కడ నివసిస్తూ కర్మకాండలు, నిత్యకర్మ, సావత్రిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వీరు నివసించే వీధిని ధర్మశాలగా పిలుస్తున్నారు. కర్మకాండలకు ప్రసిద్ధి చెందిన వాటిలో మొదటిది కాశీ కాగా రెండోది క్రిష్ణగా ప్రసిద్ది కెక్కింది. ప్రతిరోజూ వివిధ రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో కర్మకాండలు, అస్తికలు, చితాభస్మం నదిలో కలిపేందుకు ఇక్కడకు వస్తుంటారు. రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ, ఎన్‌టీఆర్‌ అస్థికలను కూడా ఇక్కడే నిమజ్జనం చేశారంటే ఈ ప్రాంత ప్రాధన్యత ఏంటో ఇట్లే అర్దమవుతోంది.

రాజస్థాన్ నుంచి జైనులు, మహరాష్ట్ర నుంచి రాజ్ పుత్ లు , ఉత్తరప్రదేశ్ , డిల్లీ నుంచి అగర్వాల్స్ , రజాకార్ల పాలనలో ముస్లీంలు , ఇలా వివిధ ప్రాంతాలకు చెందిన వారు , వ్యాపారం , ఉద్యోగ నిర్వహణ లో భాగంగా ఇక్కడికి వచ్చి సుమారు 70  ఏండ్ల నుంచి ఇక్కడే సెటిల్ అయ్యారు.   కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా మరికొందరు ఇక్కడే నివాసాలు ఏర్పరచుకోని తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. విభిన్న కులాలు , మతాలు ,  ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ  నివాసం ఉంటున్నావారు భిన్నత్వంలో  ఏకత్వం మాదిరిగా అంతా కలిసి మెలిసి జీవిస్తుండటం తో ప్రస్తుత నారాయణ పేట జిల్లా లోని క్రిష్ణా గ్రామాన్ని మిని ఇండియాగా పిలుచుకుంటున్నారు.