మిమిక్రీ ఆర్టిస్ట్ హరి కిషన్ కన్నుమూత

మిమిక్రీ ఆర్టిస్ట్ హరి కిషన్ కన్నుమూత

ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నటుడు హరి కిషన్ కన్నుమూసారు. ఆయన వయసు 57 ఏళ్లు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబందిత అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఈరోజు పరిస్థితి చేయి దాటి మరణించారు. ఆయనను అనారోగ్య కారణాలతో సికింద్రాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే ఆయన తుది శ్వాస విడిచారు. మే 30, 1963న ఏలూరులో శ్రీ లక్ష్మీ నరసింహాచార్యులు శ్రీమతి రంగమణి దంపతులకు జన్మించిన హరికిషన్ కు స్వరమే సర్వస్వం..స్వరమే ఆయన జీవితం.

ఆయన పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లాలోనైనా అక్షరాలు నేర్చింది, పెరిగింది హైదరాబాద్ లోనే. ఎనిమిదేళ్ళ ప్రాయంలో తన మేనత్త చూడామణితో కలిసి విశ్వ విఖ్యాత మిమిక్రీ కళాకారుడు డా. నేరెళ్ళ వేణుమాధవ్ గారి ప్రదర్శనను చూసి హరికిషన్ ఏనాటికైనా మిమిక్రి కళలో అత్యున్నత స్థానాన్ని పొందాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి చుట్టుపక్కల వారిని, టీచర్లను, తెలిసిన వారిని అనుకరించి నవ్వించేవారు. వారి ప్రోత్సాహంతో వయసుతోపాటే తన అభిరుచిని పెంచుకున్నారు. తన మొట్టమొదటి ప్రదర్శనను జనవరి 12, 1971న ఇచ్చారు. 

12 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా ఫిజిక్స్, మ్యాథ్స్ పాఠాలు చెప్పినా మిమిక్రీని మాత్రం వదలలేదు. ఎప్పటికప్పుడు పరిసరాలను గమనిస్తూ ఇతరుల మాటల ద్వారా, మీడియా అబ్జర్వేషన్ ద్వారా, స్నేహితులు, విశిష్ఠ వ్యక్తుల హావభావాలను గమనిస్తూ వాటికి సమకాలీనతను జోడించి ప్రేక్షకుల నాడిని పసిగట్టి మిమిక్రీ కళలో నిష్ణాతను సంపాదించుకుని అద్భుత ధ్వన్యనుకరణా పటిమను తన స్వంతం చేసుకున్నారు. ఇప్పటి వరకూ 10,000 కు పైగా దేశ, విదేశాలలో ప్రదర్శనలిచ్చి ఎన్నో అవార్డులు, రివార్డులు పొంది తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు. 

మిమిక్రీ మాస్టర్, ధ్వనిమిషన్ - హరికిషన్, స్వర్ణ ధ్వన్యనురణ దిగ్గజం, బహు స్వర కంఠీరవ, శత కంఠ ధ్వన్యనుకరణ ధురీణ వంటి అనేకానేక బిరుదులను, సన్మానాలను పొందారు. మిమిక్రీని కూడా వృత్తిగా తీసుకోవచ్చని త్రికరణ శుద్ధిగా విశ్వసించి నిరూపించిన హరికిషన్ ఎన్టీఆర్ ఏఎన్నార్ మొదలుకొని అలనాటి హీరోలతో పాటు ఆ తర్వాత తరం హీరోలైన కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్తో పాటు ఇప్పటి తరం హీరోలైన ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వరకు అందరి హీరోల గొంతులను అనుకరించి మైమరిపించారు.