కేరళ సీఎం అభ్యర్థిగా మెట్రో మ్యాన్ !

కేరళ సీఎం అభ్యర్థిగా మెట్రో మ్యాన్ !

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ ప్రారంభం అయింది. పుదుచ్చేరి తో సహా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మొత్తం ఐదు రాష్ట్రాలకు పార్టీ అభ్యర్థులను బిజేపి ఖరారు చేయనుంది. ఈ రోజు సాయంత్రం బీజేపీ “కేంద్ర ఎన్నికల కమిటీ” సమావేశం కానుంది.  బిజెపి కేంద్ర కార్యాలయంలో నేడు సాయంత్రం 6.30 గంటలకు సమావేశం జరగనుంది. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల పార్టీ నాయకులతో బీజేపీ అగ్రనేతలు సమావేశం అవుతున్నారు. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి ఐదు రాష్ట్రాల పార్టీ ఇంచార్జ్ నేతలు హాజరుకానున్నారు. పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల పై చర్చ జరగనుంది. మరో పక్క బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లు కూడా హాజరుకానున్నారు. ఇక మరో పక్క కేరళ బీజేపీ సీఎం అభ్యర్థిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్ పేరును ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రకటించారు. శ్రీధరన్ కు ఉన్న క్లీన్ ఇమేజ్ తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది.