జమ్ముకశ్మీర్ కి చెందినవారిని జాగ్రత్తగా చూసుకోండి

జమ్ముకశ్మీర్ కి చెందినవారిని జాగ్రత్తగా చూసుకోండి

దేశంలోని ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న జమ్ముకశ్మీర్ కి చెందినవారు, విద్యార్థులు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న జమ్ముకశ్మీర్ కి చెందినవారికి బెదిరింపులు, హెచ్చరికలు వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన హోమ్ శాఖ తక్షణమే సూచనలు జారీ చేసింది. దీనిపై స్పందించిన స్థానిక ప్రభుత్వాలు కశ్మీరీల, కశ్మీరీ విద్యార్థుల రక్షణ,భద్రతకు చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను సూచించాయి. 

కొన్ని రాష్ట్రాలలో జాతి ఆధారిత హింసాకాండ ప్రారంభమైనట్టు తెలిసింది. జమ్ము, డెహ్రాడూన్, హర్యానాలోని అంబాలా, బీహార్ లలో కశ్మీరీలపై దౌర్జన్యం జరుగుతున్నట్టు వార్తలు అందుతున్నాయి. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో చదువుకుంటున్న కొందరు కశ్మీరీ యువకులు తమను వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుల్వామాలో భద్రతా బలగాలపై జరిగిన దారుణమైన ఆత్మాహుతి దాడి తర్వాత భయంతో కొందరు ఇంటి యజమానులు తక్షణమే ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. బీహార్ రాజధాని పాట్నాలో కశ్మీరీల దుకాణాలపై దాడులకు దిగుతున్నారు. 24 గంటల్లోగా బీహార్ వదిలి కశ్మీర్ కి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరిస్తున్నారు.