విశాఖ మ‌న్యంలో బాంబు పేలుడు.. క్ష‌మాప‌ణ‌లు కోరిన మావోయిస్టులు..!

విశాఖ మ‌న్యంలో బాంబు పేలుడు.. క్ష‌మాప‌ణ‌లు కోరిన మావోయిస్టులు..!

విశాఖ ఏజెన్సీలో ప్ర‌మాద‌వ‌శాత్తు బాంబు పేల‌డం.. అందులో ఇద్ద‌రు మృతిచెంద‌డంపై క్ష‌మాప‌ణ‌లు కోరారు మావోయిస్టులు... విశాఖ మన్యంలో ప్రమాదవశాత్తు బాంబ్ పేలి మృతి చెందిన పెదబయలు మండల ప్రాంతం జాముగుడా పంచాయితీకి చింతలవీధి గ్రామానికి చెందిన మోహనరావు, అజయ్ కుమార్ కుటుంబ సభ్యులు మమ్మల్ని మన్నించాలని కోరుతూ పెదబయలు కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి సుధీర్ ఆడియో టేపును విడుద‌ల చేశారు. ఈ నెల 1వ తేదీన జరిగిన ఘటనకు సంబంధించిన‌ నిజాలు ప్రజలకు మీడియా ద్వారా తెలియపర్చాలని ఆడియోలో మావోలు పేర్కొన్నారు.

ఈ పేలుడులో మృతి చెందినవారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు మావోయిస్టులు.. మృతి చెందిన ఇరువురు తమ కుటుంబ సభ్యులేనని పేర్కొన్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది అనే అంశాన్ని ఆడియో వివరించారు. జులై 19వ తేదీన లండులు వద్ద పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు తమను చుట్టుముట్టిన నేపథ్యంలో వారిని ప్రతిఘటించే క్రమంలో ప్రాణ రక్షణ కొరకు ఏర్పాటు చేసిన మందుపాత్ర పేలి వారు చ‌నిపోయార‌ని.. దీనిని ఆసరాగా తీసుకుని పోలీసులు తమపై గ్రామాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సుధీర్ ఆ ఆడియోలో పేర్కొన్నారు.