పెళ్లిళ్ల కాలం..కరోనార్పణం...!

పెళ్లిళ్ల కాలం..కరోనార్పణం...!


వేసవి వచ్చిందంటే చాలు పెళ్లిళ్లు హోరెత్తిపోతుంటాయి. వేలాది జంటలు వివాహ బంధంలోకి అడుగుపెడతాయి. మ్యారేజీ హాల్స్‌, ఆలయాలు ఒకటేమిటి అన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి. అలాంటి సీజన్‌కు మంగళం పాడింది కరోనా.  కరోనా మహమ్మారి దాడితో పెళ్లిళ్లు, శుభకార్యాలు అన్నీ బంద్‌. ఏప్రిల్‌, మే నెలలో జరగాల్సిన వివాహాలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. మంచి ముహూర్తం లేదా వధూవరుల జాతకాల ప్రకారం ముహూర్త బలం బాగుందని భావించిన వాళ్లు మాత్రం ఆ మూడుముళ్లూ వేయించేస్తున్నారు. పెళ్లికొడుకు, పెళ్లి కుమార్తె తరపున వేళ్లపై లెక్కపెట్టేంత మందే బంధువులు హాజరవుతున్నారు. 

పెళ్లంటేనే 3,4నెలల ముందు నుంచే ఇంట్లో సందడి మొదలవుతుంది.  పెళ్లి చూపులు, నిశ్చయ తాంబూళాల దగ్గర మొదలుపెట్టి బంధువుల రాకపోకలు, బంగారు ఆభరణాల ఖరీదు,  పట్టుచీరలు, పట్టు వస్త్రాల కొనుగోళ్లు, వెరైటీ వెరైటీ ఐటమ్స్‌తో విందు.. ఇలా కసరత్తు చేస్తారు. ఏప్రిల్‌, మే నెలల్లో లగ్గాలు పెట్టుకున్న వాళ్లు ఇలాంటి కసరత్తు చాలానే చేశారు. వందలు, వేల సంఖ్యలో శుభలేఖలు పంచిపెట్టారు. కానీ.. ఏం లాభం? కరోనా లాక్‌డౌన్లతో మొత్తం తలకిందులైంది. 

ఇప్పుడు పెళ్లి చేసుకుందామన్నా కొత్త బట్టలు, వధువరూల దుస్తులు కొనుగోలు చేయడానికి దుకాణాలు లేవు. మంగళసూత్రాలు, నల్లపూసలు, కాళ్ల మెట్టెలు,  ఇలా ఏవీ కొనాలన్నా జువెలరీ షాప్స్‌ క్లోజయ్యే ఉన్నాయి. 

ఎంత పెద్ద సెలబ్రెటీ, సంపన్నులైనా కరోనా కష్ట కాలంలో పెళ్లి చేసుకోవాలంటే సాదాసీదాగా తంతు కానిచ్చేయాల్సిందే. ఖరీదైన దుస్తులు వేసుకున్నా.. ముఖానికి మాస్క్‌ పెట్టుకోవాల్సిందే. ఉన్న కొద్దిమందీ భౌతికదూరం పాటించక తప్పడం లేదు. కరోనా సమయంలో పెళ్లిళ్లు జరుపుకోవచ్చని వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం.. కొన్ని నిబంధనలను రూపొందించింది. వాటిని తూచా తప్పకుండా పాటిస్తామని అంగీకరిస్తేనే.. పెళ్లికి అనుమతిస్తున్నారు అధికారులు. 


కుమార్తె లేదా కుమారుడి పెళ్లి వైభవంగా నిర్వహిద్దామని ప్లాన్‌ చేసుకున్న తల్లిదండ్రుల ఆశలపై కరోనా నీళ్లు జల్లింది. ప్రభుత్వ నిబంధనలు ముందరి కాళ్లకు బంధనాలు వేశాయి.ధూమ్‌ధామ్‌గానే మ్యారేజ్‌ చెయ్యాలని అనుకుంటున్న వారు మాత్రం పెళ్లిళ్లను వాయిదాలు వేసుకుంటున్నారు. కుదిరితే శ్రావణ మాసం లేకపోతే కార్తీక మాసం అని లెక్కలు వేసుకుంటున్నారు. కరోనా ఉధృతిని చూస్తే ఇప్పట్లో శాంతించేలా లేదు. మరో రెండేళ్లపాటు ఆంక్షల మధ్యే  జీవించక తప్పదు. మరి.. శ్రావణం, కార్తీకం అని లెక్కలు వేసుకుంటున్నవారి పరిస్థితి ఏంటి? అప్పుడు కూడా ముహూర్తాలను వాయిదా వేసుకుంటారా? లేక సాదాసీదాగానే కానిచ్చేస్తారా?