శ్రామికుడా.. నీకు వందనం...మేడే స్పెషల్

శ్రామికుడా.. నీకు వందనం...మేడే స్పెషల్


చరిత్ర తన గర్బంలో అనేక చేదు నిజాలని దాచుకున్నది. వర్తమానానికి తెలియని ఎన్నో నిప్పులాంటి  నిజాలు చరిత్రలో దాగి ఉన్నాయి. రేపటి నవ చరిత్ర నిర్మాణానికి గత చారిత్రక అనుభవాల నుండి గుణపాఠాలు లభిస్తాయి. నేడు 134వ మేడే ! నూట ముప్పై నాలుగు సంవత్సరాల కింద మొట్టమొదటిసారి ఎనిమిది గంటల పని దినం కోరుతూ పోలీసు కాల్పులలో మరణించిన కార్మికుల నెత్తుటితో తడిసిన నేల, ఒరిగిపోయిన వీరుడి చొక్కానే ధిక్కార పతాకంగా ఎగరేసి ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన నేల చికాగో నగరం. 

పత్రిక సంపాదకుడే కార్మికోద్యమానికీ, ప్రదర్శనకూ నాయకుడై, బూటకపు విచారణలో మరణశిక్షకు గురై కార్మిక మేధావి ఐక్యతను చాటిన నేల హే మార్కెట్.
ఏండ్ల తరబడిగా ఎక్కువ గంటలు పని చేయించు కొంటూ,తక్కువ వేతనాలను ఇస్తూ తమ శ్రమశక్తిని దోపిడీ చేస్తున్న సమయంలో మేమూ మనుషులమేననీ, మాశక్తికి కూడా పరిమితులుంటాయ నీ,ఇంకా ఈచాకిరిని మేం చేయ లేమని  జీవించే మానవ హక్కు సాధన కోసం లక్షలాది  మంది శ్రమజీవుల అమరులైనారు, లక్షలాది మంది  క్షతగాత్రులు అయ్యారు, వందల మంది బలిదానాల పునాదిగా లో ప్రధాన్యత ఏర్పడింది. 

అందుకే కార్మికవర్గ హక్కుల పోరాట దీక్షాదినం మేడే, 
కష్టజీవుల బతుకుదెరువు ఉద్యమాల దిక్సూచి మే డే. 
కార్మికవర్గ విముక్తికి అవసరమైన సైద్ధాంతిక ఎజెండాను ఇచ్చింది మేడే… 
కార్మికవర్గం తన హక్కుల కోసమే కాదు, అస్తిత్వాన్ని నిర్దేశించుకోవడం కోసం జరిపిన దీర్ఘకాల పోరాటాల ఫలితమే మేడే…. 

ఆ క్రమంలో నిర్వహించిన త్యాగపూరిత ఉద్యమాలు, పోరాటాల నుండి ఆవిర్భవించిందే ఎర్రజెండా…. మేడే దీక్షా దినం కూడా. కార్మికవర్గం తన హక్కుల హననం, అణచివేత, దుర్భర జీవన పరిస్థితులపై నిర్దిష్ట ఉద్యమ కార్యాచరణను నిర్దేశించి, పోరాటానికి ప్రేరేపించిన దినమే మేడే. వేతన బానిసత్వం రద్దు, సమాన పనికి సమాన వేతనం, తదితర డిమాండ్లు పురుడు పోసుకున్న దినం మేడే… 8 గంటల పనిదినం డిమాండు సాకారమైన రోజు మేడే.

మేడే  యాధృచ్చికంగా ఏర్పడింది కాదు. ఒక చారిత్రక పరిణామ క్రమంలో కార్మికవర్గం దోపిడీ, పీడన, అణచివేతల పై జరిపిన దీర్ఘకాల పోరాటాల నుండి ఆవిర్భవించింది…. 1806లో ఫిలడెల్ఫియా (అమెరికా)లో చెప్పులు కుట్టే కార్మికులు ‘మెకానిక్స్ యూనియన్’ పేరుతో మొదటగా సమ్మె చేశారు. ఇంగ్లాండ్లో 1818లో స్టాల్ పోర్టు పట్టణంలో బట్టల ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులు సమ్మె చేశారు. ఫ్రాన్స్ లోని ‘లయన్స్’ పట్టణంలో 1831లో సిల్క్ పరిశ్రమ కార్మికులు సమ్మె చేశారు. నైరీషియా (జర్మనీ)లోని నేత పని కార్మికులు 1849లో తిరుగుబాటు చేశారు. ఆనాటి కార్మికుల బాధలు వర్ణనాతీతం. రోజుకు పది నుంచి పన్నెండు గంటలు గొడ్డు చాకిరీ చేయాల్సి ఉండేది. 

ఎంత చాకిరి చేసినా సగటున రోజుకు వచ్చే ఆదాయంతో కడుపు నిండడమే కష్టంగా ఉండేది. ఉత్పత్తి లేకుండా సామాజిక జీవనయానం లేదు. సమాజ పురోగమనం అంతకన్నా లేదు. మా శ్రమ నుండి పెట్టుబడి పుట్టింది. పెట్టుబడి అస్తిత్వం, మనుగడ శ్రమశక్తిలో వున్నది. శ్రమశక్తిని దోచుకున్న పెట్టుబడి శ్రమజీవులను వేతన బానిసలుగా మార్చింది. దుర్భర పరిస్థితులకు లోను చేసింది. అసమానతలు సృష్టించింది. కార్మిక ప్రతిఘటనోద్యమంలో రక్తతర్పణలు, బలిదానాలు అనివార్యమన్న నిజాన్ని ఆవిష్కరిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న స్థానిక పోరాటాలు క్రమేపీ ఉద్యమ రూపం దాల్చిన ఫలితంగా 1837 లో అమెరికన్ ప్రభుత్వం 10 గంటల పనిదినాన్ని నిర్ణయించింది. మరో ఇరవయ్యేళ్ళపాటు ఈ నిర్ణయం అమలు జరిగింది. అయితే మరికొద్ది కాలానికే కార్మికవర్గం 8 గంటల పనిదినం కోసం ఆందోళన చేయసాగింది. 

అమెరికాలోనేగాక ఇంగ్లాండులో, చివరకు ఆస్ట్రేలియాలో కూడా ఇలాంటి డిమాండ్లే వెలువడసాగాయి. అమెరికాలోని కార్మికవర్గం  ఆ దేశంలో కమ్యూనిస్టు పార్టీ పుట్టక ముందే అనేక ఆందోళనలు చేసింది. 1882-86 మధ్యకాలంలో అప్పటి షికాగోలో కార్మికులు చేసే సమ్మెలను యాజమాన్యాలు నిర్దాక్షిణ్యంగా అణచివేసేవి. తరచు లాకౌట్లు ప్రకటిస్తూ శ్రామికుల మనోధైర్యాన్ని దెబ్బతీయడం, కార్మిక హక్కుల రక్షణ కోసం ఏర్పడిన సంఘాల సభ్యులను ఏదో ఒక సాకు చూపి పనిలో నుంచి తొలగించడం, వారి స్థానంలో తాము చెప్పినట్టు వినే తమ కిరాయి తొత్తులని నియమించుకోవడం పరిశ్రమాధిపతులకు మామూలే. వాటిలో భాగంగా 1886 ఏప్రిల్ లో అనేక చోట్ల సమ్మెలు, ప్రదర్శనలు జరిగాయి. వాటి కొనసాగింపుగా మే ఒకటవ తేదీన అమెరికా అంతటా ఒకరోజు సమ్మె జరపాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం సమ్మెను అణచివేసేందుకు పూనుకుంది.

చికాగో నగరంలో మే మూడవ తేదీన మెక్ కార్మిక్ హార్వెస్టింగ్ యంత్ర పరిశ్రమలోని కార్మికులు ‘8 గంటల పనిదినం’ కోసం సమ్మె జరిపి, శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్నారు. ఆ ప్రదర్శనపై పోలీసులు దాడిచేసి, కొందరు కార్మికనేతలను అరెస్టు చేశారు. ఈ అరెస్టులను ప్రతిఘటించిన కార్మికులపై పోలీసులు అమానుషంగా కాల్పులకు తెగబడ్డారు. ఆ కాల్పుల్లో అనేక మంది కార్మికులు మరణించడం, గాయపడడం జరిగింది. దీనితో రెచ్చిపోయిన కార్మికులు షికాగోతో సహా అమెరికాలోని పలు నగరాలలో మే నాల్గవ తేదీన సాధారణ సమ్మెకు పిలుపునిచ్చారు. అనేక చోట్ల పోలీసులు కార్మికులపై విరుచుకుపడ్డారు. 
అనేక మంది గాయపడ్డారు. కొంత మంది మరణించారు. దాంతో మరింతగా ఆగ్రహించిన కార్మికులు నాలుగవ తేదీన హే మార్కెట్ ప్రాంతంలో సభ జరిపేందుకు పిలుపునిచ్చారు. పోలీసు యంత్రాంగ కుట్రలో భాగంగా అక్కడకు వచ్చిన పోలీసులపై వారి ఏజంటుతో బాంబుదాడి చేయించారు. ఒక పోలీసు మరణించాడు. దానిని సాకుగా చూపి పోలీసులు జరిపిన కాల్పులలో అనేక మంది కార్మికులు మరణించారు. రక్తం ఏరులై పారింది. అయినా కార్మికులు వెనక్కు తగ్గలేదు. బాంబు పేలుడు పై ఎనిమిది మంది కార్మికులను ఇరికించి ఒక తప్పుడు కేసు పెట్టారు. కార్మికనాయకుల్లో పార్సన్స్, స్పెస్ ఫిషర్ - ఎంగెల్ ఉరిపాలయ్యారు. ఇలా మేడే పోరాటం కార్మికుల రక్తంతో ప్రాణత్యాగంతో అమరత్వం సంపాదించుకుంది. 

కార్మికవర్గ స్థితిగతులను మెరుగు పరచాలన్నా కార్మికవర్గ విమోచన జరగాలన్నా, ముందుగా పనిదినం చట్టబద్ధంగా పరిమితం చేసి తీరాలంటూ,మార్క్స్ మహాశయుని నాయకత్వాన ఫస్ట్ ఇంటర్నేషనల్ తన జెనీవా సమావేశంలో(1866 సెప్టెంబరు) తీర్మానించింది. తెల్లజాతి కార్మికులనీ నల్లజాతి కార్మికులనీ భేదాలు విడిచి, నీగ్రో దాస్య విమోచన తర్వాత గూడా వర్ణవివక్ష చూపెట్టక, కార్మికులంతా ఒకటి కావాలని మార్క్స్ తన ʹకేపిటల్ʹలో రాశాడు. అట్లాంటిక్ మహాసముద్రానికి అద్దరీ, యిద్దరీ, ఇలా ఒకే నినాద బంధంతో ఏకమయ్యాయి.

ఫ్రెంచి మహా విప్లవ సంకేత దినమైన జూలై 14 న 1889 లో పారీస్ నగరంలో ఆ విప్లవం శతాబ్ది దినాన, వివిధ దేశాల సంఘటిత కార్మికోద్యమ నాయకులు సమావేశమై, కార్ల్ మార్క్సు, ఎంగెల్సులు నిర్మించి నడిపిన ఫస్ట్ ఇంటర్నేషనల్ ను పునరుద్ధరించారు. 1890 లగాయతు ప్రతి యేడు మే ఒకటిన కార్మికులు శెలవు దినం చేసుకుని ప్రదర్శనలు సాగించాలని యీ రెండవ ఇంటర్నేషనల్ ఆదేశించింది.  

మేడే సంప్రదాయం పోరాట సంప్రదాయమే కాగలిగింది గాని లొంగుబాటు సంప్రదాయం కాలేదు. కాగూడదు కూడా. ఆర్థిక కోర్కెలేగాక అంతర్జాతీయ కార్మికవర్గ సంఘీభావం, సార్వజనిక వోటింగు హక్కు, సామ్రాజ్యవాద యుద్ధ వ్యతిరేకత, ప్రదర్శన హక్కు, రాజకీయఖైదీల విడుదల, సంఘ నిర్మాణ హక్కు-- అన్నిటిని మించి పెట్టుబడిదారీ వ్యవస్థను మొత్తంగానే ఎదుర్కొని పోరాడవలసిన బాధ్యత - ఇలాంటి యితర డిమాండ్లతో, గుర్తింపుతో ʹపోరాడే వారిదే ఎర్రజండాʹ అనే వాస్తవం ఇప్పటికి చెరిగిపోకుండా ఉంది.