మాస్టర్ రివ్యూ: అభిమానుల అంచనాలు అందుకుందా?

మాస్టర్ రివ్యూ: అభిమానుల అంచనాలు అందుకుందా?

విజయ్ దళపతి తమిళ అగ్ర హీరోలలో ఒకడు. అతడి సినిమా అంటే అభిమానులు వేయికళ్ళతో ఎదురుచూస్తుందటారు. విజయ్ తన సినిమాలతో తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అతడి కొత్త సినిమా ‘మాస్టర్’ సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న తెలుగు చిత్రాలతో సమానంగా క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాను ‘ఖైదీ’ దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందించాడు. ఈ చిత్రం మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ అంచనాల్ని ‘మాస్టర్’ ఏమాత్రం అందుకున్నాడో చూద్దాం రండి..

కథ: జేడీ (విజయ్) సైకాలజీ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తుంటాడు. ఆ కాలేజీ మేనేజ్మెంట్ అంతా జేడీకి వ్యతిరేకం. అయినా విద్యార్థుల్లో మాత్రం అతడికి మంచి ఫాలోయింగ్ ఉంటుంది. కాలేజీ యాజమాన్యం అభీష్టానికి వ్యతిరేకంగా జేడీ స్టూడెంట్ ఎలక్షన్స్ జరగాల్సిందే అని పట్టుబడతాడు. ఈ ఎన్నకలు ఇష్టం లేకపోయినా విద్యార్థుల ఒత్తిడి కారణంగా కాలేజీ యాజమాన్యం ఓకె చెబుతోంది. కానీ ఈ ఎన్నకలు జరగాలంటే కొన్న షరతులు ఉన్నాయని.. ఈ ఎన్నికల సమయంలో ఏమైనా గొడవలు జరిగితే జేడీ కాలేజీ విడిచి వెళ్లిపోవాలని ప్రిన్సిపల్ చెప్తాడు. ఎన్నికలు ఎటువంటి గొడవలు లేకుండా జరుగుతాయి. కానీ ఫలితాల తర్వాత పెద్ద గొడవ జరగడంతో జేడీ కాలేజీని విడిచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో అతను జువైనల్ అబ్జర్వేషన్ హోంలో ఉపాధ్యాయుడిగా పని చేయాల్సిన అవసరం పడుతుంది. ఐతే అక్కడికెళ్లాక జేడీకి అనూహ్యమైన పరిస్థితులు ఎదురవుతాయి. జువైనల్ హోంలో బాల నేరస్థుల్ని అడ్డు పెట్టుకుని బయట అరాచకాలు చేస్తున్న భవాని (విజయ్ సేతుపతి)ని జేడీ ఢీకొట్టాల్సి వస్తుంది. జువైనల్ హోంను గాడిన పెడుతూ భవానిపై జేడీ ఎలా విజయం సాధించాడన్నది మిగతా కథ.

నటీనటులు: ఈ సినిమాలో ప్రధాన పాత్ర జేడీగా విజయ్ తన అభిమానుల్ని అలరించేలా నటించాడు. అతడి స్క్రీన్ ప్రెజన్టేషన్ చాలా అద్భుతంగా ఉంది. అతడి లుక్స్, పెర్ఫామెన్స్ స్టైలిష్‌గా ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాలు, పాటల్లో కూడా విజయ్ అభిమానుల్ని ఆకట్టుకున్నాడు. ప్రతి విషయంలో విజయ్ అభిమాలను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నించాడు. అయితే అభిమానుల కోరుకున్నం స్థాయిలో విజయ్ వారిని అలరించాడా అన్నది సందేహం. ఇందులో కథానాయిక మాళవిక మోహన్ చాలా అందంగా కనిపించింది.  విజయ్ సేతుపతికి పెర్ఫామెన్స్ పరంగా సినిమాలో అగ్ర స్థానం దక్కుతుంది. అతడి లుక్ పాత్రకు జీవం పోసినట్లు సరిగ్గా సరిపోయింది. చాలా సింపుల్‌గా ఉంటూనే బలమైన ఇంపాక్ట్ చూపిస్తుంది. సేతుపతి పాత్ర చాలా ఆసక్తికరంగా ఆరంభమవుతుంది. ఒక దశ వరకు బాగా సాగుతుంది. కానీ తర్వాత అది కూడా రొటీన్ అయిపోతుంది. జువైనల్ హోంలో ఖైదీగా అర్జున్ దాస్ నటనకు కూడా మంచి మార్కులు పడతాయి. మిగతా నటీనటులు కూడా వారి శాయశక్తుల ప్రయత్నించారు.

సాంకేతిక వర్గం: అనిరుధ్ రవిచందర్ ఒక సూపర్ స్టార్ సినిమాకు అవసరమైన మాస్ బీట్స్ ఇచ్చాడు. నేపథ్య సంగీతంతో మోత మోగించేశాడు. మాస్టర్ కమింగ్.. చిట్టి స్టోరీ పాటలు ఆకట్టుకుంటాయి. అతడి పాటలు.. బ్యాగ్రౌండ్ స్కోర్ లో ఒక స్టైల్ కనిపిస్తుంది. కాకపోతే హీరో ఎలివేషన్ సీన్లలో ఆర్ఆర్ మరీ లౌడ్ గా అనిపిస్తుంది. మనకు విజయ్ సూపర్ స్టార్ కాదు కాబట్టి.. ఏంటీ గోల అనే ఫీలింగ్ కలిగిస్తుంది కొన్ని చోట్ల బ్యాగ్రౌండ్ స్కోర్. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం బాగుంది. సినిమా అంతటా విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ‘మాస్టర్’ ఆద్యంతం భారీతనానికి లోటు లేదు. డైలాగ్స్ తమిళం నుంచి మక్కీకి మక్కీ దించేసినట్లు అనిపిస్తాయి తప్ప ప్రత్యేకత ఏమీ లేదు. డబ్బింగ్ విషయంలో.. వాయిస్ ల ఎంపికలో ఇంకొంచెం జాగ్రత్త వహించి ఉండాల్సిందనిపిస్తుంది. ఇక దర్శకుడు లోకేష్ కనకరాజ్ విషయానికి వస్తేప.. అతను తనపై పెట్టుకున్న అంచనాలను నిలబెట్టుకోలేకపోయాడు. ‘ఖైదీ’ సినిమాలో కథకు.. కొత్తదనానికి ప్రాధాన్యమిస్తూనే హీరోయిజం ఎలివేట్ అయ్యేలా చూసుకున్న అతను.. ఈసారి మాత్రం కథ మీద అంత అంత శ్రద్ధ పెట్టకుండా ఎలివేషన్లకే పరిమితం అయ్యాడు. ముఖ్యంగా ద్వితీయార్ధంలో కథ.. స్క్రీన్ ప్లే అన్నీ కూడా ఫ్లాట్ గా అనిపిస్తాయి. విలన్ పాత్రను తీర్చిదిద్దే విషయంలో పెట్టిన శ్రద్ధ సినిమా అంతటా అతను చూపించి ఉంటే బాగుండేది.

చివరగా: మాస్టర్.. రొటీన్ మసాలా

రేటింగ్-2.25/5