అన్యమత ఉద్యోగుల ఎఫెక్ట్...ఏపీ సీఎస్ మీద ఫిర్యాదు 

అన్యమత ఉద్యోగుల ఎఫెక్ట్...ఏపీ సీఎస్ మీద ఫిర్యాదు 

తిరుమలలో అన్యమత ప్రచారం వివాదం అటుతిరిగి ఇటుతిరిగి ఏపీ సిఎస్ మెడకు చుట్టుకుంది. కొద్దిరోజుల క్రితం తిరుపతి నుండి తిరుమల వెళ్తున్న బస్సు టికెట్ వెనుక క్రైస్తవ మతస్తులకి పుణ్య స్థలం అయిన జెరూసలేం యాత్రకు సంబందించిన యాడ్స్ ఉండడంతో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే కలగజేసుకుని వివాదం పెద్దది కాకుండా చూసుకుంది. ఈ క్రమంలో ఎపీలోని ప్రముఖ దేవాలయాలలో హిందువులు కాకుండా వేరే మతం వాళ్ళు పనిచేయడం సరికాదని చెబుతూ వేరే మతం వారు ఉంటె కనుక వారిని విధుల నుండి తొలగించేలా చర్యలు తీసుకున్నారు. తాజాగా ఈ చర్యల మీదనే మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు క్రైస్తవ ప్రచార పరిరక్షణ సమితి’ అధ్యక్షుడు జెరూసలేం మత్తయ్య.

గతంలో ఓటుకు నోటు కేసులో ప్రముఖంగా ఈయన పేరు వినపడింది. ఇప్పుడు సీఎస్ పై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, మానవ హక్కుల ఉల్లంఘన, దేశద్రోహాల కింద కేసులు నమోదు చేయాలని, వెంటనే విధుల్లోంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎల్వీ సుబ్రమణ్యం ఇటీవల జారీ చేసిన జీవో ప్రకారం శ్రీశైలం, తిరుమల దేవాదాయశాఖలో పని చేస్తున్న దళిత, క్రైస్తవ, ముస్లిం ఉద్యోగులను విధుల్లోంచి తొలగించారని, హిందూ మతాన్ని స్వీకరిస్తేనే ఉద్యోగంలో ఉంటారని భయపెడుతున్నారని వారి ఇళ్లకు వెళ్లి వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘనే అంటూ మత్తయ్య హెచ్చార్సీ దృష్టికి తీసుకువెళ్లారు.